మాటలతో చంద్రబాబు ను ఉతికేసిన ఆ ఇద్దరు

ఐటీ నోటీసులు అందుకున్న ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దాని గురించి మాట్లాడేందుకు అసలు ఆసక్తిని ప్రదర్శించటం లేదు.

Update: 2023-09-08 04:08 GMT

ఐటీ నోటీసులు అందుకున్న ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దాని గురించి మాట్లాడేందుకు అసలు ఆసక్తిని ప్రదర్శించటం లేదు. రూ.118 కోట్ల ముడుపులకు సంబంధించి ఐటీ శాఖ అసలు నోటీసులు ఇచ్చిందా? ఇవ్వలేదా? అన్న విషయంపై క్లారిటీ ఇవ్వకుండా.. తనను నేడో, రేపో అరెస్టు చేస్తారని వ్యాఖ్యానించటం ఇప్పుడు సంచలనంగా మారింది. నోటీసుల ప్రస్తావన తేకుండానే.. అరెస్టు అంశాన్ని ప్రస్తావిస్తున్న బాబు తీరు చూసినప్పుడు ఆయన చతురత ఏమిటో అర్థమవుతుంది.

తాజాగా చంద్రబాబు చేసిన ‘అరెస్టు’ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు.. మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా రియాక్టు అయ్యారు. మాటలతో ఉతికేసినట్లుగా చేసిన ఆ ఇద్దరు తాజాగా మాట్లాడుతూ.. బాబు తీరును తప్పు పట్టారు. ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న అంబటి.. ‘‘తప్పు చేశారు కాబట్టే ఆయన భయపడుతున్నారు. తనను అరెస్టు చేస్తారంటూ చెప్పుకుంటూ ప్రజల్లో సానుభూతి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. చట్టానికి చంద్రబాబు అయినా ఒకటే. మరో బాబు అయినా ఒకటే. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆయన తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నట్లుగా అనిపిస్తోంది. బహుశా ఆయన్ను అరెస్టు చేస్తారని కల వచ్చినట్టుంది. చంద్రబాబును అరెస్టు చేయాల్సిన అవసరం ఉంటే చేస్తారు. అరెస్టు చేయాల్సిన అవసరం లేకపోతే అరెస్టు చేయరు’ అని వ్యాఖ్యానించారు.

చట్టానికి అడ్డం వస్తే ఆయన్ను తప్పకుండా అరెస్టు చేస్తారు. ప్రాథమిక ఆధారాలు లేనిదే ఎవరి మీద ఏ విధమైన కేసులు పెట్టరు. దీన్ని అవకాశంగా తీసుకొని చంద్రబాబు ప్రజల్లో సానుభూతి పొందే మాటలు మాట్లాడుతున్నారన్న అంబటి.. ‘చంద్రబాబు దొంగైనా పవన్ కల్యాణ్ నోరు విప్పరు. బాబు రూ.118 కోట్ల ముడుపులు తీసుకున్నారన్న ఆధారాలున్నా కూడా పవన్ నోరు విప్పడు. ఆయన్ను హీరో అనే అంటారు. వాళ్లిద్దరికీ ఉన్న సంబంధం అలాంటిది’ అంటూ నిప్పుడు చెరిగారు.

ఇదే అంశంపై మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. తప్పు చేస్తే అరెస్టు చేయక ముద్దు పెట్టుకుంటారా? అని ప్రశ్నించిన కొడాలి నాని.. అధికారాన్ని అడ్డు పెట్టుకొని అవినీతి పనులు చేస్తే అరెస్టు చేస్తారన్నారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు పెదవి విప్పక పోవటాన్ని ఆయన ప్రశ్నించారు. ‘పాలు అమ్మితే పదివేల కోట్ల రూపాయిల ఆదాయం వచ్చిందా? పాలు.. పిడకలు అమ్మి దేశంలో ఎవరూ ఇంత ఆదాయం సంపాదించలేదు. దోచుకున్న డబ్బును వైట్ చేసేందుకే చంద్రబాబు పాల వ్యాపారం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మంచి పనులు ఏమైనా చేసి ఉంటే వాటి గురించి ప్రజలకు చెప్పాలి. అంతే తప్పించి.. చంద్రబాబు సెల్ఫీలు తీసుకొని అన్నీ నేనే చేశానని చెప్పుకోవటం ఏమిటో అర్థం కాదు’ అని నిప్పులు చెరిగారు.

చంద్రబాబు మాట్లాడితే హైదరాబాద్ తానే కట్టించానని చెబుతారని.. కానీ ఆయన హైదరాబాద్ లో ఎక్కడ పోటీ చేసినా ప్రజలు చిత్తుగా ఓడిస్తారన్నారు. రాష్ట్రానికి పిట్టలదొర లేని లోటును చంద్రబాబు తన మాటలతో తీరుస్తున్నారన్న కొడాలి.. ‘రాష్ట్రంలో ఐదుగురు వ్యక్తులు మాత్రమే సంపద దోచుకోవాలని కుట్రలు పన్నుతున్నారు’ అంటూ మండిపడ్డారు. మొత్తంగా చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందా? అన్న విషయంపై ఆయన క్లారిటీ ఇస్తే బాగుండన్న మాట పలువురు నోట వినిపిస్తోంది.

Tags:    

Similar News