వీరందరి ఆశల మీద నీళ్లు పోసిన నిర్మలమ్మ

కీలక రంగాలకు సంబంధించిన కేటాయింపులు తక్కువ చేయటం ద్వారా.. ప్రజల మీదా పడుతుందన్న మాట వినిపిస్తోంది.

Update: 2025-02-02 05:30 GMT

వేతన జీవికి పన్ను మినహాయింపు విషయంలో సిక్సర్ కొట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ.. కొన్ని కీలక రంగాలకు కేటాయింపుల విషయంలో మాత్రం నిర్దయతో వ్యవహరించారని చెప్పాలి. కీలక రంగాలకు సంబంధించిన కేటాయింపులు తక్కువ చేయటం ద్వారా.. ప్రజల మీదా పడుతుందన్న మాట వినిపిస్తోంది. అందుకు నిదర్శనంగా కొన్ని రంగాలను చేసిన కేటాయింపుల్ని చూస్తే.. పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న భావన కలుగుతుంది.

ఇక్కడో ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించాలి. కొన్ని రంగాలకు తాము పెద్ద పీట వేసినట్లుగా చెప్పుకున్నప్పటికి.. తీరా కేటాయింపుల లెక్కల్లోకి వెళ్లినప్పుడు గత ఏడాది కేటాయింపుల కంటే తక్కువగా ఉండటం కనిపిస్తుంది. దీంతో.. నిర్మలమ్మ మాటలకు చేతలకు మధ్యనున్న వ్యత్యాసం ఔరా అనేలా చేస్తోంది. ఉదాహరణకు కొత్త ఉడాన్ పథకాన్ని తాము షురూ చేస్తున్నట్లుగా తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలమ్మ పేర్కొన్నారు.

దేశీయ విమానయానాన్ని పెంచటమే లక్ష్యమని చెప్పారు. రానున్న పదేళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణాన్ని కల్పించటమే లక్ష్యంగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా మరో 120 మార్గాల్లో విమాన ప్రయాణాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఇదంతా విన్నంతనే వావ్ అనిపిస్తుంది. మరి.. నిధుల కేటాయింపు చూస్తే.. నిర్మలమ్మ మాటలకు చేతలకు తేడా ఇట్టే అర్థమవుతుంది. గత ఏడాది ఉడాన్ పథకానికి రూ.800 కోట్లు కేటాయిస్తే.. ఈసారి కొత్త ఉడాన్ పథకానికి రూ.540 కోట్లు మాత్రమే కేటాయించటం అవాక్కు అయ్యేలా చేస్తుంది. కొత్తగా అని చెప్పి.. పాత వాటి కంటే తక్కువ నిధుల కేటాయింపు దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్నగా మారింది. గత ఏడాదితో పోలిస్తే ఈ రంగానికి 32 శాతం తక్కువగా నిధుల్ని కేటాయించారని చెప్పాలి.

మోడీ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాలకు పెద్ద పీట వేసినట్లుగా చెబుతారు. తాజా బడ్జెట్ కేటాయింపుల్ని చూస్తే ఆశించినంతగా జరగలేదు సరి కదా.. గత ఏడాది కంటే తక్కువ నిధుల్ని కేటాయించటం కనిపిస్తుంది. గత ఏడాది విదేశాంగ శాఖకు రూ.25,277 కోట్లు కేటాయిస్తే.. ఈ ఏడాది రూ.20,516 కోట్లు మాత్రమే కేటాయింపులు జరపటం కనిపిస్తుంది.గత బడ్జెట్ తో పోలిస్తే ఈసారి రూ.4761 కోట్లు తక్కువన్నమాట. మొత్తం బడ్జెట్ లో ఒక శాతం నిధుల కేటాయింపు మాత్రమే జరగటం గమనార్హం.

విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే మహిళల గురించి బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ.. వాటి కేటాయింపులు కేవలం రూ.కోటి మాత్రమే కావటం చూస్తే.. నిర్మలమ్మ మాటలకు చేతలకు మధ్యనున్న తేడా ఇట్టే అర్థమవుతుంది. ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్న ఏఐ రంగానికి పెద్దపీట వేస్తామని చెబుతూనే.. కేటాయింపులు మాత్రం నామమాత్రంగా ఉండటం ఆశ్చర్యానికి గురి చేసేలా చేసింది.

Tags:    

Similar News