"పవన్ కల్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు"!
ఆయన ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో తనకు తెలుసని.. త్వరలోనే ఆయనతో మాట్లాడతానని అన్నారు. పవన్ కూడా తమలో భాగమే అని అనిత గుర్తుచేశారు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా విపరీతంగా జరుగుతున్న అత్యాచార ఘటనలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వేళ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ గా స్పందించారు. పిఠాపురం పర్యటనలో ఉన్న ఆయన... రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. పవన్ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి.
నేరం చేసినవారు బయట తిరుగుతుంటే.. అధికారులు ఏమి చేస్తున్నారని నిలదీసిన పవన్ కల్యాణ్... క్రిమినల్స్ కు కులం, మతం ఉండవనే విషయాలు పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలని ఆయన ఫైరయ్యారు. ఇదే సమయంలో... నేరానికి పాల్పడిన వ్యక్తిని కులం చూసి వదిలేయాలని ఏ చట్టం చెబుతోంది అని ప్రశ్నించారు.
నిందితుల్లో తమ బంధువులున్నా సరే వాళ్లని మడతపెట్టి కొట్టాలని పవ న్ సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు చాలా ముఖ్యమైన విషయం అని ఎస్పీలు, అధికారులు గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే... హోంమంత్రి అనిత రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై బాధ్యత వహించాలని అన్నారు!
ఇదే సమయంలో... తాను హోంమంత్రిని అయ్యుంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పుకొచ్చారు. ఇక, భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని.. అధికారంలో ఉన్నాం కాబట్టే సైలెంట్ గా ఉంటున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు! ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత స్పందించారు.
అవును... రాష్ట్రంలో శాంతిభద్రతలపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏపీలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎలా ఉందో పవన్ వ్యాఖ్యలను చూస్తే అర్ధం అవుతుందని.. హోంమంత్రి రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సమయంలో అనిత స్పందించారు.
ఇందులో భాగంగా... పవన్ అన్నదాంట్లో తప్పేమీ లేదని.. ఆయనకు అన్ని విషయాలూ తెలుసు కాబట్టే మాట్లాడారని.. పవన్ మాట్లాడినదాంట్లో రాజకీయాలు వెతకాల్సిన అవసరం లేదని!.. ఆయన ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో తనకు తెలుసని.. త్వరలోనే ఆయనతో మాట్లాడతానని అన్నారు. పవన్ కూడా తమలో భాగమే అని అనిత గుర్తుచేశారు!
ఇదే సమయంలో... పవన్ వ్యాఖ్యల్ని తాను చాలా పాజిటివ్ గా తీసుకున్నట్లు చెప్పిన అనిత.. ఈ వ్యాఖ్యలు తనపై ఇంకా బాధ్యతను పెంచాయని అన్నారు. పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించడం సరికాదని తెలిపారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో నేడు ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు గత ప్రభుత్వ పాపాల పర్వసానమే అని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించడం గమనార్హం!