అయిదు రోజుల అసెంబ్లీ...పూర్తి బడ్జెట్ తోనే !
ఈనెల 22నుండి అసెంబ్లీ సమావేశాలు సుమారు అయిదు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని సమావేశాలు ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు వీలుగా విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించారు.
ఏపీ అసెంబ్లీ అయిదు రోజుల పాటు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నెల 26 దాకా జరుగుతాయని అంటున్నారు.
ఇక ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతామని తొలుత కూటమి ప్రభుత్వం అనుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. దాని మీద వైసీపీ నుంచి విమర్శలు వచ్చాయి. పూర్తిస్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు. ఒకవేళ ఓటాన్ అకౌంట్ పెడితే విపక్షం విమర్శలకు తోడు జనంలోకి సైతం తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆలోచించారో ఏమో తెలియదు కానీ పూర్తి బడ్జెట్ కే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది అని అంటున్నారు.
దాంతో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఎనిమిది నెలలకు గానూ పూర్తిస్థాయి బడ్జెట్ ని ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ లో ఏముంటుందో అన్నది చూడాల్సి ఉంది. తొలిసారి ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నారు. మరో వైపు బడ్జెట్ సెషన్ కాబట్టి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగం చేస్తారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఈనెల 22నుండి అసెంబ్లీ సమావేశాలు సుమారు అయిదు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని సమావేశాలు ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు వీలుగా విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుఆదేశించారు.
అసెంబ్లీ గ్యాలరీ లోకి ప్రవేశించే వారిని పూర్తిగా తనిఖీ చేశాకే అనుమతించాలని స్పష్టం చేశారు.అంతేగాక గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోనికి అనుమతించాలని అన్నారు.ఈసారి అసెంబ్లీ సమావేశాలకు 88 మంది కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు అలాగే మరో 9 మంది శాసన మండలి సభ్యులు రానున్నారని వారిని గుర్తించేందుకు అసెంబ్లీ సిబ్బందని ప్రవేశ ద్వారాల వద్ద ప్రత్యేకంగా నియమించాలని అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. బందోబస్తు నిర్వహించే పోలీస్ సిబ్బందికి,మీడియాకు తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
మరో వైపు గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగులుతామని ఇప్పటికే వైసీపీ స్పష్టం చేసింది. ఆ పార్టీ అధినేత జగన్ ఇదే విషయాన్ని ప్రకటించారు. వైసీపీకి శాసనమండలి శాసనసభలతో కలుపుకుని మొత్తం 41 మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని దాంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని అంటున్నారు.