వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టుపై అటెంప్టివ్ మర్డర్ కేసు!
ఆయనతోపాటు.. మరో ఆరుగురు కీలక అనుచరులపైనా కేసులు నమోదు చేశారు.
వైసీపీ నాయకుడు, కాపు నేత... మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు, ప్రస్తుత మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి.. పేర్ని కృష్ణమూర్తి ఉరఫ్ కిట్టుపై పోలీసులు హత్యా యత్నం(అటెంప్టివ్ మర్డర్) కేసు పెట్టారు. ఆయనతోపాటు.. మరో ఆరుగురు కీలక అనుచరులపైనా కేసులు నమోదు చేశారు. దీనిలో పేర్ని కిట్టును ఏ-1గా పోలీసులు పేర్కొన్నారు. జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి చొరబడి తీవ్రస్థాయిలో బెదిరించడం.. కర్రలు రాళ్లతో దాడి చేయడంతో ఈ కేసును నమోదు చేయడం గమనార్హం.
ఏం జరిగింది?
మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేర్ని కిట్టు.. ప్రచారాన్ని ఉద్రుతం చేశారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న 8వ డివిజన్‌లో పర్యటించారు. ఈ క్రమంలో జనసేన నేత కర్రి మహేష్.. ఇంటి ముందు కిట్టు అనుచరులు.. టపాసులు కాల్చారు. దీంతో ఉలిక్కిపడిన మహేష్ కుటుంబ సభ్యులు ఇదేంపని అంటూ.. కార్యకర్తలను నిలదీశారు. ఇలా మొదలైన రగడ.. ఏకంగా దాడి చేసే వరకు వెళ్లింది. కిట్టు సహా ఆయన అనుచరులు జనసేన నేత మహేష్ ఇంట్లోకి చొరబడి ఆయనతోపాటు.. బంధువులను కూడా రోడ్డు మీదకు లాక్కొచ్చి కొట్టారనేది ప్రధాన ఫిర్యాదు. ఈ క్రమంలో బాధితులు తీవ్రంగా గాయపడ్డారు.
అదేవిధంగా మహేష్ ఒంటిపై ఉన్న దుస్తులు కూడా చిరిగిపోయాయి. పలు చోట్ల గాయాలయ్యాయి. అయితే.. మహేష్‌పై దాడి విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు కూడా.. కిట్టు అనుచరులపై దాడులు చేశారు. వీరిలో ఇద్దరు ఎస్సీ వర్గానికి చెందిన యువకులు ఉన్నారు. దీంతో వివాదం మరో మలుపు తిరిగింది. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిట్టు సహా ఆయన అనుచరులపై కేసులు నమోదు చేశారు. వీరిపై హత్యాయత్నం కేసు పెట్టారు. ఇక, కిట్టు అనుచరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహేష్ వర్గంపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదుచేశారు. ప్రస్తుతం మచిలీపట్నం నియోజకవర్గం తీవ్ర ఉద్రిక్తతగా మారింది. ఇరు పక్షాలు కూడా.. శాంతి యుతంగా ఉండాలని పోలీసులు కోరారు. మరోవైపు ప్రధాన కూడళ్లలో పికెట్లు ఏర్పాటు చేశారు.
కిట్టు అనుచరులపై ఫిర్యాదు ఇదీ..
జనసేన నేత మహేష్ కారు అద్దాలు, పూలకుండీలు ధ్వంసం చేశారు. మహేష్ భార్య హేమలతపై దాడి చేసి ఆమె మెడలోని తాళిబొట్టును లాగేశారు. అత్తగారు జ్ఞానప్రసూనాంబను నెట్టేయడంతో ఆమె తలకు గాయమైంది. అక్కడే ఉన్న హేమలత కుమారుడు సాయికృష్ణ రామబ్రహ్మం, కుటుంబసభ్యులు గోకుల్, నాగబాబులపైనా చేయి చేసుకున్నారు.
మహేష్‌పై ఫిర్యాదు ఇదీ..
తమను కులం పేరుతో దూషించారని కిట్టు అనుచరులు ఫిర్యాదు చేశారు. అందుకే దాడి చేసినట్టు తెలిపారు.