టైం లేదు.. 'టైం' కలిసి రావడం లేదు.. ఏపీ పాలిటిక్స్ తీరిది!
ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు
ఎన్నికలకు సమయం సరిగ్గా 8 నెలలు మాత్రమే ఉన్నాయి. నిజానికి ఈ సమయం ఎక్కువని అనుకున్నా .. క్షేత్రస్తాయిలో పార్టీలను గమనిస్తే.. అతి పెద్ద యంత్రాంగం ఉన్న టీడీపీ, వైసీపీలకు కూడా.. ఈ టైం సరిపోదనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ-టీడీపీలను యంత్రాంగం పరంగా పోల్చుకుంటే.. బలంగానే ఉన్నా యి. మండల, గ్రామ స్థాయి వరకు ఈ రెండు పార్టీలు విస్తరించి ఉన్నాయి. అలాంటి పార్టీలు కూడా టైం సరిపోదనే లెక్కలు వేసుకుంటున్నాయి.
''ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు'' అంటూ.. అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు వైసీపీ అధినేత, సీఎం జగన్‌లు ఇద్దరూ కూడా నాయకులకు తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలోనే చూచాయగా టికెట్లను కూడా కన్ఫర్మేషన్ చేస్తున్నారు. ఇప్పటికి అధికారికంగా.. వైసీపీ 100 నియోజకవర్గాల్లో నాయకులకు హామీ ఇచ్చింది. టీడీపీ సుమారు 70 నియోజకవర్గాల టికెట్లను కన్ఫర్మ్ చేసింది. మిగిలిన వాటి పరిస్థితిని ఆచి తూచి పరిశీలిస్తున్నారు.
కానీ, ఉన్న సమయం ఏమాత్రం సరిపోదనే టాక్ మాత్రం రెండు పార్టీల్లోనూ వినిపిస్తోంది. ఇటు సర్కారు.. అటు ప్రతిపక్షం రెండూ కూడా ప్రజల మధ్యకు పరుగులు పెట్టేందుకు పలు రూపాల్లో కార్యక్రమాలను రెడీ చేసుకుంటున్నాయి. ఇక, మరో ప్రధాన పార్టీ.. జనసేన ప్రజల మధ్య ఉందనే టాక్ వినిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఈ పార్టీకి అభిమానులు తప్ప కార్యకర్తలు పెద్దగా కనిపించడం లేదనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.
వార్డు స్థాయిలో బూత్ స్థాయిలో జనసేన వీక్‌గానే ఉంది. అయితే.. పవన్ ఈవిషయాన్ని పక్కన పెట్టారో.. లేక ఇంకా టైం ఉందని అనుకుంటున్నారో కానీ.. పెద్దగా క్షేత్రస్థాయిపై దృష్టి పెట్టిన పరిస్థితి లేదు.
ఇక, ఎన్నికలకు టైం లేదనే విషయాన్ని.. క్షేత్రస్థాయిలో నాయకులు పదే పదే గుర్తు చేస్తున్నారు. ఇక, ఈ టైం సంగతి ఎలా ఉన్నా.. ఆయా పార్టీల ఫ్యూచర్(టైం) విషయానికి వస్తే.. కూడా గందరగోళంగానే ఉందని అంటున్నారు. ఇతమిత్థంగా ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లే పరిస్థితిలో లేవని చెబుతున్నారు.
పొత్తులు తేలుతాయో లేదో.. అనే గందరగోళంలో టీడీపీ-జనసేనలు ఉంటే.. ఈ పొత్తుల విషయాన్ని తేల్చేస్తే.. తమ పని తాను చేసుకుని పోతామని వైసీపీ భావిస్తోంది. అయితే.. ఈ పొత్తులు తేలడం లేదు. దీంతో వైసీపీ ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై తర్జన భర్జన పడుతోంది. అంటే మొత్తంగా.. ఒకవైపు టైం లేదు.. అదేసమయంలో టైం కలిసి రావడం లేదు.. అనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.