అసెంబ్లీ అధికారులు, ఫుడ్ కాంట్రాక్టరుపై అయ్యన్న ఫైర్!
అదేమైనా భోజనమా? మీరు పెట్టిన భోజనం బాగుందని ఒక్క ఎమ్మెల్యే అయినా అన్నారా? అంటూ అసెంబ్లీ అధికారులు, ఫుడ్ కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2,94,427.25 కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టగా... రూ.43.402 కోట్లతో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
అత్యంత కీలకమైన ఈ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభమై 22 వరకూ జరగనున్నాయని అంటున్నారు. ఈ సందర్భంగా శాఖల వారీగా జరిగిన కేటాయింపులపై సుదీర్ఘ చర్చ జరగనుందని చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే... అసెంబ్లీలో ఏర్పాటు చేసిన ఫుడ్ పై స్పీకర్ ఫైర్ అయ్యారు.
అవును... సోమవారం బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం సభ వాయిదా పడిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో... భోజనం చేసిన ఎమ్మెల్యేల్లో కొంతమంది అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా.. ఏర్పాటు చేసిన భోజనం ఏమాత్రం బాగాలేదని వారు స్పీకర్ కు తెలిపారు.
దీంతో... అయ్యన్న సీరియస్ అయ్యారు. అదేమైనా భోజనమా? మీరు పెట్టిన భోజనం బాగుందని ఒక్క ఎమ్మెల్యే అయినా అన్నారా? అంటూ అసెంబ్లీ అధికారులు, ఫుడ్ కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో... తమకు ఒక రకంగా, ఎమ్మెల్యేలకు మరో రకంగా భోజనం పెట్టారా? అని ప్రశ్నించారు.
దీంతో స్పందించిన కాంట్రాక్టర్.. మెనూ ఒక్కటే కానీ అని ఏదో చెప్పబోతుండగా... మరోసారి ఫైర్ అయిన అయ్యన్నపాత్రుడు.. ఎమ్మెల్యేలు అంటే తమాషాగా ఉందా.. ఏమనుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఇకనైనా పద్దతి మార్చుకోవాలని తనదైన శైలిలో హెచ్చరించారు.
సభ్యుల అవగాహన కోసం...!:
ప్రస్తుతం సభలో ఉన్న ఎమ్మెల్యేలలో తొలిసారి ఎన్నికైన వారు 84 మంది ఉండగా.. రెండోసారి ఎన్నికైన వారు 39 మంది ఉన్నారని చెప్పిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు... ఇలాంటి వారందరికీ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి అది ఆమోదం పొందే వరకూ జరిగే ప్రక్రియపై అవగాహన అవసరమని అన్నారు.
అందువల్ల మంగళవారం శాసనసభ సమావేశం ఉండదని.. ఆ సమయంలో సభ్యులందరికీ బడ్జెట్ పై అవగాహన సదస్సు ఉంటుందని స్పీకర్ తెలిపారు.