అక్కడ కేసీఅర్ ఇక్కడ జగన్... ఒకే ముహూర్తాన !?
తన దూకుడు మామూలుగా ఉండదని రెడ్ సిగ్నల్ ఇచ్చేశారు.
గంభీరంగా చూస్తున్నాను అంతా గమనిస్తున్నాను ఫార్మ్ హౌస్ నుంచే అన్నీ ఆలోచిస్తున్నాను ఈ మాటలు అన్నది ఎవరో కాదు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. ఆయన ఏడాది పాటు సాగిన కాంగ్రెస్ పాలన మీద తనదైన శైలిలో చేసిన కామెంట్స్. తాను కనుక బలంగా కొడితే తట్టుకోలేరు అని కూడా అన్నారు. తన దూకుడు మామూలుగా ఉండదని రెడ్ సిగ్నల్ ఇచ్చేశారు.
తాను ఈ నెల చివరి వారంలో జనంలోకి రాబోతున్నట్లుగా కూడా ఆయన చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఏమీ జరగలేదని కేసీఆర్ నిప్పులు చెరిగారు. మంచి ప్రభుత్వాన్ని దించేసిన జనాలూ ఆలోచిస్తున్నారు అన్నారు. ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని అన్నారు. ఇలా కేసీఅర్ తన జనం బాట కార్యక్రమానికి అవసరమైన పూర్వ రంగం సిద్ధం చేసుకున్నట్లుగానే ఉన్నారు.
జగన్ విషయం తీసుకుంటే గడచిన ఎనిమిది నెలలుగా ఆయన కూడా పెద్దగా జనంలో లేరు. అరకొరగా పార్టీ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఆయన ఇప్పటికి రెండు కార్యక్రమాల మీద నిరసనలకు పిలుపు ఇచ్చారు. అవన్నీ చప్ప చప్పగా సాగాయి. దానికి కారణం క్యాడర్ ని పంపించి జగన్ తాను పాల్గొనకుండా తెర వెనక ఉండిపోయారు. ఇపుడు అయిదవ తేదీన ఫీజులకు సంబంధించి రీ అంబర్స్ మెంట్ ని చెల్లించాలి అంటూ పోరాటం చేస్తున్నారు.
ఇక జగన్ కూడా మంచి ముహూర్తంగా మాఘమాసాన్నే ఎంచుకున్నారు. అంటే ఫిబ్రవరి నెలలోనే. ఆయన నిజానికి సంక్రాంతి పండుగకు రావాల్సి ఉంది. పండుగ కాగానే మూడవ వారంలో జనంలోకి వస్తాను అని అప్పట్లో ప్రకటించినా ఆయన లండన్ టూర్ పెట్టుకున్నారు. ఇపుడు ఆయన మళ్ళీ తిరిగి వచ్చారు కాబట్టి వైసీపీలో కొంత కదలిక కనిపిస్తోంది. ఈ నెల 3, 4 తేదీలలో జరిగే పార్టీ సమావేశాలలో జగన్ తాను జనంలోకి వచ్చే తేదీలను ప్రకటించవచ్చు.
మొత్తానికి చూస్తూంటే అటు కేసీఆర్ కానీ ఇటు జగన్ కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వాల మీద జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్నారు. తాము జనంలోకి వెళ్ళడానికి ఇవే సరైన పరిస్థితులు అని కూడా అంచనా వేసుకుంటున్నారు. ఇక కేసీఅర్ అయితే ఏడాదికి పైగా సమయం ఇచ్చి రంగంలోకి దిగబోతున్నారు. వైసీపీ అధినేత మాత్రం ఎనిమిది నెలల తరువాత కూటమి సర్కార్ మీద గట్టిగా గర్జించాలని చూస్తున్నారు.
ఇక చూస్తే ఇప్పటిదాకా ఈ ఇద్దరు నేతలూ అసెంబ్లీలోనూ మాట్లాడలేదు. ఆ మాటకు వస్తే అసెంబ్లీకి కూడా వెళ్ళలేదు. మరి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ ముందు చట్ట సభలకు వెళ్ళి అక్కడ ప్రజలు కట్టబెట్టిన ప్రతిపక్ష స్థానంతో అధికార పక్షాన్ని నిలదీసి ఆనక జనంలోకి వస్తే బాగుంటుందని అంటున్నారు. మరి ఈ విషయంలో ఇద్దరు నేతలూ ఏమి చేస్తారో చూడాల్సి ఉంది.