దారుణం: ఏనుగు కడుపులో బిడ్డ ఉంది... కానీ, వేటగాళ్లకు కనికరం లేదు!

అస్సాం - మేఘాలయ సరిహద్దుల్లో గౌహతీ సమీపంలోని టోపటోలి గ్రామంలో ఉన్న తూర్పు ఆఫ్రికోలా రిజర్వ్ ఫారెస్ట్ లో ఓ హృదయ విదారక సంఘటన జరిగింది.;

Update: 2025-03-19 04:34 GMT

అస్సాం - మేఘాలయ సరిహద్దుల్లో అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మానవత్వం సిగ్గుపడేలా ఉన్న ఈ ఘటన కంటతడి పెట్టిస్తోందని అంటున్నారు. ఇందులో భాగంగా... కొంతమంది వేటగాళ్లు గర్భంతో ఉన్న ఏనుగును అతి కిరాతకంగా చంపి, మాంసం కోసం దాని శరీర భాగాలను నరికి తీసుకెళ్లారు. గౌహతీ సమీపంలో ఈ ఘటన జరిగింది.

అవును... అస్సాం - మేఘాలయ సరిహద్దుల్లో గౌహతీ సమీపంలోని టోపటోలి గ్రామంలో ఉన్న తూర్పు ఆఫ్రికోలా రిజర్వ్ ఫారెస్ట్ లో ఓ హృదయ విదారక సంఘటన జరిగింది. మంగళవారం నాడు ఇక్కడ కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఏనుగు మృతదేహం కనుగొనబడింది. ఇది చనిపోయి సుమారు రెండు వారాలయ్యి ఉంటుందని అంటున్నారు.

ఈ క్రమంలో సమాచారం అందిన వెంటనే పోలీసులు, అటవీశాఖ అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం... వేటగాళ్లు ఏనుగును చంపి, దాని మాంసాన్ని కోసి అక్రమ రవాణా కోసం తీసుకెళ్లారని అంటున్నారు. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది.

ఈ సమయంలో ఏనుగు శరీరంలోని కొన్ని భాగాలు కత్తిరించబడ్డాయని.. దాన్ని చంపిన అనంతరం వేటగాళ్లు దాని మాంసాన్ని తీసుకెళ్లారనే విషయం దీని ద్వారా స్పష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు. మరో అత్యంత హృదయ విధారక విషయం ఏమిటంటే.. ఏనుగు గర్భంలో పెరుగుతున్న శిశువు ఇంకా అక్కడే ఉంది!

దీనిపై అటవీశాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ విషయంపై మేఘాలయ అటవీ శాఖ అధికారులకూ సమాచారం అందించింది. ఈ ఘటన వన్యప్రాణి ప్రేమికులు, పరిరక్షణ సంస్థల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.. ఈ సందర్భంగా నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని, కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

వాస్తవానికి గతంలో కూడా అస్సాంలో ఏనుగులను వేటాడిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే.. ఈసారి కడుపుతో ఉన్న ఏనుగును చంపి దాని మాంసాన్ని తీసుకెళ్లడం ఈ నేరగాళ్ల దురాగతలాను కళ్లకు కడుతుందని అంటున్నారు. ఈ సందర్భంగా... నిందితులను అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ ఈ మేరకు హామీ ఇచ్చింది.

Tags:    

Similar News