వైసీపీలో ఇంకా కోవర్టులు ఉన్నారా ?

వైసీపీలో పెద్ద నాయకులలో కొందరిని అసలు పచ్చ మీడియా అయితే పట్టించుకోవడం లేదు, వారిని టార్గెట్ కూడా చేయడం లేదు.

Update: 2024-09-14 13:30 GMT

రాజకీయం అంటేనే వ్యూహాలు ప్రతివ్యూహాలు ఉంటాయి. ఎదుటి పార్టీలోని బలాలు బలహీనతలు తెలుసుకోవడం అందులో అసలైన వ్యూహం. ఇది రాజుల కాలం నుంచి కూడా ఉంది. వేగుల ద్వారా ముఖ్య సమాచారాన్ని ఆ రోజుల్లో తెప్పించుకునేవారు. ఆధునిక కాలంలో రాజకీయ పార్టీలలో కూడా అలాంటి వేగులు ఉంటూనే ఉన్నారు.

వారికే నూతన పరిభాషలో కోవర్టులు అని అంటూంటారు. వీరి పని ఏంటి అంటే పార్టీతో మంచిగా ఉంటూనే సీక్రేట్స్ ప్రత్యర్ధి పార్టీలకు చేరవేయడం. అలా కోవర్టులు ఎక్కువ అయితే నిండు పడవకు చిల్లు పడి నడి సంద్రంలో ఎలా మునక వేస్తుందో అదే పరిస్థితి ఉంటుంది.

వీరే యావత్తు కొంప ముంచుతారు అన్న మాట. వైసీపీ విషయానికి వస్తే కోవర్టుల బెడద ఆది నుంచి ఎక్కువే. ఎందుకంటే వైసీపీలో చేరిన వారు అంతా వేరే పార్టీల నుంచి వచ్చిన వారే కావడంతోనే అంటున్నారు. ముందు బేస్ లేవెల్ లో అయినా పార్టీకి విధేయులు అయిన వారు ఉంటే బాగానే ఉంటుంది.

కానీ అయారాం గయారాం లకు వైసీపీ ఆది నుంచి ఆశ్రయం ఇస్తోంది. వారి అవకాశాలు వారు అందిపుచ్చుకుని పార్టీని చేటు చేస్తూ చల్లగా పోతున్నారు అన్న టాక్ కూడా ఉంది. ఇక వైసీపీలో చూస్తే ఎన్నికల ముందు నుంచి కూడా ఈ కోవర్టుల బెడద ఎక్కువగానే ఉంది అని ప్రచారం సాగింది.

వీరంతా వైసీపీలో ఉంటూ అక్కడ ముఖ్యమైన సమాచారాని టీడీపీ కూటమికి ఎప్పటికపుడు చేరుస్తూ తాము ఉన్న పార్టీనే ముంచేశారు అని కూడా చెప్పుకున్నారు. అయితే ఎన్నికలు అయ్యాయి. వైసీపీ ఓటమి పాలు అయింది. మరి ఇపుడు కూడా కోవర్టులు పార్టీలో ఉన్నారా అంటే ఉన్నారు అని ప్రచారం అయితే సాగుతోంది.

ఈ కోవర్టుల భరతం పట్టడంతో అధినాయకత్వం చేయాల్సింది చేస్తోంది అని అంటున్నారు. కొంతమంది కోవర్టులను జగన్ గుర్తించి బయటకు ఇప్పటికే పంపించారు అని కూడా అంటున్నారు. అయితే ఇంకా చాలా మందే ఉన్నారు అని అంటున్నారు.

వీరి మీద కూడా అధినాయకత్వానికి కీలకమైన సమాచారమే ఉందని వారిని కూడా సరైన సమయం చూసి పంపించాలని అనుకుంటోంది అని అంటున్నారు. మరి ఈ కోవర్టులను ఎలా గుర్తించడం అంటే అక్కడే చాలా తమాషాలు జరుగుతున్నాయి.

వైసీపీలో పెద్ద నాయకులలో కొందరిని అసలు పచ్చ మీడియా అయితే పట్టించుకోవడం లేదు, వారిని టార్గెట్ కూడా చేయడం లేదు. ఇక్కడ డౌట్లు అందరికీ పుట్టుకుని వస్తున్నాయి. ఇలా పచ్చ మీడియా వీరి మీద సాఫ్ట్ కార్నర్ తో ఉందీ అంటే వీరంతా టీడీపీ కూటమితో కుమ్మకు అయినట్లే అని నిర్ధారణకు వస్తున్నారు.

లేకపోతే వైసీపీలో ఎవరినీ విడిచిపెట్టకుండా ముప్ప తిప్పలు పెడుతూ మూడు చెరువుల నీరు తాగిస్తున్న కూటమి పెద్దలతో పాటు గోరంత ఉంటే కొండంత విషయంగా ప్రచారం చేస్తూ పూర్తిగా రాజకీయ బురద అంటించి బదనాం చేస్తున్న పచ్చ మీడియాకు వీరి మీద ఎందుకు అంత ప్రేమ అన్న చర్చ కూడా వస్తోంది.

దీంతో జగన్ కూడా ఈ విషయం మీద సీరియస్ గానే ఉంటున్నారు. అందుకే తొందరలోనే వారిని కూడా కట్టగట్టి బయటకు పంపించే ఆలోచనలో జగన్ ఉన్నారు అని అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం కూడా ఉంది. టీడీపీలో ఏళ్ళ తరబడి ఉన్న వారు వైసీపీలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చారు.

వారిలో కొందరు తిరిగి వెళ్లిపోయారు. మరి కొందరు అధికారం లేకపోయినా ఇంకా ఉంటున్నారు. సో వారి మీద కన్ను వైసీపీ పెద్దలకు ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గొడుగు పట్టే రకాలు కూడా ఉన్నాయి. వీరు కూడా పూర్తిగా వైసీపీ శిబిరాన్ని ఖాళీ చేయకుండా పట్టుకుని వేలాడుతున్నారు.

ఇంకొందరు అయితే పార్టీలో కేవలం ఉండేదే ఇలాంటి సమాచారం చేరవేసేందుకు అని అంటున్నారు. నేరుగా వెళ్ళి కూటమి తీర్ధం పుచ్చుకోకుండా ఇక్కడే ఉండి అక్కడకు మేలు చేస్తున్నారు అని అంటున్నారు. ఆ విధంగా వారు విపక్షంలో ఉన్నా కూటమి పెద్దల కరుణా కటాక్షాలకు నిండుగా నోచుకుంటున్నారు అని అంటున్నారు.

ఇలా వైసీపీలో చేరి తానులో ముక్కలా కలసిపోయిన వీరిని పట్టుకోవడం అంత సులువు కాదు అని అంటున్నారు. అయితే అధినాయకత్వం ఫోకస్ పెడితే కష్టమేమీ కాదు అని అంటున్నారు. మరో విషయం ఏంటి అంటే ఇప్పటికైనా వైసీపీ విధేయులకు బాధ్యతలు అప్పగించి పార్టీ మీద జగన్ మీద వైఎస్సార్ మీద ప్రేమ అభిమానాలు ఉన్న వారికి పెద్ద పీట వేయాలని కోరుతున్నారు. అపుడే వైసీపీకి కోవర్టులు అనే చీడ పురుగుల బెడద తప్పుతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News