అవంతికి అక్కడ చెక్... భీమిలి వైసీపీలో బిగ్ చేంజ్...!?
విశాఖ జిల్లాలో కీలకమైన అసెంబ్లీ సీటు భీమునిపట్నం విశాఖ పార్లమెంట్ పరిధిలో అతి ఎక్కువ ఓటర్లు ఉన్న సీటు కూడా ఇదే
విశాఖ జిల్లాలో కీలకమైన అసెంబ్లీ సీటు భీమునిపట్నం విశాఖ పార్లమెంట్ పరిధిలో అతి ఎక్కువ ఓటర్లు ఉన్న సీటు కూడా ఇదే. ఏకంగా మూడున్నర లక్షల మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. భీమిలీ సీటు టీడీపీకి కంచుకోట. అయితే దానిని బద్దలు కొట్టి వైసీపీ 2019లో గెలుచుకుంది. ఈసారి కూడా గెలవాలని చూస్తోంది.
ఇదిలా ఉంటే జగన్ వేవ్ లో సైతం కేవలం తొమ్మిది వేల ఓట్ల తేడాతో అవంతి శ్రీనివాసరావు గెలిచారు. లాస్ట్ మినిట్ లో టీడీపీ అభ్యర్ధి ప్రకటించినా తొంబై వేల పై చిలుకు ఓట్ల దాకా తెచ్చుకున్నారు. అదే టైం లో కొత్త ముఖం అయినా జనసేన తరఫున నిలిచిన సందీప్ పంచకర్లకు పాతిక వేల దాకా ఓట్లు లభించాయి.
ఈ రెండూ కలిపితే వైసీపీ కంటే ఎక్కువే ఉంటాయి. ఈసారి పొత్తులలో జనసేన టీడీపీ కూటమి ఉంది. దాంతో వైసీపీకి భీమిలీ అంత ఈజీ కాదు అని అంటున్నారు. పైగా మంత్రిగా రెండున్నరేళ్ల పాటు పనిచేసిన భీమిలీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ఏమీ చేయలేదు అన్న అసంతృప్తి జనాలలో ఉంది. ఇక ఆయన పనితీరు పట్ల వ్యతిరేక నివేదికలు వెళ్లాయని అంటున్నారు.
వైసీపీలో మొదటి నుంచి ఉన్న వారు అవంతి వెంట వచ్చిన వారు అన్న రెండు వర్గాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో టీడీపీని ఎదుర్కోవాలీ అంటే అవంతిని మార్చేయాల్సిందే అని అంటున్నారు. ఆయన ప్లేస్ లో బీసీకి ఇస్తారు అని ప్రచారం సాగుతోంది. అవంతిని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయిస్తారని అంటున్నారు.
అదే విధంగా 2019లో విశాఖ తూర్పు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిన వీమ్మార్డీయే చైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మలను భీమిలీ నుంచి పోటీ చేయిస్తారు అని అంటున్నారు. భీమిలీలో యాదవ సామాజిక వర్గం ఓట్లు ముప్పయి అయిదు నుంచి నలభై వేల దాకా ఉన్నాయి. దాంతో పాటు ఇతర బీసీ ఓట్లు లక్షన్నర పై చిలుకు ఉన్నాయి. కాపుల ఓట్లు డెబ్బై వేల దాకా ఉన్నాయి. దాంతో బీసీల ఓట్లు రెండు లక్షలు, ఎస్సీ మైనారిటీ ఓట్ల మీద వైసీపీ కన్నేసింది.
వారి అండతో మరోసారి గెలవాలని చూస్తోంది అని అంటున్నారు. అక్రమాని విజయనిర్మల గతంలో భీమునిపట్నం మునిసిపాలిటీ చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. అంగబలం అర్ధం బలం కలిగిన యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. విశాఖ జిల్లాలో యాదవులకు ఎక్కడా వైసీపీ టికెట్ ఇవ్వలేదు. విశాఖ పార్లమెంట్ పరిధిలో ప్రభావితం చేయగలితే స్థితిలో యాదవులు ఉన్నారు.
భీమిలీ, విశాఖ తూర్పు గాజువాకలో వారి సంఖ్య అధికంగా ఉంది. అందుకే యాదవ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడం వైసీపీకి అనివార్యంగా ఉంది. ఈ సామాజిక సమీకరణలలో మాజీ మంత్రి అవంతిని అనకాపల్లికి షిఫ్ట్ చేస్తారు అని అంటున్నారు. అయితే అవంతి వర్గం మాత్రం భీమిలీ నుంచే పోటీ అంటోంది. ఆయన ఎంపీగా పోటీకి ఎస్ అంటారా అన్న చర్చ సాగుతోంది. మొత్తం మీద చూసుకుంటే అవంతికి చెక్ పడినట్లే అని వైసీపీలో ప్రచారం సాగుతోంది.