చంద్రబాబు 2029లోనూ కుప్పం నుంచేనా ?

అలా ఆనాడు ఆయన ఆ పార్టీ అభ్యర్ధిగా తొలిసారి చంద్రగిరి నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు.

Update: 2025-01-08 09:30 GMT

ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కుప్పంతో అవ్యాజమైన అనుబంధం ఉంది. ఆయన సొంత ప్రాంతం చంద్రగిరి. ఆయన 1978లో కాంగ్రెస్ ఐ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అలా ఆనాడు ఆయన ఆ పార్టీ అభ్యర్ధిగా తొలిసారి చంద్రగిరి నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు.

ఆ అయిదేళ్ల కాలంలో ఆయన మంత్రిగా పలు కీలక శాఖలను చూశారు. ఇక 1983 లో ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేసినా కూడా బాబు కాంగ్రెస్ లోనే ఉండి చంద్రగిరి నుంచి రెండవసారి పోటీ చేశారు. అయితే టీడీపీ ప్రభంజనంలో బాబు ఓడారు. ఆయన రాజకీయ జీవితంలో మొదట చివరి ఓటమి అదొక్కటే. ఇక ఆయన టీడీపీలో చేరాక వచ్చిన 1985 మధ్యంతర ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయకుండా పార్టీ విజయానికి పాటుపడ్డారు.

ఆ అయిదేళ్ల తరువాత 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు చంద్రగిరి నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన అనూహ్యంగా కుప్పం అసెంబ్లీ సీటుని ఎంచుకున్నారు. అప్పటికి టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఎన్ రంగస్వామినాయుడుకు బదులుగా బాబు ఈ సీటుని తాను తీసుకున్నారు.

అలా కుప్పం చంద్రబాబు పరం అయింది. అదే ఆయన సొంత నియోజకవర్గం అయింది. ఇక కుప్పం రాజకీయ చరిత్ర చూస్తే 1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో తొలిసారి గెలిచింది కాంగ్రెస్ పార్టీయే. ఆ తరువాత 1962లో సీపీఐ ఎమ్మెల్యే గెలిచారు. 1967, 1972లలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడం విశేషం. 1978లో చివరిసారిగా కాంగ్రెస్ గెలిచింది. ఇక 1983 నుంచి టీడీపీ జెండావే కుప్పంలో ఎగురుతోంది.

ఒక విధంగా చెప్పాలీ అంటే టీడీపీ పుట్టాక ఆ పార్టీకే కట్టుబడిపోయిన అతి తక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో కుప్పానిది అగ్ర తాంబూలమే. ఇటీవల మూడు రోజుల పాటు కుప్పంలో ముఖ్యమంత్రి హోదాలో పర్యటించిన చంద్రబాబు ఒకే మాట అన్నారు. టీడీపీ ఏర్పాటు అయ్యాక కుప్పం ప్రజలు వేరే పార్టీ గుర్తుని చూసి ఎరుగరు అని. అది నిజమే.

కాంగ్రెస్ వామపక్షాలు బలంగా ఉండేవి ఇక్కడ. ఇక వైసీపీ కూడా అధికారంలో ఉన్నపుడు బలోపేతం కావాలని చూసింది. అయితే ఏ పార్టీని అయినా పక్కన పెడుతూ టీడీపీ సైకిల్ సింబల్ కనిపిస్తే చాలు దానికే ఓటు వేసే సంపూర్ణమైన అభిమానం కుప్పం ప్రజల సొంతం అని చెప్పాలి.

కుప్పం ప్రజల్ల రుణం తీర్చుకోలేనని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. తనను ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, ఈ నియోజకవర్గ ప్రజలకు సైకిల్ గుర్తు తప్ప మరో పార్టీ సింబల్ తెలియదని, తనపై మొదటి నుంచి నమ్మకం చూపిస్తున్నారని అన్నారు. మారుమూల ప్రాంతమైన కుప్పం నియోజకవర్గంలో మరో పార్టీ జెండా ఎగరలేదని వెల్లడించారు.

రాబోయే ఐదేళ్లలో కుప్పాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా స్వర్ణ కుప్పం విజన్ -2029కి రూపకల్పన చేశామని, ఇప్పుడు కుప్పం ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి న్యాయం చేయడం కోసం జన నాయకుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు వివరించారు.

ఇక ఇదే రకమైన భావోద్వేగంలో బాబు మరో మాట అన్నారు. తాను టీడీపీకి అధ్యక్షుడిని. కుప్పం ఎమ్మెల్యేని. రాష్ట్ర ముఖ్యమంత్రిని. నాపై మూడు రకాల బాధ్యతలు ఉన్నాయి. ఈ మూడింటినీ బాలెన్స్ చేసుకుంటూ కుప్పం ప్రజలకు అండగా ఉంటాను అని మాట ఇచ్చారు.

ఇదిలా ఉంటే 1978 తో మొదలైన చంద్రబాబు పొలిటికల్ కెరీర్ 2029 నాటికి అక్షరాల యాభై ఏళ్ళు పూర్తి చేసుకుని మరో ఏడాది కూడా గడుస్తుంది. బాబు అలా సుదీర్ఘమైన రాజకీయ జీవితంతో పాటు సీనియర్ నేతగా కూడా ఉన్నారు. ఆనాటికి ఆయన వయసు ఎనభై చేరువ అవుతుంది. మరి కుప్పంలో చంద్రబాబు 2029లో పోటీ చేస్తారా లేక ఆయన కుమారుడు నారా లోకేష్ చేస్తారా అన్న చర్చ కూడా ఉంది.

అయితే చంద్రబాబు ఏపీ అభివృద్ధి కోసం పాటు పడాలీ అంటే మరో అయిదు పదేళ్ళు ఆయనే సీఎం గా ఉండాలన్నది ప్రజల కోరిక. అంతే కాదు బాబుకు నో ఏజ్ కాబట్టి 2029 లో ఆయనే పోటీ చేసి తొమ్మిదవ సారి కూడా కుప్పం ప్రజల మన్ననలు అందుకుంటారని ఇంకా వీలైతే 2034లో పదవ సారి కూడా పోటీ చేసి గెలిచి తిరుగులేని చరిత్రను సృష్టిస్తారు అని అంతా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News