'పాడుబడిన హైదరాబాద్ లా ఢిల్లీ'.. చంద్రబాబును ఏకేస్తున్న నెటిజన్లు
హైదరాబాద్ కు ఉన్న సహజ ఆకర్షణలు, ప్రత్యేకతలు సైబరాబాద్ కు మరింత బలంగా మారాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు ఇప్పుడు అదొక నగరంగా ఎదిగింది.
మహా తీవ్ర స్థాయిలో సాగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలుగువారిని ఆకట్టుకోబోయి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్య ఇప్పుడు తెలంగాణలో, మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో దుమారం రేపుతోంది. చంద్రబాబుకు ఎప్పుడూ ఉన్న అలవాటు.. హైదరాబాద్ ను తానే డెవలప్ చేశానని చెప్పుకోవడం. అయితే, సైబరాబాద్ వంటి మరో నగరానికి ఆయన పునాది వేసినది నిజం.. దీనికిముందే ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని చంద్రబాబు అందిపుచ్చుకున్నారు. 1990ల్లోని అప్పటి పరిస్థితుల రీత్యా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహించారు. హైదరాబాద్ కు ఉన్న సహజ ఆకర్షణలు, ప్రత్యేకతలు సైబరాబాద్ కు మరింత బలంగా మారాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు ఇప్పుడు అదొక నగరంగా ఎదిగింది.
తాజాగా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆ నగరాన్ని హైదరాబాద్ తో పోల్చుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి. ఆయన తెలంగాణను అవమానించారంటూ ప్రత్యర్థులు మండిపడుతున్నారు.
ఇంతకూ ఆయన ఉద్దేశం ఏమంటే..
ఢిల్లీలోని తెలుగువారిని బీజేపీకి ఓటేయమని కోరేందుకు చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో పదేళ్లుగా ఉన్న అర్వింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఏమీ డెవలప్ చేయలేకపోయిందని విమర్శించారు. ఢిల్లీని చూస్తుంటే 1995 నాటి పాడుబడిన హైదరాబాద్ గుర్తుకొస్తోందని వ్యాఖ్యానించారు. అదే ఢిల్లీలోనూ డబుల్ ఇంజిన్ (కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం) సర్కారు ఉండి ఉంటే ఎంతో డెవలప్ అయ్యేదని చెప్పకొచ్చారు. అంతా బాగానే ఉన్నా పాడుబడిన హైదరాబాద్ అంటూ ఉదహరించడం చంద్రబాబు తన ప్రసంగంలో చేసిన అతిపెద్ద పొరపాటుగా మారింది. అదే ప్రత్యర్థులకు ఆయుధమైంది.
1995లో చంద్రబాబు తొలిసారిగా ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి 2004 మే నెల వరకు అప్రతిహతంగా తొమ్మిదేళ్లు సీఎంగా వ్యవహరించారు. ఈ సమయంలోనే ఐటీ ఐటీ అంటూ ఆయన తీవ్రంగా కలవరించారు. కానీ, తాను రాకముందు హైదరాబాద్ పాడుబడినట్లుగా ఉండేదనడం మాత్రం నెటిజన్లను ఆగ్రహానికి గురిచేసింది. వారంతా చంద్రబాబు తీరున దేశంలో మరే నాయకుడు ఉండడని మండిపడుతున్నారు. హైదరాబాద్ ను అందరు సీఎంలు డెవలప్ చేశారని పేర్కొంటున్నారు. ఇంకా హైదరాబాద్ గురించి చెప్పుకోవడం ఎప్పుడు మానేస్తారని కొందరు ప్రశ్నించారు. ఇంకొందరైతే.. అసలు చంద్రబాబు రాజకీయాల్లోకి రాకపోయుంటే ఏపీ, తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందేదని కామెంట్లు పెడుతుండడం గమనార్హం.
చంద్రబాబు ఎక్కడ మాట జారుతారా? అని ఎదురుచూస్తున్న తెలంగాణలోని ఆయన ప్రత్యర్థి పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి..?