ఇటు బాబు.. అటు జగను.. మైండ్ బ్లాంక్ అయ్యే విషయం ఇదే!
చంద్రబాబును ఓడిస్తానని జగన్ అంటే.. పులివెందులలో పాగా వేస్తామని చంద్రబాబు చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఒకవైపు, వైసీపీ అధినేత జగన్ మరోవైపు.. ఒకే రోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. వాస్తవానికి చంద్రబాబు ఎప్పటి నుంచో రా..కదలిరా! సభలు నిర్వహిస్తున్నారు. అయితే.. వైసీపీ అధినేత, సీఎం జగన్ మాత్రం శనివారమే బయటకు వచ్చారు. విశాఖలో నిర్వహించిన.. సిద్ధం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఇటు.. చంద్రబాబు కూడా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరులో రా..కదలిరా! సభను నిర్వహించారు. ఇరు పక్షాలూ కూడా.. ఒకరిపై ఒకరు రెచ్చిపోయి మరీ విమర్శలు చేసుకున్నాయి. చంద్రబాబును ఓడిస్తానని జగన్ అంటే.. పులివెందులలో పాగా వేస్తామని చంద్రబాబు చెప్పారు.
సీమ రక్తం తనలో ఉందని.. చంద్రబాబు చెబితే.. ఎలాంటి పద్మవ్యూహాన్నయినా ఛేదించుకుని 175 సీట్లకు 175 సీట్లు దక్కించు కుని.. మళ్లీ అధికారంలోకి వస్తామని జగన చెప్పారు. ఇక, విమర్శలు, ప్రతివిమర్శలు కూడా కామన్ కంటే ఎక్స్‌ట్రార్డినరీ అన్న ట్టుగా సాగాయి. రాష్ట్రంలో వైసీపీ జెండా లేకుండా పీకేద్దామని చంద్రబాబు అంటే.. చంద్రబాబును సైతం ఓడించేద్దామని జగన్ పిలుపునిచ్చారు. అభివృద్ధిపైనా ఇద్దరునాయకులు పరస్పరం నిప్పులు చెరుగుకున్నారు. అసలు రాష్ట్రంలో అభివృద్ధి లేదని చంద్రబాబు విమర్శలు గుప్పిస్తే.. చంద్రబాబు హయాంలో మచ్చుకు కూడా అభివృద్ది లేదని జగన్ దుయ్యబట్టారు.
ఇలా మొత్తంగా ఈ రెండు పార్టీల నాయకులు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు.ఇక్కడ మైం డ్ బ్లాంక్ అయ్యే విషయం ఏంటంటే.. విమర్శలు, ప్రతివిమర్శలు, రాజకీయ సణుగుళ్లు కామనే అయినా.. ఇరువురి సభలోనూ ఇసకేస్తే రాలనంతగా జనాలు వచ్చేశారు. చంద్రబాబు చేపట్టి రా.. కదలిరా! సభలో ఎటు చూసినా.. జనాలే కనిపించారు. అసలు ఇంత మంది వస్తారని ఊహించలేదని తమ్ముళ్లు బహిరంగ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సైతం రెట్టించిన ఉత్సాహంతో వ్యవహరించారు. కనీవినీ ఎరుగని రీతిలో రా..కదలిరా! సభలకు జనాలు వస్తున్నారంటే.. జగన్ పతనం ప్రారంభమైందన్నమాటే అని చంద్రబాబు అన్నారు.
ఇటు జగన్ నిర్వహించిన సిద్ధం సభకు.. హాజరైన వారిని చూసేందుకు రెండు కళ్లూ చాలలేదని పరిశీలకులు సైతం చెప్పారు. 3 లక్షల మంది వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేసినా.. అంతకుమించి జనాలురావడంతో 14 ఎకరాల స్థలం పూర్తిగా నిండిపో యింది. దీంతో జగన్‌లోనూ కొత్త ఉత్సాహం కనిపించింది. కట్ చేస్తే.. అటు టీడీపీ సభకు, ఇటు వైసీపీ సభకు భారీ ఎత్తున జనాలు హాజరవడంతో అసలు జనం మదిలో ఏముందనేది పట్టుకోవడం ఎవరికీ అంతుచిక్కడం లేదు. అంతేకాదు.. చంద్రబాబు సభలో జగన్‌పై విమర్శలు చేస్తున్నప్పుడు చప్పట్టు, ఈలలతో మోతమోగిపోయింది. ఇక, సిద్ధం సభలోనూ ఇదే కనిపించింది. ఇదీ..సంగతి!!