జగన్ సర్కారు తెచ్చిన స్పెషల్ సెక్యూరిటీ బిల్లు అసలు లెక్క ఇదే!

ముఖ్యమంత్రికి.. వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక భద్రత ఉండటం తెలిసిందే.

Update: 2023-09-24 16:30 GMT

ముఖ్యమంత్రికి.. వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక భద్రత ఉండటం తెలిసిందే. అయినప్పటికీ ఏపీ అసెంబ్లీలో తాజాగా స్పెషల్ సెక్యూరిటీకి సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టటంపై అసలు లెక్క ఏమిటో అర్థం కాని పరిస్థితి. అయితే.. ఈ బిల్లు లోతుల్లోకి వెళితే.. అసలు విషయం బయటకొచ్చింది. అదేమంటే.. ఈ బిల్లు కారణంగా ముఖ్యమంత్రి.. ఆయన సతీమణి.. వారి పిల్లలు మాత్రమే కాదు తల్లిదండ్రులు ఎక్కడున్నా.. వారికి ప్రత్యేక భద్రతను కల్పించటమే తాజా బిల్లు లక్ష్యమన్న విషయం బయటకొచ్చింది.

అంటే.. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నప్పటికీ.. వారికి ప్రత్యక భద్రత కల్పించే వీలు కల్పించటమే తాజా బిల్లు లక్ష్యమని చెబుతున్నారు. అంతేకాదు.. స్పెషల్ సెక్యూరిటీలో పని చేసేందుకు పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లోని సిబ్బందిని డిప్యూటేషన్ ప్రాతిపదికన తీసుకునే వీలు ఉంటుంది. అంతేకాదు.. ఇందులో భాగంగా చేపట్టే పనులకు న్యాయపరమైన రక్షణ కలిగి ఉంటుంది. సీఎం.. ఆయన కుటుంబ సభ్యులు.. సమీప కుటుంబ సభ్యులకు ప్రత్యేక రక్షణ కవచంలా ఈ బిల్లు చట్టంగా మారితే ఉండనుంది.

ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించటం కోసం.. అదనపు సెక్యూరిటీ కోసం అక్టోపస్ టీం పని చేస్తోంది. ముప్ఫై మందితో కూడిన అక్టోపస్ టీం పని చేస్తోంది. వీరిలో ఆరుగురు చొప్పున ఒక్కో గ్రూపులో ఉండనున్నారు. మొత్తం ఐదు టీంలు ఉండనున్నాయి. ఈ టీంలు ముఖ్యమంత్రి వెంట ఉంటూ.. ఆయన పర్యటనలు.. సభలు.. సమావేశాల సందర్భంగా షిప్టుల వారీగా పని చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లుగా రాష్ట్ర నిఘా వర్గాలు నిర్దారించాయి.

ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులతో ముప్పు ఉందని పేర్కొంటూ ఈ ఏడాది మేలో కేంద్రానికి రాష్ట్ర సర్కారు ఒక నోట్ పంపింది. ఇప్పటివరకు దేశంలో యూపీ ముఖ్యమంత్రికి మాత్రమే ఐఎస్ఐ ప్రేరేపితఉగ్రవాదులతో ముప్పు ఉన్నట్లుగా పేర్కొంటూ భద్రతను కల్పిస్తున్నారు. సీఎం జగన్ సర్కారు అభ్యర్థన మేరకు జెడ్ ప్లస్ స్థాయి భద్రత కల్పించాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. ఏపీ ముఖ్యమంత్రికి సంఘవిద్రోహ శక్తులు.. ఐఎస్ఐ ఉగ్రవాదులతో పాటు వామపక్ష తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లుగా పేర్కొన్నారు. దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉంది. ఇలాంటి వేళలోనే.. ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక భద్రతకు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టటం గమనార్హం.

Tags:    

Similar News