బాధే బాబూ: మీడియా రాతలు మీకు.. సర్కారు అలసత్వం జనానికీ..!
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సౌర విద్యుత్ పథకాన్ని నరేంద్ర మోడీ ఘనంగా అమలు చేశారు.
పొగడ్తలు, ప్రశంసలు ఇచ్చినంత బూస్ట్.. అంతా ఇంతా కాదు. ఏమాటకు ఆమాట చెప్పాల్సి వస్తే.. కొంత కటువుగా ఉంటుంది. టీడీపీ, బీజేపీ నేతలు కూడా జీర్ణించుకోలేక పోవచ్చు. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు వంటివారికి నిరంతరం ప్రశంసలు, పొగడ్తలనే కోరుకుంటున్నారు. ఆది నుంచి వీరి పంథా అదే. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సౌర విద్యుత్ పథకాన్ని నరేంద్ర మోడీ ఘనంగా అమలు చేశారు.
అయితే.. బీజేపీ నేతలు చేసిన ప్రచారం.. మోడీ ఉన్నాడు కాబట్టి సూర్యుడు దిగ్విజయంగా కాంతులు చిందిస్తున్నాడని.. అందుకే సౌర విద్యుత్ ఆశించిన దానికంటే ఎక్కువగా ఉందని.. ఇది మోడీ ఘనతేనని బీజేపీ నాయకులు చెప్పుకొచ్చారు. దీనిని ఎవరైనా విమర్శిస్తే.. వారిని దేశ ద్రోహులుగా ముద్ర వేశారు. ఇప్పుడు ప్రధాని అయిన తర్వాత కూడా. . ఇదే పంథా కొనసాగుతోందన్న విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. ఇక, సీఎం చంద్రబాబు విషయానికి వస్తే.. ఎక్కడ ఏం జరిగినా.. దానిలో మంచిని ఆయనకు చెడును జగన్‌కు ఆపాదిస్తే.. ఆయన గాఢంగా నిద్ర పోతారు. లేకపోతే చిందులు తొక్కుతున్నారు.
తాజాగా సోషల్ మీడియా, వెబ్ సైట్లపై సీఎం చంద్రబాబు చిందులు తొక్కారు. ఉచిత ఇసుకకు సంబం ధించి రాసిన, చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన కంగారు పడుతున్నారు. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ గనుల శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను ఆయన ఆదేశించారు. కఠిన చర్యలు తీసుకోవాలని(అంటే తీసుకువచ్చి చితక్కొట్టాలని) పోలీసులకు కూడా దిశానిర్దేశం చేశారు. అయితే.. ఇలా చేసే వైసీపీ సర్కారు అభాసు పాలైంది. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోలేక పోవడంతోనే 11 స్థానాలకు పరిమితమైంది.
అసలు ఉచిత ఇసుక గురించి ఎవరైనా మాట్లాడుతుంటే.. ఆధారాలు చూపిస్తున్నారు. రాస్తున్న వారు కూడా.. ఆధారాలతోనే ఉచిత ఇసుక బాగోతాన్ని బట్టబయలు చేస్తున్నారు. ఉచితం పేరు చెప్పి.. వైసీపీ హయాంలో కన్నా ఎక్కువ ధరలకు ఇసుకను ఇస్తున్నారని.. ఇది మనకు మంచిది కాదని.. పదుల సంఖ్యలో టీడీపీ ఎమ్మెల్యేలే నెత్తీనోరు మొత్తుకుంటున్నారు. రవాణాకు మాత్రమే చార్జీ తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం దానికి మించిన మరో `పద్దు`(మెన్షన్ చేయకుండా) కింద మరింత సొమ్ము తీసుకుంటోంది.
దీంతో ఉచితం.. ప్రజలకు అనుచితంగా మారిపోయింది. ఈ విషయాలనే కదా.. వెబ్ సైట్లయినా.. సోషల్ మీడియా అయినా వెలుగులోకి తీసుకువచ్చింది. అది కూడా గనుల శాఖ వినియోగదారులకు ఇస్తున్న `రసీదు`ల ఆధారంతోనే చెబుతోంది. ప్రధాన మీడియా ఎలానూ భజనే చేస్తోంది. ఇక, అంతో ఇంతో విమర్శలు చేస్తున్న సాక్షిని బాబు ఎప్పుడో బాయ్ కాట్ చేశారు. అలాంటి కీలక సమయంలో వాస్తవాలు చెప్పడం ద్వారా సోషల్ మీడియా అయినా.. వెబ్ సైట్లయినా.. బాబుకు మేలు చేస్తున్నాయా? కీడు చేస్తున్నాయా? అనేది ఆయన విజ్ఞతతో ఆలోచించుకోవాలి.
సరిదిద్దుకుంటే.. చంద్రబాబు సర్కారుకు మేలు. లేకపోతే.. వైసీపీ గతే! ప్రజలకు ఎప్పుడూ ప్రత్యామ్నా యం ఉంటుందన్న విషయం చంద్రబాబుకు తెలియంది కాదు కదా!! గతంలో జగన్ కూడా ఇలా తలబిరుసు వ్యాఖ్యలు, చర్యలతోనే అథఃపాతాళానికి పడిపోయారన్న వాస్తవం తెలుసుకోవాలి. ఒక్క ఇసుకే కాదు.. అనేక విషయాల్లో కూటమి సర్కారు ఎంతగా వైఫల్యం చెందిందో చెప్పేందుకు ఇంకా సమయం ఉందనే సోషల్ మీడియా భావిస్తోంది. లేకపోతే.. బాబుకు ఆ మాత్రం నిద్ర కూడా పట్టే పరిస్థితి ఉండదేమో!!