మంత్రి పొంగులేటిపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే.. గతంలో ఇదే పొంగులేటిని తీన్మార్ మల్లన్న పొగుడుతూ మాట్లాడిన వీడియోలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Update: 2024-11-05 05:57 GMT

స్వపక్షంలోనే విపక్షం అంటే ఇదేనేమో..! కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపుల కొట్లాటలకు కేరాఫ్ అని అందరికీ తెలిసిందే. దశాబ్దాల కాలం నుంచి ఆ పార్టీలో కుమ్ములాటలకు కొదువలేదు. దశాబ్ద కాలం తరువాత తెలంగాణ రాష్ట్రంలో రాక రాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ.. నేతల మధ్య మాత్రం పొసగడం లేదు. మళ్లీ అవే తగాదాలు కనిపిస్తున్నాయి. వీటిని చూసిన వారంతా.. కాంగ్రెస్ నేతల తీరు ఈ జన్మలో మారదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం పాత, కొత్త అన్న భేదాభిప్రాయాలు నడుస్తున్నాయి. పాత వారికంటే కొత్త వారికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసంతృప్తి సీనియర్లలో కనిపిస్తోంది. చాలా సందర్భాల్లో చాలా మంది నేతలు ఇదే విషయాన్ని బహిరంగంగానే చెప్పుకొచ్చారు. అందులోనూ.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇంకా ఈ కామెంట్స్ ఎక్కువయ్యాయి.

ఇప్పటికే పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన అనుచరుడు హత్యకు గురికావడం.. ఫిరాయింపుదారుల వల్లే ఆ హత్య జరిగిందనడం పార్టీలో నిప్పు రాజేసింది. ఆయన అంతటితో ఆగకుండా అధిష్టానానికి లేఖ సైతం రాశారు. దీంతో ఆ మంట ఇంకా చల్లారనేలేదు. ఇక ఇప్పుడు మరో ఎమ్మెల్సీ రూపంలో కాంగ్రెస్ పార్టీ తలనొప్పిని ఎదుర్కొంటోంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొరకరాని కొయ్యలా తయారయ్యరు. కొంత కాలంగా బీసీలకు రాజ్యాధికారం కావాలంటూ ఆయన నినదిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. బీసీ గర్జన పేరిట సభలు నిర్వహిస్తున్న ఆయన సీఎం రేవంత్, సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల మిర్యాలగూడలో నిర్వహించిన బీసీ గర్జనలో ఆయన మరోసారి గర్జించారు. ఈ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. 'ఎవడి సొమ్ము ఎవడు తింటున్నాడు. పంది కొక్కుల్లాగా ప్రాజెక్టుల పేరు మీద పైసలు దోచుకుంటున్నది మీరు కాదా.

పొంగులేటికి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినయ్. కాంట్రాక్టుల పేరిట దోచుకుంటున్నది మీరు కాదా. ఎవనయ్య సొమ్ము అని ప్రజల తలకాయలు తాకట్టు పెట్టి 7 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఎవడు కట్టాలే ఈ పైసలు. ఎవడు కట్టాలే ఈ అప్పులు . మీ ఆస్తులమ్మి కట్టుర్రి' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తెలంగాణ ఆఖరి అగ్రవర్ణాల సీఎం రేవంత్ రెడ్డేనని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. గతంలో ఇదే పొంగులేటిని తీన్మార్ మల్లన్న పొగుడుతూ మాట్లాడిన వీడియోలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పొంగులేటికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించబోనని ఆయన అందులో మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయి. పొంగులేటి అరుదైన నాయకులలో ఒకరని, ఆయనను తాను ఎక్కువగా అభిమానిస్తానని మాట్లాడారు. అయితే.. తాజాగా మిర్యాలగూడలో పొంగులేటిపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చ జరుగుతోంది. మరోవైపు.. మల్లన్న వ్యాఖ్యలను కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ కూడా జీర్ణంచుకోలేకపోతోంది. మరి.. ఆయన వ్యాఖ్యలను అలాగే లైట్‌గా తీసుకుంటారా..? ఏమైనా చర్యలు ఉంటాయా..? అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News