ఈ సాలా.. ఐపీఎల్ కు ముందే వివాదం.. ఆ జట్టుకు సెగ
ఇక కొత్త సీజన్ పై ఆశగా అడుగులేస్తున్న సమయంలో.. ఓ అనుకోని వివాదం ఫ్రాంచైజీని చుట్టుముట్టింది.
ఇప్పటివరకు 17 సీజన్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక్కసారీ కప్ కొట్టలేదు ఆ జట్టు.. అయినా ఇన్నేళ్లుగా అభిమానుల ప్రేమ కొంత కూడా తగ్గలేదు. ప్రతిసారి ‘ఈ సాలా కప్ నమదే’ (ఈ ఏడాది కప్ మనదే) అంటూ ఆశగా బరిలో దిగడం.. ఆ తర్వాత ఓటమితో నిరాశ చెందడం.. ఇలా జరిగిపోతోంది. ఇక కొత్త సీజన్ పై ఆశగా అడుగులేస్తున్న సమయంలో.. ఓ అనుకోని వివాదం ఫ్రాంచైజీని చుట్టుముట్టింది.
కెప్టెన్ ఎవరో?
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు (ఆర్సీబీ).. ఐపీఎల్ లో ఓ రికార్డు ఉంది. టీమ్ ఇండియా దిగ్గజం విరాట్ కోహ్లి తన కెరీర్ మొదటినుంచి (ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి) ఇదే జట్టుకు ఆడుతున్నాడు. అంతేకాదు.. మహామహులు ఆడినప్పటికీ ఇంతవరకు టైటిల్ కొట్టని జట్టు బెంగళూరే. ఇప్పుడు మరోసారి కప్ వేటకు బయల్దేరింది. ఇటీవలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో కొందరు మేటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ ను రిటైన్ చేసుకోలేదు కాబట్టి కొత్త కెప్టెన్ గా ఎవరిని నియమిస్తుందో చూడాలి. ఇంతలోనే ఆర్సీబీ ఫ్రాంచైజీకి అనుకోని పరిణామం ఎదురైంది.
సిరాజ్ ను వదిలి.. 19 మందిని కొని..
ఆర్సీబీకి మొదటినుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్. ఇక్కడినుంచే టీమ్ ఇండియా స్థాయికి ఎదిగాడు అతడు. అయితే, ఆర్సీబీ అతడిని రిటైన్ చేసుకోలేదు. మెగా వేలంలో ఆర్సీబీ 19 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అంటే వచ్చే సీజన్ కు దాదాపు కొత్త జట్టుతో బరిలో దిగనుంది. వీరిలో ఒకడు ఇంగ్లండ్ విధ్వంసక ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్. ఇతడికి సంబంధించిన ఏఐ వీడియోను ఆర్సీబీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. లివింగ్ స్టోన్ హిందీలో అభిమానులను పలకరించాడు. ఇప్పుడిదే దుమారానికి కారణమైంది.
హిందీ దుమారం..
ఆర్సీబీ ‘ఎక్స్’ ఖాతా హిందీలో ఉంది. అసలే సొంత భాషకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే కన్నడిగులు దీనిపై ఆగ్రహంగా ఉన్నారు. గత నెలలో మొదలైన ఈ ఖాతాలో ఐదు ట్వీట్లే ఉన్నాయి. అయితే, 25 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఖాతా హిందీలో ఉండడంతో కన్నడ భాషా సంఘాల వారు, కన్నడ అభిమానులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కన్నడపై హిందీని రుద్దుతున్నారా? అంటూ మండిపడుతున్నారు. ఆర్సీబీ యాజమాన్యం తమ నిర్ణయాన్ని పున: పరిశీలించాలని కోరుతున్నారు.