బాంబు దాడి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ త్రుటిలో మిస్
తాజాగా ఆయనపై యెమెన్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు దాడి జరిగింది.
కొవిడ్ కాలంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నది ఎవరో తెలుసా..? వైరస్ పుట్టిన దేశం చైనా కానీ, దాని అధ్యక్షుడు జిన్ పింగ్ కానీ కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) డైరెక్టర్ జనరల్. ఈ పదవిలో ఉన్నవారు ఎలా ఉండకూడదో నిరూపించారు టెడ్రోస్ అధానోమ్. చైనాలోనే కొవిడ్ వైరస్ పుట్టిందనే ఆరోపణలు బలంగా వస్తున్నా.. అధానోమ్ మాత్రం కించిత్ పట్టించుకోలేదు. పైకి తిరిగి డొంక తిరుగుడుగా మాట్లాడేవారు. అసలు చైనా గురించి ప్రస్తావన చేసేందుకే ఇష్టపడేవారు కాదు.
అలాంటి అధానోమ్ ఇప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ గా కొనసాగుతుండడం గమనార్హం. కాగా, తాజాగా ఆయనపై యెమెన్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు దాడి జరిగింది.
యెమెన్ రాజధాని సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అధానోమ్ విమానం కోసం వేచి ఉండగా వైమానిక బాంబు దాడి ఘటన చోటుచేసుకుంది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే, అధానోమ్ మాత్రం త్రుటిలో తప్పించుకున్నారు.
దాడి చేసిందెవరు?
అధానోమ్ పై దాడిని ఐక్యరాజ్యసమితి ఖండించింది. కాగా, అధానోమ్ యెమెన్ కు ఎందుకు వెళ్లారు? అసలే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో అత్యంత కల్లోలంగా ఉంటే అధానోమ్ ఏం చేయాలని వెళ్లారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, ఐక్యరాజ్య సమితి ఉద్యోగులతో కలిసి ఖైదీల విడుదలపై చర్చలు, యెమెన్ లో ఆరోగ్యం, మానవతా పరిస్థితులను అంచనా వేసేందుకు అధానోమ్ వెళ్లారు.
సనా విమానాశ్రయం, నౌకాశ్రయాలు, విద్యుత్కేంద్రాలపై గురువారం ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దీనికి కారణం.. యెమెన్ ను స్థావరం చేసుకున్న హూతీలు ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెలీ పౌరులకూ గాయాలయ్యాయి. దీంతోనే హూతీలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో సనా ఎయిర్ పోర్టు మీద దాడికి దిగింది.
ఎర్రసముద్రం, ఓడరేవులు, యెమెన్ లోని పవర్ స్టేషన్లపై వైమానిక దాడులు చేపట్టింది.