క్రెడిట్ అంతా బాబుకేనా.. బీజేపీ తీసుకోదా?
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే రూ.3000 పింఛన్ ను రూ.4000కు పెంచుతామని.. అది కూడా ఏప్రిల్ నుంచే వర్తింపచేస్తామని టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జూలై 1న రూ.7 వేలు పించన్ అందజేశారు. అంతేకాకుండా దివ్యాంగులకు ఏకంగా రూ.3000 నుంచి రూ.6 వేలకు పెన్షన్ పెంచి ఇచ్చారు. అలాగే పూర్తిగా వీల్ చైర్, మంచానికే పరిమితమైనవారికి ఏకంగా రూ.15 వేలు పించన్ అందించారు.
ఇచ్చిన మాట ప్రకారం.. జూలై 1న తొలి రోజు 95 శాతం మందికి పింఛన్ల పంపిణీని పూర్తి చేసి రికార్డు సృష్టించారు. కేంద్రం ఏమాత్రం ఆర్థిక సహాయం చేయకపోయినా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నా కూటమి ప్రభుత్వం తన తొలి కీలక హామీని విజయవంతంగా నిలబెట్టుకుంది.
ఈ పెన్షన్ పెంపు క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి చంద్రబాబుకే వెళ్లిపోతుంది. అలాగే జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కూడా. ఎన్నికల ముందు వీరిద్దరే ప్రచార సభల్లో పెన్షన్ పెంపు గురించి కీలకంగా ప్రస్తావించారు. ఎన్నికల ముందు విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని పొందుపరిచారు.
అయితే కూటమి ప్రభుత్వంలో మూడో భాగస్వామిగా ఉన్న బీజేపీ పెన్షన్ల పెంపు క్రెడిట్ ను తీసుకుంటుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ చివరిగా ఎంట్రీ ఇచ్చింది. అసలు పొత్తు ఉండకపోవచ్చనే చర్చ కూడా నడిచింది. అయితే పవన్ కళ్యాణ్ అతికష్టం మీద బీజేపీని ఒప్పించి కూటమిలోకి తీసుకువచ్చారు.
అంతటితో అయిపోలేదు. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సిద్ధార్థ్ నాథ్ సింగ్ మేనిఫెస్టోను పట్టుకోవడానికి నిరాకరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే మేనిఫెస్టోను పట్టుకోవడం, బీజేపీ నేత పట్టుకోకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఉమ్మడి మేనిఫెస్టోను పట్టుకోకపోవడంపై మీడియాలోనూ వార్తలు వచ్చాయి. వైసీపీ అయితే ఈ అంశాన్ని బాగా ప్రచారం చేసింది. బీజేపీకి చంద్రబాబుపైన నమ్మకం లేదని.. ఆయన హామీలు అమలు చేయకపోతే బీజేపీకి చెడ్డపేరు వస్తుందని.. మేనిఫెస్టోలో బీజేపీ భాగం కాలేదని వైసీపీ సెటైర్లు వేసింది.
అయితే జూలై 1న ఇచ్చిన హామీని ఇచ్చినట్టుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలుపుకున్నారు. భారీగా పెన్షన్లను పెంచి మరీ లబ్ధిదారులకు అందజేశారు. ఈ నేపథ్యంలో క్రెడిట్ అంతా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కే పోతుందని అంటున్నారు. లబ్ధిదారులు సైతం వీరిద్దరి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్నారు. మరి బీజేపీ ఈ క్రెడిట్ తీసుకుంటుందా? లేదా? అనే చర్చ సాగుతోంది.