తెలంగాణ బడ్జెట్ @ రూ.3,04,965 కోట్లు.. ఏ రంగానికి ఎంతంటే?
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.;
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,04,965 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లుగాను, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగాను పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజలు తమను నమ్మి అధికారాన్ని అప్పగించారని, వారి నమ్మకాన్ని నిలబెడుతూ జవాబుదారీతనంతో పాలన సాగిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతున్నామని, తాత్కాలిక మరియు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యను విమర్శిస్తూ నిందిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ బడ్జెట్‌లో సంక్షేమం , అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చారు.. విద్య, వైద్యం, వ్యవసాయం మరియు సంక్షేమ రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేశారు. ముఖ్యంగా, వ్యవసాయం, ఆరు గ్యారంటీ పథకాలు, ట్రిపులార్ కార్యక్రమం, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్, మెట్రో రైలు విస్తరణ మరియు మూసీ నది పునరుజ్జీవనానికి అవసరమైన నిధులు కేటాయించారు. ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో భాగంగా మిగిలిపోయిన పథకాలను పూర్తి చేయడానికి ఈ బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.
బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , ఆయన భార్య ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇది భట్టి విక్రమార్క మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా, శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
- బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయించిన నిధుల వివరాలు:
పంచాయతీరాజ్ శాఖ: రూ.31,605 కోట్లు
వ్యవసాయ శాఖ: రూ.24,439 కోట్లు
విద్యా శాఖ: రూ.23,108 కోట్లు
మహిళా శిశు సంక్షేమ శాఖ: రూ.2,862 కోట్లు
పశు సంవర్థక శాఖ: రూ.1,674 కోట్లు
పౌరసరఫరాల శాఖ: రూ.5,734 కోట్లు
కార్మిక శాఖ: రూ.900 కోట్లు
ఎస్సీ సంక్షేమం: రూ.40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం: రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమం: రూ.11,405 కోట్లు
చేనేత రంగం: రూ.371 కోట్లు
మైనార్టీ సంక్షేమ శాఖ: రూ.3,591 కోట్లు
పరిశ్రమల శాఖ: రూ.3,527 కోట్లు
ఐటీ రంగం: రూ.774 కోట్లు