తెలంగాణ టీడీపీ కథ కంచికేనా.. కొత్త అధ్యక్షుడిని నియమించరా?
వేలాది మంది కార్యకర్తలు ఉన్నా, పార్టీకి కార్యవర్గం అంటూ లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పసుపుపార్టీ పరిస్థితి తయారైంది.
రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీని జాతీయ స్థాయికి విస్తరించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు శాఖలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏపీలో ఆ పార్టీ అధికార పార్టీగా ఉండగా, రాష్ట్రంలో పార్టీ కార్యవర్గం కూడా యాక్టివ్ గానే ఉంది. కానీ, ఇదే సమయంలో తెలంగాణ టీడీపీ ఉలుకు, పలుకూ లేకుండా పోయింది. వేలాది మంది కార్యకర్తలు ఉన్నా, పార్టీకి కార్యవర్గం అంటూ లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పసుపుపార్టీ పరిస్థితి తయారైంది.
తెలంగాణ గడ్డపై ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి ఆ నేతలతో ఎంతో అనుబంధం ఉంది. రాష్ట్ర విభజన వరకు ఎన్నో విజయాలను తెలంగాణ ప్రాంతంలోనే అందుకుంది టీడీపీ. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు ఎక్కువగా ఉండటంతో టీడీపీని తమ పార్టీగా వారు అక్కున చేర్చుకున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావంతో టీడీపీ చాలావరకు బలహీనపడింది. కానీ, ఆ పార్టీకి ఇప్పటికీ ప్రతిగ్రామంలోనూ కార్యకర్తలు ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండతోపాటు పాలమూరు జిల్లా సరిహద్దుల్లో ఇప్పటికీ టీడీపీ ప్రభావం కనిపిస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలోనూ టీడీపీ సానుభూతిపరులు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నారు.
ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో రెండు సార్లు పోటీ చేసింది. 2014లో బీజేపీతో పొత్తుతో 15 సీట్లు సాధించిన టీడీపీ, 2018లో మహాకూటమిగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని గట్టి పోటీ ఇచ్చింది. చెప్పుకోదగ్గ సీట్లు లేకపోయినా, గణనీయంగా ఓట్లు కైవసం చేసుకుంది. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయింది. ఆ సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు కావడం, తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ చేయకపోవడం వల్ల పోటీ చేయకుండా వెనక్కి తగ్గింది. అయినా పార్టీ క్యాడర్ మాత్రం తమ అభిమాన నేతకు ఇష్టుడైన నేతకు జైకొట్టారు. అలా తెలంగాణపై టీడీపీ ఉనికి చాటుకుంటున్నా, ఆ పార్టీ అధిష్టానం మాత్రం ఎందుకనో సైలెంట్ గానే ఉంటోంది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పార్టీకి కార్యవర్గం లేక కార్యకర్తలు బిత్తర చూపులు చూడాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. దీంతో ఏడాది కాలంగా పార్టీ అధ్యక్షుడు లేకుండానే తెలంగాణ రాష్ట్ర శాఖ కొనసాగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు తరచూ హైదరాబాద్ వస్తూనే ఉన్నారు. నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తూనే ఉన్నారు. కానీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఎందుకనో ఆసక్తి లేనట్లు వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ఎన్నికల తర్వాత తెలంగాణలో పార్టీని పునర్ నిర్మిస్తానని గతంలో అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో ఘన విజయం తర్వాత తెలంగాణలోనూ పుంజుకుంటామని తెలుగు తమ్ముళ్లు ఆశించారు. కానీ, అధినేత పార్టీ కోసం కనీస సమయం కేటాయించకపోవడంతో తెలంగాణలో మళ్లీ పట్టుసాధించాలనే తమ ఆశలు అడియాసలు అవుతున్నాయని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బలహీనపడిందని, ఆ పార్టీ నుంచి కొందరు నేతలు తిరిగి టీడీపీలోకి వస్తారని ప్రచారం జరిగింది. మాజీ మేయర్ తీగల క్రిష్ణారెడ్డి ఈ విధంగానే పార్టీలోకి తిరిగి వచ్చారు. అదేవిధంగా ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వంటివారు సొంత గూటికి వస్తామని చంద్రబాబుతో చర్చించినట్లు ప్రచారం జరిగింది. అయితే తెలంగాణపై చంద్రబాబు పెద్దగా ఫోకస్ చేయకపోవడం వల్ల తమ రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని వద్దానమనుకున్న నేతలు కూడా సైలెంట్ అయిపోయినట్లు చెబుతున్నారు.
తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిని నియమిస్తానని గత ఆగస్టులో అధినేత చంద్రబాబు చెప్పారు. ఆయన అలా చెప్పి ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఎవరినీ నియమించలేదు. మరోవైపు చంద్రబాబు అరెస్టు సమయంలో తెలంగాణ టీడీపీకి తాను అందుబాటులో ఉంటానని చెప్పిన బాలయ్య కూడా ఇటువైపు చూడటం లేదు. దీంతో అన్ని ఉన్నా అనాథలా కొనసాగాల్సివస్తోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి కార్యవర్గం నియమిస్తే తమ తంటాలు తాము పడతామని కొందరు చెబుతున్నారు. ఏదిఏమైనా చంద్రబాబు మనసులో ఏముందో? తెలంగాణ టీడీపీకి ఎప్పుడు మోక్షం లభిస్తుందో చూడాల్సివుంది.