అమెరికాను ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ తిరిగి ఇచ్చేయటమేంటి?
అగ్రరాజ్యం అమెరికా అన్నంతనే గుర్తుకు వచ్చే వాటిల్లో ముందు ఉండేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీనే.;
అగ్రరాజ్యం అమెరికా అన్నంతనే గుర్తుకు వచ్చే వాటిల్లో ముందు ఉండేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీనే. న్యూయార్క్ నగరంలో కొట్టొచ్చినట్లుగా ఉండే ఈ స్వేచ్ఛా ప్రతిమను తమకు తిరిగి ఇచ్చేయాలంటూ ఫ్రాన్స్ నేత ఒకరు చేస్తున్న డిమాండ్ ఇప్పుడు కొత్త పంచాయితీగా మారింది. ఇంతకూ ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమెరికా సొంతం కాదా? అని ప్రశ్న కొందరికి కలుగుతోంది. చరిత్రలోకి వెళితే.. ఈ విగ్రహాన్ని అగ్రరాజ్యం అమెరికాకు ఫ్రాన్స్ బహుకరించింది. 305 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం అమెరికాతో తమకున్న స్నేహ బంధానికి గుర్తుగా 1886లో బహుకరించారు.
ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ వ్యవహారం పంచాయితీగా మారటానికి కారణం ఫ్రాన్స్ కు చెందిన రాజకీయ నేత రాఫెల్ గ్లక్స్ మాన్. ఆయన తాజాగా ఈ డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. ఏ విలువలను చూసి ఆ విగ్రహాన్ని అమెరికాకు అందజేశామో.. ఇప్పుడు ఆ విలువలు అగ్రరాజ్యంలో కనిపించటం లేదని.. అందుకే.. తాము ఇచ్చిన విగ్రహాన్ని తమకు ఇచ్చేయాలన్న ఆయన వ్యాఖ్యలపై అమెరికన్లు పలువురు మండిపడుతున్నారు.
ఈ పెద్దమనిషి మాటలకు అమెరికా అధ్యక్ష భవనం స్పందించింది. అమెరికా పుణ్యమా అని ఫ్రాన్స్ ఇప్పుడు జర్మనీలో మాట్లాడటం లేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ పేర్కొన్నారు. ‘వారెప్పుడూ యఎస్ కు కృతజ్ఞతతో ఉండాలి’ అంటూ చురక వేశారు. ట్రంప్ ను తీవ్రంగా విమర్శించే ఈ ఫ్రాన్స్ నేత ఉక్రెయిన్ యుద్దంలో అగ్రరాజ్యం తీరును తీప్పు పడుతుంటారు.