పాత కార్ల అమ్మకాల జోరు ఎంతో చెప్పిన తాజా రిపోర్టు

కరోనా ముందుతో పోలిస్తే.. కరోనా పుణ్యమా అని భారత్ లో భారీగా డెవలప్ అయిన మార్కెట్లలో ఒకటి వాహన రంగం.

Update: 2025-01-28 10:30 GMT

కరోనా ముందుతో పోలిస్తే.. కరోనా పుణ్యమా అని భారత్ లో భారీగా డెవలప్ అయిన మార్కెట్లలో ఒకటి వాహన రంగం. కరోనా దెబ్బకు సొంతిల్లు.. సొంత వాహనం అవసరాన్ని అందరూ గుర్తించారు. కరోనా టైంలో కాస్త ఇబ్బంది పడినా.. ఆ తర్వాత నుంచి దేశీయంగా వాహన రంగం దూకుడును ప్రదర్శిస్తోంది. కొత్త వాహనాల కొనుగోలుకు తగ్గట్లే.. పాత వాహనాల్ని కొనుగోలు చేసే వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. ఈ రంగానికి సంబంధించి పాత కార్ల అమ్మకాలు.. వాటి ఫ్యూచర్ మార్కెట్ తదితర అంశాలకు సంబంధించి కార్స్ 24 తాజాగా విడుదల చేసిన రిపోర్టులో పలు ఆసక్తికర అంశాల్ని పేర్కొన్నారు.

2023లో దేశీయంగా 46 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయని.. 2030 నాటికి ఈ సంఖ్య ఏడాదికి కోటి యూనిట్లను దాటుతుందని చెబుతున్నారు. ఈ సంస్థ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం 2030 నాటికి ఏడాదికి 1.08 కోట్ల పాత వాహనాల అమ్మకాలు ఏడాదిలో జరిగే అవకాశం ఉందన్న అంచనాల్ని వ్యక్తం చేసింది. పాత కార్లకు నగరాల్లోనూ.. పట్టణాల్లోనూ అంతకంతకూ డిమాండ్ పెరుగుతోంది.

మహారాష్ట్ర.. ఢిల్లీ రాష్ట్రాలు ఈ జోరులో ముందున్నాయి. కొత్త కార్ల మార్కెట్ తో పోలిస్తే.. వాడిన కార్ల మార్కె అంతకంతకూ పెరుగుతోంది. పాత కార్ల మార్కెట్ లో 2024 16.7 శాతం వాటాలో ఎస్ యూవీలు అధిపత్యాన్ని ప్రదర్శించాయి. ఎస్ యూవీల డిజైన్.. సామర్థ్యం.. ప్రీమియం ఆకర్షణలు అందరిని ఆకర్షిస్తున్నాయి. కొవిడ్ తర్వాత వినియోగదారుల ప్రాధాన్యతల్లో గణనీయమైన మార్పు వచ్చినట్లుగా రిపోర్టు పేర్కొంది.

మెట్రో.. నాన్ మెట్రో నగరాల్లో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్ గా మారుతీ సుజుకీ స్విఫ్ట్ అవతరించింది. అదే సమయంలో హ్యుండై శాంట్రో.. టాటా టియాగో ఎన్ ఆర్ జీ.. మారుతీ సుజుకీ వ్యాగన్ - ఆర్ లాంటి మోడళ్లు అసాధారణ రీసేల్ వాల్యూను నిరంతరం కొనసాగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్ స్ప్రహ.. విలువను చూసే కొనుగోలుదారులు వీటికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా రిపోర్టు వెల్లడించింది.

వాహన ఫైనాన్సింగ్ వాటా 2010లో 60 శాతం ఉండగా.. 2024లో ఇది కాస్తా 84 శాతానికి చేరుకున్నట్లుగా రిపోర్టు వెల్లడించింది. కొత్త వాహనాల కోసం వినియోగదారులు రుణాలపై ఆధారపడుతున్నట్లుగా చెప్పటానికి తాజా రిపోర్టు ఒక నిదర్శనంగా వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News