బాబు ఈజ్ బ్యాక్: గెలుపు క్రేజ్ ఇలానే ఉంటుంది మరి!

కొన్ని సందర్భాల్లో చాలా చిన్న మాటల్లోనే చాలా ఎక్కువ చెప్పేయొచ్చు. అలానే.. పెరిగిన ప్రాధాన్యత.. మారిన ఇమేజ్ గురించి తెలుసుకోవటానికి ఎక్కువ ప్రయాస పడాల్సిన అవసరం ఉండదు.

Update: 2024-06-06 04:08 GMT

కొన్ని సందర్భాల్లో చాలా చిన్న మాటల్లోనే చాలా ఎక్కువ చెప్పేయొచ్చు. అలానే.. పెరిగిన ప్రాధాన్యత.. మారిన ఇమేజ్ గురించి తెలుసుకోవటానికి ఎక్కువ ప్రయాస పడాల్సిన అవసరం ఉండదు. జస్ట్.. చిన్న పరిణామం సైతం అసలు విషయాన్ని ఇట్టే చెప్పేస్తుంది. కలలో కూడా ఊహించని గెలుపును సొంతం చేసుకున్న చంద్రబాబు నాయుడుకు ఇంటా.. బయటా ఇప్పుడు తెగ పొగిడేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పట్టని ఆయనకు ఇప్పుడు రాచ మర్యాదలు చేస్తున్నారు. రెగ్యులర్ గా కలిసే వారు సైతం చంద్రబాబును ఇస్పెషల్ గా చూస్తున్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు మనసుకు అనిపించేదొక్కటే.. ‘గెలుపు క్రేజ్ ఇలానే ఉంటుంది’. ఓటమి వేళ ఇంట్లోవాడు కూడా పట్టించుకోడు. అదే విజయం సాధిస్తే.. పరిచయం లేనోడు సైతం పలుకరించి మాట్లాడతాడు. గెలుపుకున్న స్థాయి అలాంటిది.


చంద్రబాబుకు ఢిల్లీ జర్నలిస్టులు కొత్తేం కాదు. ఆ మాటకు వస్తే.. కొద్ది నెలల క్రితం ఆయన ప్రెస్ మీట్ పెడితే వచ్చే రియాక్షన్ ఎంతన్నది అందరికి తెలిసిన విషయమే. అప్పటి ప్రాధాన్యం అలాంటిది.మరి.. ఇప్పుడు? 175 స్థానాల్లో సొంతంగా 135 స్థానాల్ని గెలుచుకోగా.. కూటమి మొత్తం కలిసి 164 స్థానాల్లో విజయం కేతనం ఎగురవేయటం ఒక ఎత్తు అయితే.. జాతీయ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా మారిన వైనం మరింత ఆసక్తికరం.

అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు అద్బుతమైన విజయాన్ని కట్టబెట్టిన వేళ.. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో బాబుకు బోనస్ లాంటి మర్యాదలు ఇప్పుడు దక్కుతున్నాయి. కేంద్రంలో ప్రభుత్వం కొలువు తీరాలంటే బాబు దగ్గర ఉన్న పదహారు సీట్లు చాలా అవసరం. మిత్రపక్షమైన జనసేనతో కలిపితే ఆయన దగ్గర ఉన్న ఎంపీలు మొత్తం 18 మంది. ఈ కారణంగానే ఢిల్లీలో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగింది. ఈ కారణంతోనే.. ఎన్డీయే భాగస్వామ్య పక్ష సమావేశానికి ఢిల్లీకి వచ్చిన ఆయనకు మోడీ దగ్గరే కాదు.. ఢిల్లీ జర్నలిస్టులు సైతం ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీలో కింగ్ గా.. జాతీయ స్థాయిలో కింగ్ మేకర్ గా మారిన బాబుతో కలిసి సెల్ఫీ దిగేందుకు ఢిల్లీ మహిళా జర్నలిస్టులు ఆసక్తిని చూపారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ‘పిక్ ఆఫ్ ద డే’గా నిలిచింది. ఈ ఫోటోను చూసిన కొందరు మాత్రం.. బాబు ఈజ్ బ్యాక్ అనేస్తున్నారు. ఆ మాటా నిజమే కదా!

Tags:    

Similar News