కేసీఆర్ కి శని పట్టుకుందా...!?

ఆయన నాలుగు నెలల క్రితం వరకూ మధ్యాహ్నం మార్తాండుడుగా వెలిపోయారు. తేరిపారా ఆయనను చూడడం ఎవరి వశం అయ్యేది కాదు

Update: 2024-04-02 23:30 GMT

ఆయన నాలుగు నెలల క్రితం వరకూ మధ్యాహ్నం మార్తాండుడుగా వెలిపోయారు. తేరిపారా ఆయనను చూడడం ఎవరి వశం అయ్యేది కాదు. ఆ రాజభోగం, ఆ దర్జా ఆ అధికార శాసనం ఇవన్నీ చూస్తూండగానే కనుమరుగు అయిపోయాయి. ఓడలు బళ్లు అవుతాయని సామెతను కేసీఆర్ ని చూస్తే మరోసారి చెప్పుకోవాలి.

ఎలా ఉన్న కేసీఆర్ ఎలా అయిపోయారో అన్న చర్చ సాగుతోంది. తాను పట్టినదల్లా బంగారం అన్నట్లుగా కేసీఆర్ పొలిటికల్ టూర్ సాగింది. 1981లో కాంగ్రెస్ లో చేరిన కేసీఆర్ కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఎన్టీయార్

కంట్లో పడి టీడీపీ అభ్యర్ధిగా సిద్ధిపేట నుంచి పోటీ చేయడం అంటే ఆయన రాజకీయ పరుగు ఎలా మొదలైంది అన్నది అర్ధం అవుతుంది.

మొదటి ఎన్నికల్లో ఓటమి పాలు అయినా లీడర్ గా సక్సెస్ అయ్యారు. ఆ పునాది మీదనే ఆయన 2000 దాకా టీడీపీలో ఎదిగారు. 2001లో టీడీపీని వీడిన నాటికి కూడా ఆయన మాజీ మంత్రి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఇక తెలంగాణా రాష్ట్ర సమితి పెట్టాక దేశం మొత్తం ఆయన వైపు చూసేలా చేసుకున్నారు.

ఆ దూకుడు 2014 దాకా అప్రతిహతంగా కొనసాగింది. ఎన్ని సీట్లు ఎన్ని ఓట్లు నాటి టీఆర్ఎస్ రాబట్టింది అన్నది కాదు కేసీఆర్ అన్న మూడు అక్షరాలే నాడు తెలంగాణా అంతటా ప్రతిధనించాయి. ఆయనకు వ్యతిరేకంగా ఎంతటి పెద్ద వారు అయినా ఒక్క మాట కూడా అనలేని స్థితి ఉండేది. 2014లో సోలోగా అధికారంలోకి వచ్చి సీఎం అయిన కేసీఆర్ 2018లో మరింత ఎక్కువ మెజారిటీ సాధించి అద్వితీయంగా సీఎం అయిపోయారు.

ఇక వరసగా మూడవసారి సీఎం అయి కేసీఆర్ సౌత్ ఇండియాలో హిస్టరీ క్రియేట్ చేస్తారు అనుకుంటే 2023 చివరిలో జరిగిన ఎన్నికల్లో ఆయన ఘోరరంగా ఓటమి పాలు అయ్యారు. దాంతో ఆయనకు ఆనాడే శని పట్టిందా అన్న చర్చ సాగింది. కేసీఆర్ జాతకం బాగా లేదు అని కూడా అంతా అనుకున్నారు. పోనీ ఓటమి తరువాత అయినా నెమ్మదిగా కోలుకుంటారనుకుంటే ఆయన ఇంట్లో జారిపడి అనారోగ్యం పాలు అయ్యారు.

ఇక వరసబెట్టి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. కేసీఆర్ ప్రభుత్వం మీద విచారణలతో మొదలైన కధ కాస్తా ఇపుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మెడకు చుట్టుకున్నట్లు అవుతోంది. ఇది పెద్ద ఇష్యూగా మారబోతోంది. లిక్కర్ స్కాం లో కేసీఆర్ తనయ కవిత అరెస్ట్ కావడం ఆయనకు భారీ షాక్ గా చూడాలి.

ఇదిలా ఉంటే ఆయన పార్టీ నుంచి ఇతర పార్టీలలోకి వలసలు వెళ్తున్న నేతలలో బిగ్ షాట్స్ ఉన్నారు. రోజురోజుకు అలా చేరే వారి సంఖ్య పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. మరో వైపు ముంచుకొస్తున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి సరైన అభ్యర్ధులు దొరకడం లేదు. గులాబీ తోట వాడిపోతోంది. కేసీఆర్ లో మునుపటి జోష్ కనిపించడం లేదు.

ఇదంతా చూసిన వారు కార్ సార్ ని గట్టిగానే శని పట్టినట్లున్నారు అని అంటున్నారు. పార్టీ లోపలి వారు అయితే ఇదేమిటి ఇలా జగుతోందని నిట్టూరుస్తూంటే చేసుకున్న వారికి చేసుకున్నంత అంటున్నారు ప్రత్యర్ధులు నిష్టూరంగా. శని పట్టుకుంటే ఏడేండ్ల పాటు అని ఒక సామెత ఉంది. మరి ఇప్పట్లో బీఆర్ఎస్ కోలుకుంటుందా కేసీఆర్ మునుపటిలా దూకుడు చూపిస్తారా అంటే ఈ ప్రశ్నలకు జవాబు చెప్పేవారు అయితే కనిపించడం లేదు అంటున్నారు. మొత్తం మీద చూస్తే బీఆర్ఎస్ కి ఏదో అయింది అనే అంటున్నారు.

రాజకీయాల్లో ఎగిసిపడడాలు నేలకు జారడాలు కామన్ అయినా కేవలం నాలుగు నెలల కాలంలో ఇంతలా ఆకాశానికి పాతాళానికి తేడా లేకుండా జారిపోవడం అంటే బీఆర్ ఎస్ రాజకీయ సిరి మీదనే అందరికీ డౌట్లు వస్తున్నాయి. రాజకీయాలలో ఓటముల నుంచి గెలుపులు ఉంటాయి. కానీ మరీ పతనం అంచులు చూస్తే కనుక అది అసలుకే ఎసరు పెడుతుందని అంటున్నారు. ఇపుడు బీఆర్ఎస్ జాతకం ఎలా ఉందో అన్నదే ఆ పార్టీలో ఉన్న అందరి బెంగగా ఉందిట. ఏ క్షణం ఏమి జరుగుతుంది అన్న టెన్షన్ తోనే గులాబీ శిబిరం కాలం గడుపుతోంది అని అంటున్నారు.

Tags:    

Similar News