ఐఫోన్ 15, 15 ప్లస్ ఫీచర్లు అదిరిపోతున్నాయి గురూ!
''తళుకుబెళుకు రాళ్లు తట్టెడేలా.. నిక్కమైన నీలము నొక్కటి చాలు'' అన్నట్టు ఫోన్లు ఎన్ని ఉన్నా ఐఫోన్ కు ఉండే క్రేజు, స్టైలు, దర్జానే వేరు
''తళుకుబెళుకు రాళ్లు తట్టెడేలా.. నిక్కమైన నీలము నొక్కటి చాలు'' అన్నట్టు ఫోన్లు ఎన్ని ఉన్నా ఐఫోన్ కు ఉండే క్రేజు, స్టైలు, దర్జానే వేరు. ఎప్పటికప్పుడు వీటి మోడల్స్ ను దక్కించుకోవడానికి ఉండే పోటీ గురించి చెప్పాలంటే అదొక పెద్ద స్టోరీ. సాధారణంగా యాపిల్ ఐఫోన్స్ ని ఇష్టపడనివారు ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి ఐఫోన్ అంటే ఇష్టం.
ఇందులో ఎప్పుడు కొత్త మోడల్ విడుదలయినా.. విడుదలయిన రోజే విదేశాలకు వెళ్లిపోయి మరీ కొనుగోలు చేస్తుంటారు. కొందరు అయితే విదేశాల్లో తమకు తెలిసినవారి ద్వారా ఐఫోన్ ను తెప్పించుకుంటారు. అంతగా ఐఫోన్ పాపులర్ అయిపోయింది.
తాజాగా ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్ల ప్రియులు అత్యంత ఆసక్తిగా చూసిన యాపిల్ ఐఫోన్ 15, 15 ప్లస్ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా అమెరికాలో జరిగింది. అమెరికాలోని కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ వేదికగా 'వండర్ లస్ట్' పేరుతో అత్యంత అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను మార్కెట్ లోకి వదిలింది.
ఐఫోన్ 15తోపాటు మిగతా యాపిల్ ఉత్పత్తులకు ఉండే క్రేజును దృష్టిలో పెట్టుకుని యాపిల్ వాచ్‌లు... 'వాచ్ సిరీస్ 9', 'వాచ్ అల్ట్రా 2'ను కూడా విడుదల చేసింది.
ఈసారి టైప్-సీ కేబుల్ తో కూడిన ఛార్జింగ్ ను ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో యాపిల్ అమర్చడం విశేషం. ఇక వాచ్ లకు సంబంధించి వాటి జీవితకాలం ఎక్కువగా ఉండేలా డిజైన్ చేసింది. అయితే తాజా కార్యక్రమంలో ఎయిర్ ప్యాడ్ లను యాపిల్ విడుదల చేయలేదు. బహుశా ఈ ఏడాది చివరలో విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇక ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫీచర్స్, ధరలను పరిశీలిస్తే.. ఐఫోన్ 14 మోడల్‌లో ఉన్నట్లే ఐఫోన్ 15లోనూ 6.1, ఐఫోన్ 15 ప్లస్‌లో 6.7 అంగుళాల తెరలను అమర్చారు. అలాగే ఓఎల్‌ఈడీ సూపర్ రెటీనా డిస్‌ప్లే ఉంది. గులాబీ, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో ఇవి లభ్యమవుతాయి.
మరిన్ని ఫీచర్స్ లోకి వెళ్తే... డైనమిక్ ఐలాండ్ తో కొత్త నాచ్ డిస్‌ప్లే, వెనక వైపు 2ఎక్స్ టెలిఫొటో సామర్థం ఉన్న 48 మెగాపిక్సల్ కెమెరా ఇవ్వడం విశేషం. 24 ఎంఎం, 28 ఎంఎం, 38 ఎంఎం లెన్స్ లు అందుబాటులో ఉన్నాయి. దీంతో హైరెజల్యూషన్ ఫొటోలు, వీడియోలను తీసుకోవడానికి అవకాశం ఉంది. తక్కువ కాంతిలోనూ ఫొటోలు తీసుకునే వెసులుబాటు ఉంది.
ఐఫోన్ కు సంబంధించి ఈసారి ఏ16 బయోనిక్ చిప్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే యూఎస్‌బీ-సీ కేబుల్ తో కూడిన ఛార్జింగ్ కొత్త మార్పులుగా చెబుతున్నారు.
ఇక ఐఫోన్ 15 ప్రోలో 6.1 అంగుళాల తెర, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో 6.7 అంగుళాల తెర అమర్చారు. ఈసారి ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడళ్లు నాలుగు వేరియంట్లలో.. టైటానియం వైట్, నేచురల్ టైటానియం, టైటానియం బ్లూ, టైటానియం బ్లాక్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్లలో వెనక వైపు 48 మెగాపిక్సల్ కెమెరా ఉంది. 3 ఫోకల్ లెంగ్త్ కెమెరా కూడా ఉండటం విశేషం.
ఇక ఐఫోన్ 15 ప్రోలో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 15ప్రో మ్యాక్స్‌లో 5ఎక్స్ టెలిఫోటో లెన్స్ ను అమర్చారు.
కాగా ఐఫోన్ 15 ధరలు భారత్‌లో రూ.79,900 (799 యూఎస్ డాలర్లు) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక ఐఫోన్ 15 ప్లస్ ధరలు రూ.89,899 (899 యూఎస్ డాలర్లు) నుంచి ఉంటాయని తెలుస్తోంది.
128 జీబీ స్టోరేజ్‌తో కూడిన ఐఫోన్ 15 ప్రో ధరను భారత్ లో రూ.1,34,900 (999 డాలర్లు), 256 జీబీ స్టోరేజ్ తో కూడిన ప్రోమాక్స్ ధర రూ.1,59,900 (1199 డాలర్లు)గా నిర్ణయించారని సమాచారం.
అలాగే వాచ్ సిరీస్ 9 ఉత్తమంగా హెల్త్ ట్రాక్ చేస్తుందని తెలుస్తోంది. దీనిద్వారా లొకేషన్ ను మెరుగ్గా ట్రేస్ చేయవచ్చని చెబుతున్నారు. దీని ధర భారత్ లో రూ. 41,900 నుంచి ఉంటుందని సమాచారం.
అదేవిధంగా యాపిల్ వాచ్ అల్ట్రా 2ను త్వరగా ఛార్జింగ్ అయ్యేలా రూపొందించారు. ఈ వాచ్ ధరలు 799 డాలర్ల నుంచి ఉండనున్నాయి.