సిరిసిల్లాలో కాంగ్రెస్ కి బాహుబలి...!
ఈ పరిణామాల నేపధ్యంలో బలమైన అభ్యర్ధినే ఆయన మీద పోటీకి కాంగ్రెస్ రెడీ చేసి పెట్టింది అని అంటున్నారు.
తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ ఎత్తులు వేరే లెవెల్ లో ఉంటున్నాయి. గతంలో చేసిన తప్పులను ఏ మాత్రం చేయడం లేదు. వ్యూహాలను సైతం పదును పెట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తోంది. ఇక కాంగ్రెస్ బీయారెస్ లోని అగ్ర నాయక త్రయం మీద ఫుల్ ఫోకస్ పెట్టేసింది అని అంటున్నారు.
బీయారెస్ లో ఆ ముగ్గురూ టాప్ లీడర్స్ అంటే ముందుగా కేసీయార్ కనిపిస్తారు. అలాగే కేటీయార్, హరీష్ రావు తరువాత వరసలో వస్తారు. ఈసారి ఈ ముగ్గురి సీట్లలో వారిని ఊరికే వదిలేయకూడదని గట్టి అభ్యర్ధులను పోటీకి పెట్టడం ద్వారా పద్మవ్యూహంలో బిగించాలని కాంగ్రెస్ చూస్తోంది అని అంటున్నారు.
అందులో ముందుగా చూస్తే మంత్రి కేటీయార్ కనిపిస్తారు. ఆయన కేసీయార్ రాజకీయ వారసుడు మాత్రమే కాదు మూడవసారి బీయారెస్ తెలంగాణా ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్న వారు. దాంతో కాంగ్రెస్ కేటీయార్ ని గట్టిగా టార్గెట్ చేస్తోంది అని అంటున్నారు. ఆయన సొంత నియోజకవర్గం సిరిసిల్ల మీదనే కాంగ్రెస్ కన్నేసింది అని అంటున్నారు.
సిరిసిల్ల విషయానికి వస్తే 2009లో కేటీయార్ మొదటి సారి ఇక్కడ నుంచి గెలిచారు. అలా ఒక ఉప ఎన్నికతో కలిపి ఇప్పటికి నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నారు. తాజా ఎన్నికలతో ఆయన అయిదో సారి పోటీ చేస్తున్నారు. కేటీయార్కి 2014 ఎన్నికల్లో 53 వేల దాకా మెజారిటీ వస్తే 2018 నాటికి అది కాస్తా 89 వేల పై దాటింది.
ఈసారి కూడా గెలిచి తీరుతాను అని ధీమాతో కేటీయార్ ఉన్నారు. ఇటీవల కేసీయార్ సిరిసిల్లలో మీటింగ్ పెట్టి కేటీయార్ ని దీవించాలని కోరారు. అయితే బీయారెస్ మీద యాంటీ ఇంకెంబెన్సీ ఒక స్థాయిలో ఉంది. దాంతో రాజకీయంగా ఏమైనా జరగవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. దాంతో పాటు గతసారి సాధించిన భారీ మెజారిటీ కేటీయార్ కి ఈసారి రాకపోవచ్చు అని కూడా అంటున్నారు.
ఈ పరిణామాల నేపధ్యంలో బలమైన అభ్యర్ధినే ఆయన మీద పోటీకి కాంగ్రెస్ రెడీ చేసి పెట్టింది అని అంటున్నారు. 2018 ఎన్నికల్లో కేటీయార్ మీద కేకే మహేందర్ రెడ్డి పోటీ చేశారు. ఈసారి బిగ్ షాట్ గా ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పోటీకి దించాలని కాంగ్రెస్ చూస్తోంది అని అంటున్నారు.
ఆయనే కాంగ్రెస్ కురు వృద్ధుడు టి జీవన్ రెడ్డి అని అంటున్నారు. టీ జీవన్ రెడ్డి 1983లో టీడీపీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన ఉమ్మడి కరీం నగర్ జిల్లాలోని జగిత్యాల నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఏపీలో మూడు సార్లు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఉంటున్నారు.
మంచి మాటకారి, వ్యూహకర్త, జనంలో బలం ఉన్న నేత అయిన జీవన్ రెడ్డిని కేటీయార్ మీద పోటీకి దింపాలన్నది కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు. జీవన్ రెడ్డి అయితే కేటీయార్ గెలుపుని అడ్డుకోగలరని కాంగ్రెస్ భావిస్తోంది. కేటీయార్ తండ్రి కేసీయార్ సమకాలీనుడు అయిన జీవన్ రెడ్డి ప్రత్యర్ధి అయితే కేటీయార్ కూడా సిరిసిల్ల మీదనే పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు.
కాంగ్రెస్ కి కూడా అదే కావాల్సింది అని అంటున్నారు. కేటీయార్ తన సీటు మీద పూర్తి హామీతో ఉంటే తెలంగాణా మొత్తం ప్రచారం చేయడానికి వీలు అవుతుంది. అలా కాకుండా అక్కడే కుంపటి పెడితే కచ్చితంగా ఎక్కువ టైం సిరిసిల్లాలోనే గడపాలి. ఇక కేటీయార్ని ఓడించడం అన్నది ఫస్ట్ టార్గెట్, లేకపోతే మెజారిటీని దారుణంగా తగ్గించడం మరో టార్గెట్.
ఇలా ద్విముఖ్య వ్యూహంతో జీవన్ రెడ్డి వంటి బాహుబలిని కాంగ్రెస్ బరిలోకి దించబోతోంది అని అంటున్నారు. ఇక ఎటూ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఉన్నారు. ఆయన ఓడిపోయినా నష్టం లేకుండా కాంగ్రెస్ గెలిచిన తరువాత మంత్రి పదవిని కూడా హామీ ఇస్తున్నారు అని అంటున్నారు. అలా జీవన్ రెడ్డిని పోటీలోకి దించడం ద్వారా కేటీయార్ కి భారీ షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. మొత్తానికి అదే జరిగితే సిరిసిల్లాలో కేటీయార్ రాజకీయ సిరి ఎంతవరకు నిలబడుతుందో చూడాలని అంటున్నారు.