దిశ యాప్ కోసం ఏపీ పోలీసులు ఆ సైనికుడ్ని అంతలా కొట్టేశారే

ఓటీపీతో సైబర్ నేరాలకు అవకాశాలు ఉన్నాయని చెబుతూ.. సదరు పోలీసుల ఐడీ కార్డులు తనకు చూపించాలని కోరాడు.

Update: 2023-11-08 05:05 GMT

పదవి బాధ్యతను ఇవ్వలే కానీ బలుపును ఇవ్వకూడదు. ఈ విషయాన్ని మర్చిపోయి.. తరచూ తప్పులు చేసే కొందరి తీరు ప్రభుత్వాలకు.. వారు ప్రాతినిధ్యం వహించే వ్యవస్థలకు చెడ్డపేరును తీసుకొస్తుంటుంది. తాజాగా అలాంటి ఉదంతమే అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఉదంతం మొత్తాన్ని చదివిన తర్వాత.. అనకాపల్లి జిల్లా పోలీసుల తీరుపై ఆగ్రహం కలుగక మానదు. ఒక సైనికుడ్ని రోడ్డు మీద చితక్కొట్టేసిన ఉదంతం.. దానికి కారణం తెలిస్తే విస్మయానికి గురి కావాల్సిందే. ఈ మొత్తం ఉదంతంలో రిలీఫ్ అచ్చే అంశం ఒక్కటే.. జరిగిన దారుణ ఘటనపై జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించటం.. చర్యలు తీసుకోవటం.

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలేనికి చెందిన సయ్యద్ అలీముల్లా జమ్మూకశ్మీర్ బారాముల్లాలో 52వ రాష్ట్రీయ రైఫిల్ క్యాంపులో సైనికుడిగా పని చేస్తుంటారు. సెలవుపై ఈ నెల 2న ఇంటికి వచ్చారు. మంగళవారం పరవాడ సంతబయలు వద్ద బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అక్కడున్న కానిస్టేబుళ్లు.. దిశ యాప్ ను డౌన్ లోడ్ చేయాలని చెబుతూ.. అందరి ఫోన్లలోనూ ఆ యాప్ ను డౌన్ లోడ్ చేయిస్తున్నారు.

సయ్యద్ అలీముల్లా ఫోన్ లోనూ డౌన్ లోడ్ చేయించారు. ఈ సందర్భంగా అతడికి వచ్చిన ఓటీపీని ఒక పోలీస్ కానిస్టేబుల్ రాసుకున్నారు. ఓటీపీతో సైబర్ నేరాలకు అవకాశాలు ఉన్నాయని చెబుతూ.. సదరు పోలీసుల ఐడీ కార్డులు తనకు చూపించాలని కోరాడు. వేసుకున్న పోలీస్ డ్రెస్ కనిపించట్లేదా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ‘‘పోలీస్ స్టేషన్ కు వస్తే కార్డుల్ని చూపిస్తాం’’ అంటూ పరుషంగా మాట్లాడుతూ అతడి కాలర్ పట్టుకొని లాగేయటంతో కింద పడిపోయాడు.

ఆ వెంటనే ఒక కానిస్టేబుల్ బూటుకాలితో అలీముల్లాను తన్నారు. మరో మహిళా కానిస్టేబుల్ అలీముల్లా దవడ మీద కొట్టారు. గుర్తింపు కార్డు అడిగితే మాత్రం.. ఇంత దారుణంగా కొట్టేస్తారా? అంటూ స్థానికులు ప్రశ్నించారు. అయినా.. పురుషులకు దిశ యాప్ ఎందుకు? అంటూ నిలదీశారు. ఈ క్రమంలో అక్కడకు మరో ఇద్దరు పోలీసులు వచ్చారు. నలుగురు కలిసి బలవంతంగా అలీముల్లాను స్టేషన్ కు తీసుకెళ్లేందుకు ఆటో ఎక్కించబోయారు. దీంతో.. బాధితుడు ప్రతిఘటించటంతో పోలీసులు అతడి ఐడీ కార్డును తీసుకొని వెళ్లిపోయారు.

ఈ నేపథ్యంలో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆ వెంటనే అనకాపల్లి ఎస్పీ మురళీక్రిష్ణను కలిశారు. తనకు ఎదురైన ఘటన గురించి వివరించారు. దీనిపై స్పందించిన ఎస్పీ తక్షణం.. ఈ ఉదంతంపై విచారణకు ఆదేశాలు జారీ చేయటంతో పాటు.. ఈ ఘటనకు బాధ్యులైన నలుగురు కానిస్టేబుళ్లను వీఆర్ కు ఎటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక సైనికుడి విషయంలోనే ఇంతలా వ్యవహరిస్తే.. సాదాసీదా ప్రజలతో వ్యవహరించే ధోరణి మరెంతలా ఉంటుందో అన్నది చర్చగా మారింది.

Tags:    

Similar News