ఎంపీగా గెలిపిస్తే పట్టించుకోరా? బీజేపీ రాష్ట్ర నేత రాజీనామా
ఆర్మూర్ నియోజకవర్గ ఇంఛార్జీ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపింది.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీకి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు కట్టబెట్టడంతో అసంతృప్తి రేకెత్తిన సంగతి తెలిసిందే. మరోవైపు నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు స్థానిక నేతల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతూనే ఉంది. తాజాగా అర్వింద్‌పై విమర్శలు చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు, ఆర్మూర్ నియోజకవర్గ ఇంఛార్జీ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపింది.
బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి వినయ్ రెడ్డి లేఖ రాయడం సంచలనంగా మారింది. అంతే కాకుండా ఇందులో పార్టీలో అంతర్గత సమస్యల కారణంగానే పార్టీని వీడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేసిన వినయ్ ఓటమి పాలయ్యారు.
కానీ ఆ తర్వాత లోకసభ ఎన్నికల్లో ధర్మపురి అర్వింద్ విజయం కోసం వినయ్ పనిచేశారు. కానీ ఇప్పుడు అర్వింద్ తనను పార్టీ నుంచి దూరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని వినయ్ ఆరోపించారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ నేతలను తనతో తిరగొద్దని అర్వింద్ ఆదేశాలు జారీ చేశారని వినయ్ పేర్కొన్నారు. తన ఇష్టానుసారం కొంతమందిని పార్టీలోని పదవుల నుంచి తప్పించారని వినయ్ ఆరోపించారు. కొత్త వ్యక్తులను పార్టీలోకి తీసుకు వచ్చి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు అర్వింద్ ప్లాన్ చేస్తున్నారని వినయ్ అన్నారు.
మరోవైపు బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తప్పించడంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనన్న విషయం అందరికీ తెలిసిందని వినయ్ పేర్కొనడం గమనార్హం. మొత్తానికి అర్వింద్‌పై అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మరి దీనిపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.