బాబు ఈసారి మాజీ ఎమ్మెల్యే అవుతారు...జగన్ జోస్యం...!

విశాఖ జిల్లా భీమిలీలో సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ ఈసారి కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోతున్నారు అని భవిష్యత్తు చెప్పేశారు.

Update: 2024-01-27 17:30 GMT

గత సారి ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు అయినా వచ్చాయి. ఈసారి ఆ నంబర్ కూడా రాదంటే రాదు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జోస్యం చెప్పారు. విశాఖ జిల్లా భీమిలీలో సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ ఈసారి కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోతున్నారు అని భవిష్యత్తు చెప్పేశారు. బాబు మాజీ ఎమ్మెల్యే అని సిద్ధం సభ సాక్షిగా జగన్ డిక్లేర్ చేసేశారు.

కేవలం బాబు మాత్రమే కాదు విపక్షాలు అన్నీ ఈసారి కలసికట్టుగా ఓటమిని చవిచూడబోతున్నాయని అన్నారు. కేవలం డెబ్బై రోజులు మాత్రమే ఎన్నీకలు సమయం ఉందని ఆయన గుర్తు చేస్తూ ఎన్నికల్లో జరగబోయేది ఇదే అన్నారు. తాను ప్రతిపక్షాలు పద్మవ్యూహం పన్నినా ఎదుర్కొంటాను అన్నారు. తాను అభిమన్యుడు అని ఎవరైనా అనుకుంటే పొరపాటే అన్నారు.

తాను అర్జునుడిని అని జగన్ గర్జించారు. విపక్షాల వ్యూహాలు కుట్రలను చేదించి మరీ తాను మళ్ళీ ప్రభుత్వాన్ని అద్భుతమైన మెజారిటీతో ఏర్పాటు చేస్తాను అని జగన్ ధీమా వ్యక్తం చేశారు. రేపు జరబోయే యుద్ధంలో పాండవుల పాత్రలో వైసీపీ ఉందని, తాను అర్జునుడు అయితే తన తో పాటు ఉండేది శ్రీకృష్ణుడి పాత్రలో ప్రజలు అని జగన్ అన్నారు.

అబధాలు అన్యాయాలు కుట్రలు చేసే వారు ఈ ఎన్నికల్లో కూలిపోతారని, ధర్మానికే విజయం అని జగన్ అన్నారు. మంచి పనులు చేసిన వారికే జనాల అండదండలు ఉంటాయని ఆయన గత చరిత్రను గుర్తు చేశారు. ఏపీ ప్రజలు మరోసారి వైసీపీనే గెలిపించబోతున్నారు అని ఆయన క్యాడర్ కి శుభ సందేశం వినిపించారు.

తనకు ప్రజల మద్దతు ఉందని అందుకే తాను అదిరేది బెదిరేది లేదని జగన్ స్పష్టం చేశారు. తాను నమ్ముకున్న ప్రజలే వైసీపీని తెచ్చి మళ్లీ అధికారంలో కూర్చోబెడతారు అని జగన్ అన్నారు. చంద్రబాబుకు తెలుసు ఒంటరిగా వస్తే గెలవలేమని అందుకే పొత్తుల కోసం ఆయన పాకులాడుతున్నారని జగన్ సెటైర్లు వేశారు.

మూడు సార్లు అధికారంలో కూర్చోబెడితే తాను చేసిన మంచి ఏమిటో చెప్పలేని స్థితిలో బాబు ఉన్నారని జగన్ ఫైర్ అయ్యారు. తాను చేసిన మేలును చూపించి ఓట్లు అడిగే హక్కు వైసీపీకే ఉందని ఆయన అన్నారు. అందుకే తనకు ధీమా ఉందని చెప్పారు.

ఏం చేశామని చెప్పి టీడీపీ ఓట్లు అడుగుతుందని జగన్ మండిపడ్డారు. చంద్రబాబుకు ఓట్లు అసలు ఎందుకు వేయాలని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును ఆయన పార్టీ టీడీపీని పెత్తందార్ల పార్టీగా జగన్ అభివర్ణించారు. ప్రజలు అంతా మనతోనే ఉన్నారు. మీరంతా వారి వద్దకు వెళ్ళి వైసీపీ పాలన గురించి మళ్లీ మళ్ళీ చెప్పండి, వై నాట్ 175 అన్న వైసీపీ నినాదాన్ని నిజం చేయాలని జగన్ పిలుపు ఇచ్చారు.

చంద్రబాబు ఓటమి ఖాయమని భీమిలీ సభలో జగన్ ప్రకటించడం ఇపుడు చర్చనీయాంశం అయింది. విపక్షాలు అన్నీ ఓడబోతున్నాయన్న జగన్ ధీమా మాత్రం విపక్షాలను ఆలోచనలో పడేసేలా ఉంది అని అంటున్నారు. తాను అర్జునుడిని అంటూ జగన్ గర్జించిన తీరుతో సిద్ధం సభ సమర శంఖారావం చేసింది.


Tags:    

Similar News