సవివరంగా వివరణ ఇచ్చిన ఆర్జీవీ... చివర్లో తనదైన శైలిలో కన్ క్లూజన్!

ఈ సందర్భంగా తనదైన వ్యంగ్యంతో.. తనదైన స్పష్టతతో, సవివరంగా సుమారు 26 పాయింట్లతో ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు.

Update: 2024-11-28 14:10 GMT

గత కొన్ని రోజులుగా "రామ్ గోపాల్ వర్మ - ఏపీ పోలీస్" అనే వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పోలీసులు ఆర్జీవీ కోసం బృందాలుగా ఏర్పడ్డారని.. చెన్నై, ముంబై, కోయంబత్తూర్ మొదలైన చోట్ల వెతుకుతున్నారని కథనాలు హల్ చల్ చేస్తున్న సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను తన డెన్ లో ఉన్నానంటూ ఆర్జీవీ స్పందించారు.

అవును... గత కొన్ని రోజులుగా తన పేరు మీద మీడియాలో హడావిడి జరుగుతుందంటూ అర్జీవీ స్పందించారు. ఈ సందర్భంగా తనదైన వ్యంగ్యంతో.. తనదైన స్పష్టతతో, సవివరంగా సుమారు 26 పాయింట్లతో ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. "రామ్ గోపాల్ వర్మ - ఏపీ పోలీస్" అనే వ్యవహారం వెనుక తన వెర్షన్ ను సవివరంగా వివరించే ప్రయత్నం చేశారు.

1. “తానేదో పరారీలో ఉన్నానని.. ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాల్లో పోలీసులు తన కోసం వెఉతున్నారని ఆనందిస్తున్న వాళ్లందరికీ ఒక బ్యాడ్ న్యూస్” అంటు మొదలుపెట్టిన ఆర్జీవీ... అప్పుడప్పుడు తన సినిమా పనుల కోసం బయటకు వెళ్లడం తప్ప ఈ టైమ్ అంతా తాను తన డెన్ ఆఫీసులోనే ఉన్నట్లు తెలిపారు.

2. ఇంకో షాక్ ఏంటంటే అంటూ మరో పాయింట్ మొదలుపెట్టిన ఆయన... పోలీసులు ఇంతవరకూ తన ఆఫీసులో కాలే పెట్టలేదని.. తనను అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు తన మనుషులతో కానీ, మీడియాతో కానీ చెప్పలేదని అంటూ... ఒక వేళ తనను అరెస్ట్ చేయడానికి వస్తే తన ఆఫీసులోకి ఎందుకు రారంటూ ఎదురు ప్రశ్నించారు.

3. ఒక ఏడాది క్రితం తాను సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని మీమ్స్.. ఇప్పుడు సడన్ గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతినటం మూలాన ఆ కంప్లయింట్ ఇచ్చారంట.. అది తనపై ఉన్న కేసు అని తెలిపారు.

4. ఏపీలో నాలుగురు వ్యక్తులు, నాలుగు జిల్లాల్లో తనపై ఈ కేసు పెట్టారని.. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదయ్యాయని.. మొత్తం మీద 9 కేసులు ఉన్నాయని.. ఇవన్నీ కూడా గత నాలుగైదు రోజుల్లోనే నమోదు అయ్యాయని వర్మ వెల్లడించారు.

5. తనకు నోటీసు అందిన వెంటనే సినిమా పనుల వల్ల సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగిందని.. ఆయన కూడా అనుమతించడం జరిగిందని వర్మ తెలిపారు. కానీ.. పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైమ్ అడగడం జరిగిందని.. లేకపోతే, వీడియో ద్వారా హాజరు అవుతానని తెలియజేసినట్లు తెలిపారు.

అదే టైమ్ లో తనపై వరుసగా అన్ని ప్రదేశాల్లోనూ కేసులు నమోదు అవ్వడం ఏదో కుట్ర అని తనకు, తన వాళ్లకు అనుమానం కలిగిందని పేర్కొన్నారు.

6. తాను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటానని.. చాలా సార్లు రోజుకు 10 నుంచి 15 పోస్టులు పెడతానని.. ఒక ఏడాది కాలంలో కొన్ని వేల పోస్టులు చేసి ఉంటానని తెలిపారు. తాను తీసిన ఓ రాజకీయ వ్యంగ చిత్రం గురించి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం, ఆ సినిమా విడుదలవ్వడం చాలా నెలల క్రితం జరిగిందని తెలిపారు.

7. తాను పెట్టాను అంటున్న పోస్టులు వేటి వల్ల అయితే నేను పెట్టాను అంటున్న పోస్టులు.. కొందరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాలలో తమ మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటున్నారో అవి ఈ నోట్ క్రింద పెట్టడం జరిగిందని అన్నారు.

8. ఈ మీమ్స్ కారణంగా తన మీద 336 (4) 353 (2), 356 (2), 61 (2), 196, 352 ఆఫ్ బీ.ఎన్.ఎస్. తో పాటు సెక్షన్ 67 ఐటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయబడ్డాయని అన్నారు.

9. బీ.ఎన్.ఎస్. 336(4): అనేక పత్రాలను కానీ ఎలక్ట్రానిక్ రికార్డును కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం.. అని వివరించిన ఆర్జీవీ.. తాను చేసిన పోస్టులను చూస్తే అందులో ఫోర్జరీ ఎక్కడుంది? అని ప్రశ్నించారు.

అది కేవలం ఒక కార్టూన్, ఒకవేళ దీని వల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరి కొన్ని లక్షల మంది ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటి? అని అడిగారు.

10. బీ.ఎన్.ఎస్. 353(2): తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా లేదా ప్రకటన నివేదికను రూపొందించే భాష లేదా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా.. మతం ప్రాతిపదికన ప్రచురించబడిన లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం, నివాసం, కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం, వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాల వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం. అని వివరిస్తూ.. తన కేసు విషయంలో ఇది ఎలా వర్తిస్తుందో తనకు అర్థం కావడం లేదని అన్నారు.

11. బీ.ఎన్.ఎస్. 356 (1): ఎవరైనా మాటల ద్వారా గానీ, రాతల ద్వారా గానీ, సంకేతాల ద్వారా గానీ, చిహ్నాల ద్వారా గానీ ఒకరి పరువుకు నష్టం కలిగించడం. అని చెప్పిన వర్మ.. వీటితో పరువు నష్టం దావలేస్తే రోజుకి లక్ష కేసులవుతాయని అన్న్నారు!

12. బీ.ఎన్.ఎస్. 61(2): ఒక చట్ట విరుద్ధమైన పని చేయడం కోసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే ఒప్పందం. మోసపూరిత విధానంలో చద్దబద్దమైన ఫలితం పొందడం. అని చెబుతూ... దీని లింక్ తన కేసుకు ఏమిటి అని ప్రశ్నించారు!

13. బీ.ఎన్.ఎస్. 196: సమూహాల మధ్య మతం, ప్రాంతం, జన్మ స్థలం, నివాస ప్రదేశం మొదలైన వాటి ప్రాతిపదికన విద్వేషం సృష్టించడం, శాంతికి భంగం కలిగేలా చేయడం. అని చెబుతూ క్వశ్చన్ మార్కు వేసి వదిలారు!

14. సెక్షన్ 67 ఐటీ చట్టం: ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించబడిన లేదా ప్రసారం చేసిన లేదా ప్రసారం చేయడానికి లేదా ప్రసారం చేయడానికి కారణమయ్యే ఎవరైనా, కామాంతమైన లేదా ప్రేక్షక ఆసక్తిని ఆకర్షించడం సెక్షన్ 67. అని చెప్పిన ఆర్జీవీ... కేవలం అసభ్యకర విషయాలను సృష్టించిన లేదా వ్యాప్తి చేసిన నేరం.. ఒక వ్యంగ్య చిత్రంలో అసభ్యకరం ఏముంటుంది? అని ప్రశ్నించారు.

15. తన సోషల్ మీడియా అకౌంట్‌ లో పోస్ట్ చేయబడింది అని చెప్పబడుతున్న విషయం భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)ఏ ప్రకారం న్యాయబద్దమైనదని.. దీని ప్రకారం ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను, ఆలోచనలను స్వేచ్చగా తెలియజేయవచ్చుని.. ఇది కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు, రాతల ద్వారా, చిత్రాల ద్వారా, సినిమాల ద్వారా, పోస్టర్ల ద్వారా కూడా అవ్వచ్చని చెప్పుకొచ్చారు ఆర్జీవీ!

16. ప్రతి ప్రజాస్వామ్య సమాజంలో మూలస్తంభం వాక్ స్వాతంత్రం.. దాని ప్రథమ లక్షణం, ఒక వ్యక్తి తన దగ్గరున్న ఓపెన్ గా మాట్లాడగలగడం.. అదే విధంగా ఇతరుల నుండీ ఏ విధంగానైనా వచ్చే వాటిని స్వీకరించడం.. ఇది స్వేచ్చ యొక్క ప్రధాన హక్కు, ఈ హక్కును నిర్మూలించడం లేదా హద్దులు నిర్ణయించడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం అని పేర్కొన్నారు.

17. ఈ మీమ్ అనే భావప్రకటన ప్రస్తుత సమాజంలో తమ ఆలోచనలను, భావాలను, ఉద్దేశాలను, శైలిని, ప్రవర్తనలు వ్యక్తపరిచే ఎఫెక్టివ్ సాధకం.. విస్తృతంగా వ్యాపిస్తూ పరిణామం చెందే లక్షణం వల్ల ఈ మీమ్స్ డిజిటల్ కల్చర్ లో ముఖ్య భాగం అయ్యిందని అన్నారు. మీమ్స్ అనేవి ఇమేజ్, వీడియో లేదా వాక్యము, మొదలైన రూపంలో ఉండే హాస్యభరితమైన మెసేజ్ మాత్రమేనని వర్మ తెలిపారు.

18. మనం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నామని.. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే.. సినిమా మనుషులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం అందరూ ప్రతి రోజు ఈ సోషల్ మీడియాలో తమ ఉద్దేశాలను రుద్దుతూ, జోక్స్ వేసుకుంటూ, అరుచుకుంటూ, బూతులు తిట్టుకుంటూ, బోధనలు చేస్తారని.. ఇప్పుడు వీటిని సీరియస్ గా తీసుకుంటే దేశంలో సగం మంది పైన కేసు పెట్టాలని అభిప్రాయపడ్డారు.

19. ప్రస్తుతం తన కేసు గురించి మాట్లాడితే.. తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల తాను పోలీసుల ముందు హాజరు కావటానికి ఇంకొంత సమయం కావాలని.. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనటానికి అనుమతి కావాలని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ పంపిన 30 నిమిషాలలో పోలీసులు తన ఆఫీసుకు వచ్చారని తెలిపారు.

కానీ వాళ్ళు తన ఆఫీసు లోపలకి రాలేదని.. తనను అరెస్టు చేయటానికి వచ్చాం అని కూడా చెప్పలేదని అన్నారు.

20. ఇప్పుడూ మీడియాలో వస్తున్న కథనాలు... తనను పట్టుకోవడానికి పోలీసులు టీమ్స్ ఏర్పరిచారని.. వాళ్ళు ముంబై, చెన్నై ఇంకా పలు చోట్ల వెతుకుతున్నారని.. తాను పరారీలో ఉన్నాను అని చెప్పేవన్నీ అబద్ధాలని వర్మ తెలిపారు. కానీ ఈ మీడియా ప్రతీసారి లాగే హై డ్రామా క్రియేట్ చేసిందని అన్నారు.

21. తాను, తన మొబైల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేయటానికి ప్రధాన కారణం.. లెక్కలేనన్ని మీడియా కాల్స్, ఇంకా పరామర్శ కాల్స్ అని.. ఇవన్నీ తన పనిని డిస్టర్బ్ చేస్తాయని.. అందువల్ల ఇప్పటి వరకు తాను రిక్వెస్ట్ చేసిన అడిషనల్ టైమ్ కి తనకు ఆఫీసర్ల నుండి ఎటువంటి సమాధానం రాలేదని వర్మ తెలిపారు.

తన మీద ఒకేసారి వివిధ కేసులు నమోదవటం అనేది ఏదో కుట్ర జరుగుతుందనిపించిందని.. అందుకే తాను ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశానని అన్నారు. అయితే... తాను ఒక వ్యక్తీనీ లేక ఒక గ్రూప్ నీ నిందించటం లేదు కానీ వాస్తవాలు తెలియకుండా వెనుక ఏదో జరుగుతుందని అర్థం అవుతోందని అన్నారు!

22. తాను చట్టాన్ని గౌరవిస్తానని.. అదేవిధంగా ప్రభుత్వ సంస్థల నిబంధనలను కచ్చితంగా పాటిస్తానని చెప్పిన ఆర్జీవీ... దానితో పాటు రాజ్యాంగ ప్రకారం నాకు చట్టం కల్పించిన సౌకర్యాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కు కూడా వినియోగించుకుంటానని వెల్లడించారు.

ఎప్పటిలాగే మీడియా సొంతంగా ఒక కథ రాసుకుని అందులో తనను సెంట్రల్ క్యారెక్టర్ గా చేసి ఒక సినిమా తీసిందని చెబుతూ... తనకు కూడా వాళ్ళకున్న టాలెంట్ ఉండి ఉంటే ఎంత బాగుండేదో? అంటూ తనదైన శైలిలో కన్ క్లూజన్ ఇచ్చారు!

Tags:    

Similar News