కూట‌మి నేత‌ల‌కు 'వ‌లంటీర్ల' గండం.. !

ఎప్ప‌టి నుంచి వ‌లంటీర్ల‌ను తీసుకువ‌స్తామ‌న్న విష‌యాలు మాత్రం చెప్ప‌లేదు.

Update: 2024-10-06 16:47 GMT
కూట‌మి నేత‌ల‌కు వ‌లంటీర్ల గండం.. !
  • whatsapp icon

ఏపీలో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ గురించి.. గ‌త కొన్ని రోజులుగా క్షేత్ర‌స్థాయిలో చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల అక్టోబరు 1న సీఎం చంద్ర‌బాబు క్షేత్ర‌స్థాయిలో సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను పంపిణీ చేసేందుకు వెళ్లిన‌ప్పుడు కొంద‌రు మ‌హిళ‌లు కూడా వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ గురించి ప్ర‌శ్నించారు. దీనిపై చంద్ర‌బాబు స్పందిస్తూ.. వ‌లంటీర్ల‌పై ఆలోచ‌న చేస్తున్నామ‌ని చెప్పారు. కానీ, ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తారు? ఎప్ప‌టి నుంచి వ‌లంటీర్ల‌ను తీసుకువ‌స్తామ‌న్న విష‌యాలు మాత్రం చెప్ప‌లేదు.

అయితే.. వాస్త‌వానికి ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌లంటీర్ల‌ను కొన‌సాగిస్తామ‌నే చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. అంతేకాదు.. జ‌గ‌న్ ఇచ్చిన రూ.5000 కంటే కూడా రూ.10000 వ‌ర‌కు పెంచి ఇస్తామ‌న్నారు. అంతేకాదు.. నైపుణ్య శిక్ష‌ణ కూడా ఇస్తామ‌న్నారు. సో.. ఈ ప‌రిణామాల‌తో వ‌లంటీర్లు యూట‌ర్న్ తీసుకుని కూట‌మికి అనుకూలంగా ప‌నిచేశార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ కూడా సాగింది. ఇదిలావుంటే.. అస‌లు వ‌లంటీర్ల‌ను తీసుకోవాల‌ని చంద్ర‌బాబుకు ఉందా? అంటే ఖ‌చ్చితంగా ఉంది.

ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ అనే కాదు.. ప్ర‌భుత్వం చేసే ప‌నిని మ‌రింత ప్ర‌చారం చేసుకునేందుకు కూడా వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ దోహ‌ద ప‌డుతుంద‌ని కూడా చంద్ర‌బాబు యోచిస్తున్నారు. కానీ, వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు మౌనంగా ఉన్నారంటే.. మాత్రం అంద‌రి వేళ్లూ నాయ‌కుల‌వైపు చూపిస్తున్నారు. ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేకుండా కూట‌మి ప్ర‌భుత్వంలోని మూడు పార్టీల నాయ‌కులు కూడా.. వ‌లంటీర్ల‌ను వ్య‌తిరేకిస్తున్నారు.

దీనికి ప్ర‌ధానంగా ఐదు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.

1) వలంట‌ర్లు వ‌స్తే.. త‌మ ఆధిప‌త్యానికి గండి ప‌డుతుంది(వైసీపీ హ‌యాంలో ఎమ్మెల్యేల‌కు ఇదే జ‌రిగింది)

2) వ‌లంటీర్ వాచ్ డాగ్‌గా మారిపోతే.. త‌మ `ప‌నుల‌కు` ఆటంకాలు ఏర్ప‌డ‌తాయి.(అనంత‌పురంలో కొంద‌రు వైసీపీ నేత‌ల‌ను అధినేత హెచ్చ‌రించ‌డానికి కార‌ణం వలంటీర్లు ఇచ్చిన‌ నివేదిక‌లే)

3) ప్ర‌జ‌ల‌కు-త‌మ‌కు మ‌ధ్య బాంధ‌వ్యం త‌గ్గిపోతుంది. ఏ అవ‌స‌రం ఉన్నా.. త‌మ‌ను ప‌ట్టించుకోర‌న్న వాద‌న ఎక్కువ‌గా మూడు పార్టీల నాయ‌కుల మ‌ధ్య వినిపిస్తోంది. (వైసీపీ హ‌యాంలోనూ ఇదే వినిపించింది)

4) వలంటీర్ల‌తో పార్టీ కేడ‌ర్ దెబ్బ‌తింటుంది. కాబ‌ట్టి.. ఒక‌వేళ వ‌లంటీర్ల‌ను నియ‌మించాలంటే.. తాము చెప్పిన వారినే తీసుకోవాల‌న్న‌ది కూట‌మి పార్టీల నేత‌ల డిమాండ్‌(గ‌తంలో వైసీపీలో ఇలాంటి డిమాండ్ వ‌చ్చినా.. జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు)

5) వలంటీర్ల‌ను నియ‌మిస్తే.. ప్ర‌భుత్వం వారికే ప‌గ్గాలు ఇవ్వ‌రాదు. త‌మ అధీనంలో ఉండేలా నిబంధ‌న విధించాలని నేత‌లు కోరుతున్నారు. సో.. ఈ ప‌రిణామాల‌తోనే వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌విష‌యంలో చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేక పోతున్నారన్న వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News