5 నిమిషాలు ఛార్జ్ చేస్తే 470 కి.మీ.. ఏమిటీ కారు ప్రత్యేకత?
చైనీస్ ఈవీ ఆటోమొబైల్ కంపెనీ "బీవైడీ" కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్, బ్యాటరీ టెక్నాలజీని ప్రవేశపెట్టింది.;
సెల్ ఫోన్ ను పూర్తిగా ఛార్జ్ చేయలంటే సుమారుగా గంట సమయమైనా పడుతుంది! అలాంటిది కేవలం 5 నుంచి 8 నిమిషాలు ఛార్జ్ చేస్తే.. వందల కిలో మీటర్లు ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్ల విషయం తాజాగా తెరపైకి వచ్చి సంచలనంగా మారింది. చైనీస్ ఈవీ ఆటోమొబైల్ కంపెనీ "బీవైడీ" కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్, బ్యాటరీ టెక్నాలజీని ప్రవేశపెట్టింది.
అవును... చైనీస్ కంపెనీ బీవైడీ కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్, బ్యాటరీ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ కార్లు.. ఇప్పటి కారుల్లో ఇందనం నింపడానికి తీసుకునేంత వేగంగా ఛార్జ్ చేయగలవని చెబుతున్నారు. ఈ టెక్నాలజీ.. కేవలం ఐదు నిమిషాలు ఛార్జ్ చేస్తే 470 కి.మీ వరకూ ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది.
ఈ కొత్త టెక్నాలజీతో కూడిన కార్లు ఏప్రిల్ 2025 నుంచి మార్కెట్లోకి రానున్నాయని తెలుస్తోంది. కంపెనీ ఈ కొత్త టెక్నాలజీని హాన్ ఎల్, టాంగ్ ఎల్ ఎస్.యూ.వీ మోడళ్లలో చూడవచ్చని తెలిపింది. ఈ కార్లు కేవలం 2 సెకన్లలో గంటకు 100 కి.మీ. వేగాన్ని అందుకోగలవని చెబుతున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 4,000 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తోంది.
ఈ సందర్భంగా స్పందించిన కంపెనీ... బీవైడీ ఛార్జింగ్ వేగం టెస్లా సూపర్ చార్జ్ కంటే వేగంగా ఉంటుందని చెబుతోంది. వాస్తవానికి టెస్లా సూపర్ ఛార్జర్ 15 నిమిషాలు చేస్తే 275 కి.మీ. ప్రయాణిస్తుంది. ఇదే మెర్సిడెస్ బెంజ్ కొత్త ఈవీ 10 నిమిషాలు చార్జ్ చేస్తే 325 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. బీవైడీ కొత్త కార్ల ధర రూ.31 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.