హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ భారీగా పెంచే అరుదైన ఛాన్స్
ఇప్పుడు ప్రపంచ మీడియా సైతం దాదాపు మూడు వారాల పాటు హైదరాబాద్ లో ఉండనున్నారు.;
యావత్ ప్రపంచం హైదరాబాద్ మహానగరం వైపు కొద్ది రోజుల పాటు చూడటమే కాదు.. ఈ నగరం గురించి ప్రపంచ ప్రజలకు అరుదైన సందర్భం చోటు చేసుకోనుంది. ఇందుకు కారణం మిస్ వరల్డ్ పోటీలకు భాగ్యనగరం వేదిక కావటమే. ఈ అంతర్జాతీయ పోటీలతో ప్రపంచ పర్యాటకంలో హైదరాబాద్ కు ఒక ఇమేజ్ తీసుకొచ్చే అరుదైన అవకాశంగా చెప్పాలి. ఇప్పుడు ప్రపంచ మీడియా సైతం దాదాపు మూడు వారాల పాటు హైదరాబాద్ లో ఉండనున్నారు.
ప్రధాన పోటీని కవర్ చేయటంతో పాటు.. మిగిలిన సందర్భాల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్ని కవర్ చేసే వీలు ఉండటంతో.. విశ్వ నగర ఇమేజ్ ను సొంతం చేసుకునే వీలు కలుగుతుందని చెప్పాలి. మే ఏడో తేదీ నుంచి 31 వరకు హైదరాబాద్ వేదికగా జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వందలాది దేశాల నుంచి సుందరీమణులు మాత్రమే కాదు.. ఈ ఈవెంట్ ను కవర్ చేయటానికి భారీగా మీడియా ప్రతినిధులు రానున్నారు. ఒక అంచనా ప్రకారం దాదాపు 3 వేల మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు హైదరాబాద్ కు వస్తున్నారు. కేవలం పోటీల వివరాలే కాకుండా పోటీలకు అతిథ్యమిస్తున్న నగర విశేషాల్ని కూడా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.
ఇక్కడి చరిత్ర.. కల్చర్.. ఐటీలో హైదరాబాద్ పురోగతితో పాటు స్థానికంగా ఉన్న మౌలిక సదుపాయాలు.. ఇతర వివరాల్ని ప్రచారం చేసే వీలు కలుగుతుంది. దీంతో.. ప్రపంచ పర్యాటకంలో హైదరాబాద్ మీద ఆసక్తి పెరిగే వీలుంది. ఈ పోటీలకు సంబంధించి జడ్జిలుగా వచ్చే వైద్యులు.. క్రీడాకారులు.. ఇంజనీర్లు.. న్యాయవాదులు.. సామాజిక కార్యకర్తలు.. పారిశ్రామికవేత్తలకు సంబంధించి వివిధ నేపథ్యాలకు సంబంధించిన 140 మంది కూడా హైదరాబాద్ కు రానున్నారు.
వీరు సైతం హైదరాబాద్ ప్రత్యేకతను విశ్వవ్యాప్తం చేసే వీలుంది. మొత్తంగా ఈ ఈవెంట్ పుణ్యమా అని దాదాపు మూడు వారాల పాటు హైదరాబాద్ మహానగరంలో సందడి వాతావరణం నెలకొంది. కాకుంటే.. వాతావరణ పరిస్థితులు (తీవ్రమైన వేసవి) అతిధులను ఎంత ఇబ్బందికి గురి చేస్తాయన్నది తప్పించి.. మిగిలిన అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయం ఉంది. ప్రపంచ సుందరి పోటీలకు వేదికగా హైదరాబాద్ కానున్న వేళ.. తెలంగాణ కల్చర్ ను ప్రతిబింబించేలా కల్చరల్ యాక్టివిటీస్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. మరి.. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.