మన రైల్వే ఛార్జీలు పాక్.. బంగ్లాదేశ్ కంటే తక్కువా?

350 కిలోమీటర్ల ప్రయాణానికి మన దేశంలో ట్రైన్ టికెట్ రూ.121 కాగా.. పాకిస్థాన్ లో అయితే రూ.436 వసూలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.;

Update: 2025-03-19 08:00 GMT

ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. గడిచిన ఐదేళ్లుగా రైల్వే టికెట్ ఛార్జీల్ని పెంచలేదన్న ఆయన మరో విస్మయానికి గురి చేసే సమాచారాన్ని చెప్పుకొచ్చారు. మన దేశంలో వసూలు చేసే రైల్వే టికెట్ ఛార్జీల కంటే కూడా దాయాది పాకిస్థాన్.. పొరుగున ఉండే బంగ్లాదేశ్ కంటే చౌకగా పేర్కొన్నారు. రైల్వే పద్దులపై లోక్ సభలో జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు.

350 కిలోమీటర్ల ప్రయాణానికి మన దేశంలో ట్రైన్ టికెట్ రూ.121 కాగా.. పాకిస్థాన్ లో అయితే రూ.436 వసూలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అదే బంగ్లాదేశ్ లో అయితే రూ.323.. శ్రీలంకలో రూ.413 ఉంటుందని చెప్పారు. రైల్వే మంత్రి వెల్లడించిన సమాచారం చూసినప్పుడు ప్రపంచంలో అతి తక్కువ రైల్వే టికెట్ ధరలు మన దేశంలోనే ఉన్నట్లుగా అర్థమవుతుంది.

ఇక.. రైల్వే ప్రమాదాలు గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గినట్లుగా చెప్పిన రైల్వే మంత్రి.. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ప్రమాదాలతో పోలిస్తే 90 శాతం తగ్గాయన్నారు. మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఏడాదిలో 165 రైలుప్రమాదాలు.. 230 రైళ్లు పట్టాలు తప్పిన ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. మల్లికార్జున ఖర్గే హయాంలో ఒక్క ఏడాదిలో 381 ప్రమాద ఘటనలు నమోదైనట్లుగా సభకు తెలియజేశారు.

ప్రస్తుతం రైళ్లు ఎదురెదురుగా ఢీ కొనే అవకాశం లేకుండా చేసే కవచ్ టెక్నాలజీని పదివేల రైల్ ఇంజిన్లకు అమర్చినట్లుగా పేర్కొన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట లాంటి ఘటనల నిరోధానికి బలమైన చర్యలు తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.

Tags:    

Similar News