జనం నేర్పిన పాఠం... పాత జగన్ మళ్లీ కొత్తగా..!

దేశాన్ని పాలిస్తోన్న కాంగ్రెస్ పార్టీని కాదని, దేశాన్ని శాసిస్తోన్నట్లు చెప్పే సోనియా గాంధీని ఎదురించిన జగన్.. తనకు అన్నీ జనమే అని నమ్మారు!;

Update: 2025-03-19 05:09 GMT

నాయకుడు అనేవాడు అవకాశం ఉన్నంత మేర ప్రజలకు అందుబాటులో ఉండాలి. తాను సామాన్య ప్రజానికానికి అతీతం అనే భావన వారికి రానివ్వకుండా జాగ్రత్తపడాలి. సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకుంటూనే.. ప్రజల్లో కలిసి పోవాలి, కలిసి ఉండాలి! ఒకప్పుడు జగన్ ఇదే.. కానీ, తర్వాత మార్పు వచ్చింది.. అది మంచిది కాదనే గ్రహింపూ తాజాగా వచ్చిందని అంటున్నారు.

అవును... దేశాన్ని పాలిస్తోన్న కాంగ్రెస్ పార్టీని కాదని, దేశాన్ని శాసిస్తోన్నట్లు చెప్పే సోనియా గాంధీని ఎదురించిన జగన్.. తనకు అన్నీ జనమే అని నమ్మారు! ఫలితంగా... 2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టారు. కనీవినీ ఎరుగని స్థాయిలో అన్నట్లుగా 2019 జనవరి 9 వరకూ సుమారు 3,648 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు.

ఎండా, వాన, చలి తేడాలు లేకుండా 341 రోజుల పాటు జనంతో ఉన్నారు, జనాల్లో ఉన్నారు, జనంగా ఉన్నారు. ఫలితం అద్భుతం! 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కనీవినీ ఎరుగని స్థాయిలో అన్నట్లుగా ఒంటరిగా పోటీ చేసి 151 స్థానాల్లో ఘన విజయం సాధించారు.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు. సంక్షేమ పథకాలతో పాలించారు!

ఈ క్రమంలో... తన విజయ రహస్యాన్ని జగన్ మరిచినట్లున్నారనే కామెంట్లు వినిపించాయి. కారణం... జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా మారిపోయినట్లు కనిపించారు! పనిచేసుకుంటూ పోతే చాలు అనుకున్నరో ఏమో.. ప్రజలకు దూరమయ్యారు.. ప్రజలకు ఆయనకూ మధ్య పరదాలు, పరదాల్లాంటి పెద్దలు వచ్చి చేరారనే చర్చ బలంగా నడిచింది.

ఇది కేవలం సామాన్య ప్రజానికంలోనే కాకుండా.. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కూడా చర్చకు వచ్చింది. అంటే.. పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో... 2019 లో మా జగన్ అనుకున్న జనం, 2024లో 11 స్థానాలకు పరిమితం చేశారు.

కట్ చేస్తే... జనాలకు చేరువగా, ప్రజలకు అందుబాటులో ఉండకపోతే జరిగే పరిణామాలను జగన్ తెలుసుకున్నారని అంటున్నారు. దీంతో... మరోసారి వీలైనంత మేర ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని జగన్ ఫిక్సయ్యారని అంటున్నారు. ఈ సమయంలోనే తాడేపల్లిలోని కార్యాలయంలో ప్రజా దర్బార్ తరహా కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నారని అంటున్నారు.

ఇందులో భాగంగా... నెలలో వీలైనన్ని రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలకు సంబంధించిన అర్జీలు స్వీకరిస్తూ.. వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తూ.. వారితో కలిసి నడవాలని, ఆ విధంగా ముందుకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. ఈ మేరకు తాడేపల్లి ఆఫీసులో ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతున్నారు!

కాగా... 2019 ఎన్నికల్లో మంత్రి హోదాలో మంగళగిరిలో పోటీ చేసిన లోకేష్ ఓటమి పాలైన అనంతరం ఆయన తన స్థానాన్ని బలోపేతం చేసుకునే పనిలో భాగంగా జనాల్లోకి చొచ్చుకుని వెళ్లారు. నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా ఫిర్యాదుల పరిష్కరణతో జనాలకు చేరువయ్యారు.. ఫలితంగా.. 2024లో రికార్డ్ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News