గొల్లప్రోలులో పవన్ కల్యాణ్ అసలేం మాట్లాడారు?

దరిద్రం ఏమంటే.. ఇప్పుడు వార్తల సేకరణ.. బ్రేకింగ్ న్యూస్ లకు సంబంధించిన అంశాల ఎంపికలో వచ్చిన మార్పులు అన్ని ఇన్ని కావు.

Update: 2024-11-05 07:19 GMT

దరిద్రం ఏమంటే.. ఇప్పుడు వార్తల సేకరణ.. బ్రేకింగ్ న్యూస్ లకు సంబంధించిన అంశాల ఎంపికలో వచ్చిన మార్పులు అన్ని ఇన్ని కావు. సంచలనం చుట్టూనే వార్తా సంస్థలు తిరగటం తప్పించి.. సదరు సంచలనం ఎందుకు అయ్యింది? దానికి కారణం ఏమిటి? లాంటి విశ్లేషణలు తర్వాత.. అసలేం జరిగింది? అసలేం మాట్లాడారు? ప్రసంగం పూర్తి పాఠం ఏమిటి? ఏ సందర్భంలో ఏమన్నారు? లాంటి ప్రాథమిక సమాచారాన్ని వదిలేసి.. సంచలనం చుట్టూనే తిరగటం ఈ మధ్యన ఎక్కువైంది. సోమవారం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం నమోదు చేసుకుంది.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు సభలో మాట్లాడిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. హోం మంత్రి అనితపై సంచలన వ్యాఖ్యలు చేయటమే కాదు.. అవసరమైతే తాను హోం మంత్రి బాధ్యతలు చేపడతానన్న వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన ఆ ఒక్క వ్యాఖ్య చుట్టూనే నిన్న రాజకీయ వార్తలు.. దాని అనుబంధ వార్తలు తిప్పారే తప్పించి.. అసలు గొల్లప్రోలు సభలో పవన్ ఏమన్నారు? ఏయే అంశాల్ని ప్రస్తావించారు? ఒక్క హోం మంత్రికే వార్నింగ్ ఇచ్చారా? ఆయన అలావార్నింగ్ ఇవ్వటం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? లాంటి ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలకు అవసరమైన.. ఆయన పూర్తి ప్రసంగాన్ని మాత్రం వదిలేశారు.

ఇంతకూ సభలో ఆయనేం మాట్లాడారు? పవన్ ప్రసంగంలో ముఖ్యమైన అంశాలేంటి? అన్న వివరాల్లోకి వెళితే..

- వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల్లానే.. వారు చేసిన నేరాలు.. అధికారుల్లో ఆలసత్వం కూడా రాష్ట్రానికి వారసత్వంలా వచ్చాయి. ఇళ్లలోకి వచ్చి రేప్ చేస్తామని కొందరు నాయకులు సోషల్ మీడియాలో చెబుతుంటే అది భావ ప్రకటన అని వైసీపీ నేతలు అంటున్నారు.

- ఇలా ప్రోత్సహిస్తే మూడేళ్ల పసికందులను రేప్ చేయరా? ఏమైనా మాట్లాడితే మీరు మన కులపోళ్లని ఇష్యూ అవుతుందంటారు. అంటే.. నేరగాళ్లను రోడ్లపై వదిలేయాలా? చర్యలు తీసుకునే ధైర్యం లేనప్పుడు పోలీసులు ఎందుకు? రాజకీయ నాయకులు.. ఎమ్మెల్యేలు ఉన్నది ఓట్లు అడగటానికేనా?

- అప్పట్లో నేను ప్రజలకు అభివాదం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వంలో గరుడ్ అనే ఎస్పీ నన్ను నెట్టి కూర్చెబెట్టారు. నన్ను భయపెట్టటం కాదు.. ఒక రేపిస్ట్ ను ఎందుకు వదిలేశారు? ఒక సీఎంను చంపేస్తామన్న వాడిని ఎందుకు వదిలేశారు? నాడు ఇచ్చిన స్వేచ్ఛ ఫలితాలివి.

- నేను హోం శాఖను అడగలేక కాదు. తీసుకున్నానంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ లా నేరగాళ్లపై చర్యలు తీసుకునే పరిస్థితుల్లోకి మమ్మల్ని నెట్టేస్తున్నారు. తెగేదాకా లాగొద్దు. ఈ ప్రభుత్వానికి సహనం ఎంత ఉందో అంతకు పదింతల తెగింపు ఉంది.

- అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం పాటిస్తున్నాం. ఇలాంటి నేరాలపై సింగపూర్ తరహాలో శిక్ష ఉండాలి. ఈ సమస్యపై అసెంబ్లీలో మాట్లాడతా. 30 వేలమంది ఆడపిల్లలు కనిపించకుండా పోతే గత ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వైసీపీ ప్రభుత్వంలో నాపైనా.. చంద్రబాబుపైనా.. మా కుటుంబ సభ్యులపైనా ఇష్టారాజ్యంగా మాట్లాడారు . నోటికొచ్చినట్లు దూషించారు.

- అప్పుడు డీజీపీ.. ఇంటెలిజెన్స్ ఐజీ.. శాంతిభద్రతలు పరిరక్షించే వ్యక్తులు చర్యలు తీసుకోలేదు. అందువల్లనే ప్రభుత్వం ఏమీ చేయదనే ధీమాతో ఇళ్లలోకి వచ్చి రేప్ లు చేసే వరకు వచ్చింది. ఈ దారుణాలన్నీ గత ప్రభుత్వ వారసత్వంగా వచ్చినవే.

- మూడేళ్లు.. ఐదేళ్ల పసిపిల్లలను దుర్మార్గులు అత్యాచారం చేస్తున్నారు. దీనికి కారణం మనిషిలోని దుర్మార్గం. దానికి కులం.. మతం.. ప్రాంతం లేదు. డీజీపీ.. ఇంటెలిజెన్స్.. పోలీసు అధికారులు.. జిల్లా ఎస్పీలు.. కలెక్టర్లకు చెబుతున్నా. రాష్ట్రాభివ్రద్ధిలో శాంతిభద్రతలు కీలకమని మర్చిపోవద్దు. పదిసార్లు నా చేత చెప్పించుకోకండి. తప్పులు చేసిన వారిని మడతబెట్టి కొట్టండి.

- నేరగాళ్లను పట్టుకోవటంలో ఎందుకీ నిస్సహాయత? హోం మంత్రి అనితకు చెబుతున్నా. బాధ్యత వహించండి. నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. గుర్తు పెట్టుకోండి. ఇలానే ఉంటే హోం బాధ్యతలూ తీసుకుంటా. ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు. అంతేకానీ చేతకాని ప్రభుత్వం కాదు.

- వైసీపీ నేతలు గతంలోలా నోటికొచ్చినట్లు మాట్లాడితే తర్వాత రిణామాలు నన్ను అడగొద్దు. చంద్రబాబు.. నేను.. ప్రధాని మోడీ ఐదు కోట్ల ఆంధ్రులకు.. ఈ దేశానికి అండగా ఉండటానికి వచ్చాం. ఏపీ డెవలప్ మెంట్ కు అంకిత భావంతో ఉన్నాం. ఎక్కడా తప్పులు చేయం. జనసేన.. బీజేపీ.. టీడీపీ ఎవరైనా కావొచ్చు. ఒకరిద్దరు ఇబ్బందులు పెట్టినా.. మమ్మల్ని విడదీయలేరు. స్థిమితంగా. స్థిరంగా ఉండే ప్రభుత్వం ఇది.

- పర్సనల్ గేమ్స్ ఆడొద్దని మూడు పార్టీల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ విన్నవించుకుంటున్నా. సాంగిక సంక్షేమ వసతి గ్రహాల్లో ఆడపిల్లల ఇబ్బందులను కూటమి ఎమ్మెల్యేలు ఒక్కసారైనా వెళ్లి పరిశీలించారా? జనసైనికులు.. వీర మహిళలైనా వెళ్లారా? గెలిపిస్తే సరిపోదు. అన్యాయం జరుగుతున్న ప్రతిచోటకు వెళ్లాలి.

- మేం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు బలంగా ఉండాలని.. ఆడపిల్లల మానప్రాణాలకు బాధ్యత తీసుకోవాలని.. గత ప్రభుత్వంలో మాదిరి పరిస్థితి ఉండకూడదని.. డీజీపీకి.. ఇంటెలిజెన్స్ ఐజీకి చెప్పాం. అయినా మీనమేషాలు లెక్కబెడుతున్నారు

- పోలీసు అధికారులకు ఎన్నిసార్లు చెప్పాలి? వీళ్లను అరెస్టు చేయాలంటే కులం.. మతం సమస్య వస్తుందని అంటున్నారు. మూడేళ్ల ఆడబిడ్డను రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా? భారతీయ శిక్షాస్మ్రతి క్రిమినల్స్ ను వెనకేసుకు రమ్మని చెబుతోందా? పోలీసులు అలసత్వంగా ఉండొద్దు. ఆడపిల్లలను ఏడిపించినా .. తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకోండి.

Tags:    

Similar News