లైట్ తీసుకుంటే.. హాటే బాబు గారు.. !
గతంలో ఇలానే లైట్ తీసుకుని కొన్ని విషయాల్లో స్పందించకపోవడంతోనే జగన్ మైనస్ అయిన విషయాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు.
కొన్ని కొన్ని విషయాలను మొగ్గలోనే పరిష్కరించాలి. ఏమాత్రం లేటైనా.. అవి ముదిరిపోతాయి. ప్రజల్లోకి బలంగా నాటుకుపో తాయి. ఈ విషయంలో విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు ముందుగానే మేల్కొంటే బెటర్ అని అంటున్నారు పరిశీలకులు. గతంలో ఇలానే లైట్ తీసుకుని కొన్ని విషయాల్లో స్పందించకపోవడంతోనే జగన్ మైనస్ అయిన విషయాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు. ఏయే విషయాల్లో ఎలా ఉన్నా.. కొన్ని ఎన్నికలను,రాజకీయాలను కూడా ప్రభావితం చేసే దిశగా ఉంటాయి అలాంటి విషయాలు తెరమీదకు రాగానే పరిష్కరించడమో.. లేదా వాటివల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవడమో చేయాలి.
ఈ విషయంలో చంద్రబాబు ఎందుకో లేటు చేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. ఉద్యోగులు సైలెంట్‌గా విజృంభిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అన్ని వర్గాల ఉద్యోగుల నుంచి కూడా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సర్కారు ఏర్పడక ముందే.. వైసీపీపై విసుగెత్తిన ఉద్యోగులు.. పెద్ద ఎత్తున ఎన్నికల సమయంలో కూటమికి అనుకూలంగా వ్యవహరించా రు. బ్యాలెట్ ఓటింగులో కూడా.. ఈ ప్రభావం కనిపించింది. పీఆర్సీ కానీ, బకాయిలు కానీ, పింఛన్ల వ్యవహారంలో పెండింగులో ఉన్న సీపీఎస్ కానీ.. ఇలా.. పలు విషయాల్లో ఉద్యోగులు అప్పట్లో రగిలిపోయారు.
అయితే.. వైసీపీ సర్కారు ఉద్యోగులవాదనను గోలగా భావించి.. పెడచెవిన పెట్టింది. ఫలితంగా 2024 ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న పరిస్థితి కనిపించింది. ఇప్పుడు కూటమి సర్కారు కు కూడా.. సైలెంట్‌గా ఉద్యోగులు సెగ పెడుతున్నారు. ఇటీవల ఉద్యోగ సంఘాల నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆర్. నారాయణమూర్తి సహా పలువురుసర్కారుపై విమర్శలు చేశారు. జిల్లాల స్థాయిలో ఉద్యోగులను వారు కదిలిస్తున్నారు. ప్రధానంగా రెండే విషయాలపై వారు పట్టుబడుతున్నారు. కొత్త పీఆర్ సీ వేయడమా.. లేక గతంలో వేసిన పీఆర్ సీకే.. చైర్మన్‌ను నియమించడమా? అనే విషయాలపై తేల్చాలని పట్టుబడుతున్నారు.
అలాగే.. 250 కోట్ల వరకు ఉన్న పెండింగు బకాయిలు చెల్లించాలని కూడా సంఘాలు పట్టుబడుతున్నాయి. నిజానికి కూటమి సర్కారు ఏర్పడిన కొత్తలో చంద్రబాబును కలిసిన వీరు.. తమ డిమాండ్ల చిట్టాను వివరించారు. అయితే.. అప్పట్లో మూడు నాలుగు నెలలు ఓపిక పట్టాలని చంద్రబాబు సూచించారు. దీంతో వారు సైలెంట్ అయ్యారు. కానీ, ఇప్పుడు ఏడు మాసాలు అవుతున్న నేపథ్యంలో వారు ప్రభుత్వ తీరుపై ఇప్పుడిప్పుడే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనేజిల్లాల స్థాయిలో ఉద్యోగుల మద్దతును కూడగడుతున్నారు. వెరసి.. ఈ సెగ భోగి మంటగా మారకముందే.. చంద్రబాబు స్పందించాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. గతంలో వైసీపీ వ్యవహరించిన తీరును గమనించి.. మేల్కోకపోతే.. ఇబ్బందులు తప్పవని కూడా చెబుతున్నారు.