భారత విద్యార్థులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన కెనడా

తాజాగా ప్రకటించిన నిర్ణయం కెనడాకు వెళ్లాలనుకునే విదేశీయులకు నిరాశకు గురి చేయనుంది.

Update: 2024-09-19 14:30 GMT

ఇటీవల కాలంలో కెనడా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచంలోని పలు దేశాలకు నిరాశను కలిగిస్తున్నాయి. విద్యా.. ఉపాధి అవకాశాల కోసం కెనడా వైపు చూసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న ఆ దేశం.. తాజాగా మరో నిర్ణయాన్ని తీసుకుంది. తమ దేశంలో తాత్కాలిక నివాసితుల సంఖ్యను తగ్గించేందుకు సిద్ధమైంది. విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు.. వర్కర్లకు పని అనుమతులపై మరిన్ని ఆంక్షలు తీసుకురానున్నట్లుగా పేర్కొంది. తాజాగా ప్రకటించిన నిర్ణయం కెనడాకు వెళ్లాలనుకునే విదేశీయులకు నిరాశకు గురి చేయనుంది.

ఇంతకూ ఈ తరహా నిర్ణయాలు ఆ దేశం ఎందుకు తీసుకుంటున్నట్లు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంతో పాటు.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో మీద ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతతో.. దాన్ని తగ్గించుకోవటానికి విదేశీయుల విషయంలో పరిమితులు పెట్టాలన్నట్లుగా ఆయన ప్రభుత్వ తీరుంది. వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో చేపట్టిన సర్వేల్లో ట్రూడో నేత్రత్వంలోని లిబరల్ ప్రభుత్వం వెనుకంజలో ఉంది. వలసల కారణంగా నిరుద్యోగం పెరిగిందంటూ స్థానికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి.

విదేశీ విద్యార్థులతో తమ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనమే అయినప్పటికీ కొందరు చెడు శక్తులు తమ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కారణంగా తాము నియంత్రించక తప్పట్లేదన్నారు. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ఇళ్ల కొరత.. నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టటం కోసమే ట్రుడో సర్కారు ఈ తరహా నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా సమాచారం.

ఇమ్మిగ్రేషన్ గణాంకాల ప్రకారం 2023లో 5.09 లక్షల మంది విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు జారీ చేశారు. ఈ ఏడాది మొదటి 7 నెలల్లో 1.75 లక్షల మందికి పర్మిట్లు జారీ చేశారు. విదేశీ వర్కుర్లు.. విద్యార్థుల భాగస్వాములకు పని అనుమతులు ఇచ్చే విషయంపై పరిమితులు విధించనున్నట్లుగా ట్రూడో సర్కారు వెల్లడించింది. కెనడాలో ఇళ్ల కొరత అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దీంతో దిద్దుబాటు చర్యలను చేపట్టిన ట్రూడో సర్కారు..వలసలను తగ్గించే పనిలో పడింది.

వలసలకు సంబంధించిన అంచనాల ప్రకారం చూస్తే.. గడిచిన రెండేళ్లలో కెనడాలో తాత్కాలిక నివాసితుల సంఖ్య రెట్టింపు అయినట్లుగా చెబుతున్నారు. 2022లో వీరి సంఖ్య 14 లక్షలు ఉంటే.. 2024 నాటికి అది కాస్తా 28 లక్షలకు చేరుకుంది. దీంతో.. దేశ జనాభాలో తాత్కాలిక నివాసితుల సంఖ్యను 5 శాతానికి పరిమితం చేయనున్నట్లు కెనడా వెల్లడించింది. తాజా నిర్ణయం భారత విద్యార్థులకు ఆశనిపాతంగా మారనుంది. ఎందుకుంటే.. కెనడాలో చదువుకోవటానికి వెళ్లే విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే.

2022లో ఆ దేశం జారీ చేసిన విదేశీ పర్మిట్లలో 41 శాతం భారతీయులే కావటం గమనార్హం. భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూసినా.. కెనడాలో భారత విద్యార్థుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటుందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ప్రస్తుతం విదేశాల్లో చదివే విద్యార్థుల సంఖ్య 13.35 లక్షలు కాగా.. ఒక్క కెనడాలోనే మన విద్యార్థులు 4.27 లక్షల మంది ఉన్నారు. 2013 నుంచి 2022 మధ్య పదేళ్ల కాలంలో కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుదల 260 శాతంగా ఉండటం గమనార్హం.

Tags:    

Similar News