బడ్జెట్ వరాలతో ఈవీ వాహనాల ధరలు తగ్గేదెంత?

గడిచిన కొన్నేళ్లుగా వ్యక్తిగత పన్ను ఆదాయం మీద కరుణ చూపని తీరుకు భిన్నంగా ఈసారి ఏకంగా 12 లక్షల వరకు వార్షిక ఆదాయానికి ఎలాంటి పన్ను ఉండదని తేల్చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

Update: 2025-02-02 05:44 GMT

ప్రతి ఏటా ప్రవేశ పెట్టే కేంద్ర బడ్జెట్ వైపు సగటుజీవి ఆశగా ఎదురుచూస్తుంటారు. కేంద్రం కరుణించి.. వరాల ప్రకటన ఏమైనా చేస్తారని. గడిచిన కొన్నేళ్లుగా వ్యక్తిగత పన్ను ఆదాయం మీద కరుణ చూపని తీరుకు భిన్నంగా ఈసారి ఏకంగా 12 లక్షల వరకు వార్షిక ఆదాయానికి ఎలాంటి పన్ను ఉండదని తేల్చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అయితే.. దీనికి సంబంధించి మెలిక ఉందని చెప్పినా.. మొత్తంగా ఏడాదికి వార్షిక జీతం రూ.23 లక్షలు ఉన్న వారికి ఏకంగా రూ.1.10 లక్షల వరకు మేలు జరుగుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

ఆర్థిక మంత్రి నోట వచ్చిన ట్యాక్స్ రిబేట్ వేతనజీవుల్లో కొత్త ఉత్సాహాన్ని పెంచిందని చెప్పాలి. ఇదిలా ఉండగా.. పన్ను మినహాయింపు జాబితాలోని కొన్ని వస్తువుల కారణంగా విద్యుత్ వాహనాల ధరలు తగ్గనున్న విషయం బడ్జెట్ లో ప్రస్తావించారు. అయితే.. ఈ మినహాయింపు కారణంగా సగటు జీవికి ఎంత మేర ఉపశమనంగా మారుతుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

విద్యుత్ వాహనాల్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఈవీ బ్యాటరీ తయారీకి అవసరమైన ముడి సామాగ్రి మీద సుంకాల మినహాయింపు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈవీ బ్యాటరీల తయారీకి వినియోగించే వస్తువుల్లో 35 క్యాపిటల్ గూడ్స్ .. మొబైల ఫోన్ బ్యాటరీకి సంబంధించి మరో 28 మూలధన సరకులకు సుంకాల జాబితా నుంచి తప్పించారు. దీంతో భారీగానే ధరల మీద ప్రభవాన్ని చూపే వీలుందని చెబుతున్నారు. సెల్ ఫోన్ల మీద రూ.2వేల వరకు గరిష్ఠంగా తగ్గే వీలుందని.. అదే సమయంలో ఈవీ కారు మీద కూడా భారీగా తగ్గే వీలుందని చెబుతున్నారు.

అంతేకాదు బ్యాటరీ తయారీకి అవసరమైన ఖనిజాలపై దిగుమతి సుంకాన్ని జీరో చేశారు. దీంతో ధరల మీద ఈ నిర్ణయ ప్రభావం ఉంటుందని చెప్పాలి. తాజా సుంకాల మినహాయింపు కారణంగా ఒక్కో ఈవీ కారు మీద దగ్గర దగ్గర రూ.25 వేల నుంచి రూ.50వేల వరకు తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే.. ఇదంతా ప్రాథమిక అంచనా మాత్రమే. వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటయాన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఏమైనా ధరల విషయంలో గతం కంటే మెరుగైనే పరిస్థితులు ఉంటాయని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News