వాళ్లను వదిలి పెట్టను: వైసీపీ నేతలకు బాబు వార్నింగ్
ఎన్నికలకు ముందు.. అనేక మంది టీడీపీ బాధితులు ఉన్నారని, వారందరికీ పార్టీ అండగా ఉంటుందన్నారు.
వైసీపీ నేతలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ''వాళ్లను వదిలి పెట్టను'' అని గట్టిగా తేల్చి చెప్పారు. హద్దులు దాటి వ్యవహరించిన ఏఒక్కరినీ వదిలేది లేదన్నారు. ఎన్నికలకు ముందు అనేక రూపాల్లో టీడీపీ నాయకులను ఇబ్బంది పెట్టా రని.. వారిని వదిలి పెట్టబోనని చెప్పారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్ట ప్రకారం శిక్షించి తీరుతామని హెచ్చరించారు. శ్రీకాకు ళంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన `సూపర్ సిక్స్` అమలు కార్యక్రమ బహిరంగం సభలో చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికలకు ముందు.. అనేక మంది టీడీపీ బాధితులు ఉన్నారని, వారందరికీ పార్టీ అండగా ఉంటుందన్నారు.
తమ్ముళ్లకు కూడా..
ఇదేసమయంలో టీడీపీలో ఉన్న కొందరు దూకుడు నాయకులను ఉద్దేశించి కూడా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఎవరి పేరునుప్రస్తావించకుండానే ఆయన హెచ్చరికలు చేయడం గమనార్హం. బెల్టు షాపులు పెట్టే వారు ఒళ్లు దగ్గర పెట్టుకోవా లని సూచించారు. బెల్టు షాపులు పెట్టి.. ప్రజలనుదోచుకునేవారి విషయంలో తాను కూడా బెల్టు తీస్తానని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా ఉచిత ఇసుక విషయంలోనూ చంద్రబాబు కొన్ని హెచ్చరికలు చేశారు. ఇసుక విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే.. పీడీ యాక్టు నమోదు చేయించి అరెస్టు చేయిస్తామని తేల్చి చెప్పారు. ప్రతి విషయంలోనూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విశాఖ కూడా రాజధానే!
విశాఖ పట్నం కూడా రాజధానేనని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. ఆర్థిక రాజధానిగా దీనిని డెవలప్ చేయనున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. గతంలో తీసుకువచ్చిన పెట్టుబడులు.. వైసీపీ హయాంలో నేతల బెదిరింపులతో వెళ్లిపోయాయని అన్నారు. ఇప్పుడు మళ్లీ వారిని పిలుస్తున్నట్టు చెప్పారు. రాజధాని అమరావతికి కేంద్రం సహకరిస్తోందని, నిర్మాణాలను త్వరలోనే ప్రారంభిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
విశాఖకు అభయం
విశాఖపట్నం స్టీలు ప్లాంటును ప్రైవేటీకరణ కాకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. దీనిపై పట్టుదలతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. కేంద్రంతో చర్చలు జరుపుతున్నామన్నారు. విభజన హామీలలో కీలకమైన.. విశాఖ రైల్వే జోన్‌కు రెండు మూడు రోజుల్లో భూమి పూజ చేయనున్నట్టు చెప్పారు. ఇక, శ్రీకాకుళంపై ఈ సందర్భంగా చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. త్వరలోనే విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేసి.. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామన్నారు.