మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువగా ఉండే క్యాన్సర్... లక్షణాలివే!

దీంతో ప్రపంచ వ్యాప్తంగా యువతలో ఓ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు. అదే... పేగు క్యాన్సర్!

Update: 2024-12-27 08:30 GMT

ఒకప్పుడు క్యాన్సర్, గుండెపోటు, షుగర్ వంటి వ్యాదులు పెద్ద వయసు వాళ్లకు మాత్రమె వస్తాయని అనుకునేవారు. కనీసం 50 ఏళ్లు దాటితేనే పైన చెప్పుకున్న వ్యాదుల బారిన పడటానికి అర్హత వస్తుందన్నట్లుగా భావించేవారు. అయితే... కాలం మారింది, మనిషి జీవన శైలి మారింది.. దీంతో ప్రపంచ వ్యాప్తంగా యువతలో ఓ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు. అదే... పేగు క్యాన్సర్!

అవును... ఇటీవల వయసుతో సంబంధం లేకుండా వస్తున్న క్యాన్సర్స్ లో బోవెల్ క్యాన్సర్ లేదా కొలన్ క్యాన్సర్ ఒకటని అంటున్నారు. దీన్నే పేగు క్యాన్సర్ అని కూడా అంటారు. ఈ క్యాన్సర్ పై లాన్సెట్ సంస్థ తాజాగా 50 దేశాల్లో పరిశోధనలు జరిపింది. వీటిలో 27 దేశాల్లో పాతికేళ్ల నుంచి 49 ఏళ్ల లోపు వయసు వారిలో పేగు క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని తేలిందని అంటున్నారు

ఒకప్పుడు సాధారణంగా 50 ఏళ్లు వైబడిన వారిలోనే కనిపించే పేగు క్యాన్సర్ కేసులు ఇప్పుడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని లాన్సెట్ తాజా నివేదిక చెబుతోందని అంటున్నారు. ఇలా ఈ క్యాన్సర్ బారిన పడుతున యువత ఎక్కువగా సంపన్న దేశాలకు చెందినవారే కాగా.. గత రెండు దశాబ్ధాలతో పోలిస్తే భారత్ లోనూ క్రమంగా ఆ సంఖ్య పెరుగుతుందని అంటున్నారు.

ఇందులో భాగంగా... ఆస్ట్రేలియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, జర్మనీ, స్కాట్లాండ్, స్లోవేనియా, నార్వే, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, కెనడా, చిలీ, అమెరికా, అర్జెంటీనా, ఇంగ్లండ్ వంటి దేశాల్లోని యువతలో పెద్ద పేగు క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని అంటున్నారు.

అయితే... సరైన అవగాహన ఉంటే ఈ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించడం సాధ్యమే అని అంటున్నారు వైద్యులు. ఇందులో బ్భాగంగా... 40 ఏళ్లు దాటిన వ్యక్తులు కొలనోస్కోపీ చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా తొలిదశలోనే గుర్తించడం వల్ల దాన్ని నివారించే అవకాశాలు 16% వరకూ ఉన్నాయని లాన్సెట్ అధ్యయనం తెలిపింది!

పేగు క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తించాలంటే ఫ్యామిలీ క్యాన్సర్ హిస్టరీని పరిగణలొకి తీసుకోవాలని.. ముఖ్యంగా రక్తసంబంధీకులు ఎవరైనా ఈ క్యాన్సర్ బారిన పడ్డారా అనేది తెలుసుకోవాలని చెబుతున్నారు. ఐతే... ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుందనడానికి స్పష్టమైన ఆధారాల్ లేనప్పటికీ 10 శాతం అవకాశం ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఇదే సమయంలో మహిళలతో పోలిస్తే పురుషులలోనే ఈ రకం క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది పురుషుల్లోనే ఎక్కువగా కనిపించడానికి వారి లైఫ్ స్టైల్ కూడా ఓ కారణం అన్ని అంటున్నారు.


పేగు క్యాన్సర్ కారకాలు!:

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం

సిగరెట్లు తాగడం

రెడ్ మీట్ అతిగా తీసుకోవడం

ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ అతిగా తీసుకోవడం

విపరీతమైన చిరుతిండ్లు

ఊబకాయం


ఈ క్యాన్సర్ లక్షణాలు!:

మలంలో రక్తం పడుతుంది

మలం నలుపు రంగులో కనిపిస్తుంది

ఎక్కువసార్లు మల విసర్జన చేయాల్సి వస్తుంది

విరేచనంతో పాటు జిగురు పడటం

పొట్ట కింది భాగంలో నొప్పి

సరైన ఆహారం తీసుకున్నా బరువు తగ్గడం


ఈ జాగ్రత్తలు పాటించాలి!:

ప్రధానంగా రోజువారీ జీవన విధానంలో మార్పులు చేసుకోవడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ ముప్పును కొంతవరకూ తగ్గించుకోవచ్చు. ప్రధానంగా రోజు వారీ ఆహారంలో కూరగాయలు, పళ్లు, పప్పు ధాన్యాలు వంటివి ఉండేలా చూసుకోవాలి. వీటి ద్వారా అవసరమైన విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా అందుతాయి.

వీటితో పాటు ప్రధానంగా ఆల్కహాల్, సిగరెట్లకు వీలైనంత దూరంగా ఉంటూ.. కనీసం రోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం మంచిదని.. ఇదే సమయంలో శరీర బరువు ఎప్పుడూ అదుపులో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతీ రోజూ అవసరమైనంత నీరు తాగాలి! ప్రతీ రోజు విరేచనానికి వెళ్లాలి!

Tags:    

Similar News