బెట్టింగ్ యాప్ వ్యవహారంలో అత్యంత కీలక పరిణామం.. వారికి మొదలు!
గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతోన్న సంగతి తెలిసిందే.;
గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సజ్జనార్ అయితే.. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ఈ సమయంలో తాజాగా ఈ వ్యవహరంలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది.
అవును... యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఈ వ్యవహారంలోకి నేరుగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా... బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన యూట్యూబర్స్ వ్యవహారంపై ఆరా తీయడం మొదలుపెట్టింది!
ఐపీఎల్ త్వరలో ప్రారంభమవబోతోన్న తరుణంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విపరీతంగా పెరిగాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో వీటిని ప్రచారం చేసిన యూట్యూబర్లు, వారికి జరిగిన చెల్లింపులు, ఆర్థిక లావాదేవీలపై ఈడీ తీవ్రంగా విచారణ జరుపుతోందని.. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానిస్తున్నారని అంటున్నారు.
ఈ వ్యవహారంలో ఇప్పటికే సుమారు 11 మంది యూట్యూబర్ల సంపాదనపై ఈడీ ప్రత్యేక దృష్టి సారించిందని.. వీరు బెట్టింగ్ యాప్స్ ప్రచారం ద్వారా పొందిన ఆదాయం, దాని మూలాలు, మొదలైన అంశాలపై ఈడీ అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. వీటి ద్వారా సేకరించిన డబ్బు చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా బదిలీ అయినట్లు ఈడీ సందేహిస్తోందని చెబుతున్నారు.
ఇందులో భాగంగా... ఈ నిధులు మనీ లాండరింగ్ తో పాటు హవాలా వ్యవస్థ ద్వారా విదేశాలకు బదిలీ అయ్యాయనే విషయంలో ప్రాథమిక ఆధారులు సూచిస్తున్నాయని.. ఈ ఆర్థిక లావాదేవీలు అనేక షెల్ కంపెనీల ఖాతాల ద్వారా జరిగినట్లు.. ఈ నిధులను క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెట్టడం వంటి వాటికి కూడా ఉపయోగించినట్లు అధికారులు గమనించారని అంటున్నారు.
దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈడీ ఎంట్రీతో ఈ వ్యవహారం వెనుక దాగి ఉన్న అసలు విషయాలు అన్నీ వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.