పవన్ తో బాలినేని, సామినేని... జగన్ పై కీలక వ్యాఖ్యలు!

ఇదే క్రమంలో ఒంగోలులో తనతో పాటు పలువురు నేతలు జనసేనలో చేరతారని చెప్పిన బాలినేని.. ఈ సందర్భంగా వైఎస్సార్ ని గుర్తు చేసుకున్నారు.

Update: 2024-09-19 14:29 GMT

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇది అంత సర్ ప్రైజ్ విషయం కాకపోయినా.. ఏపీ రాజకీయాల్లో మాత్రం అది అత్యంత చర్చనీయాంశం అనే చెప్పాలి. ఇందులో భాగంగా మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు.

అవును... ఒకప్పటి వైసీపీ కీలక నేత, వైఎస్ బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. అడిగిన వెంటనే పార్టీలోకి ఆహ్వానించిన జనసేన అధినేత పవన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు.

త్వరలో ఒంగోలులో కార్యక్రమం ఏర్పాటు చేసి పవన్ కల్యాణ్ సమక్షంలోనే జనసేనలో చేరనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా... పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పనిచేస్తానని.. అందరినీ కలుపుకొని జనసేన అభివృద్ధికి కృషిచేస్తానని బాలినేని తెలిపారు. పరిచయం లేకపోయినా పవన్ నా గురించి మంచిగా మాట్లాడారని బాలినేని అన్నారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బాలినేని. ఇందులో భాగంగా.. గతంలో నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైసీపీని వీడలేదని.. జగన్ ను నమ్మి ఆస్తులు పోగొట్టుకున్నానని.. సమావేశాల్లో ఏనాడూ జగన్ తన గురించి మాట్లాడలేదని.. తనకు పదవులు ముఖ్యం కాదని బాలినేని చెప్పుకొచ్చారు!


ఇదే క్రమంలో ఒంగోలులో తనతో పాటు పలువురు నేతలు జనసేనలో చేరతారని చెప్పిన బాలినేని.. ఈ సందర్భంగా వైఎస్సార్ ని గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా... వైఎస్ ఆశీర్వాదంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. ఆయన మరణానంతరం మంత్రి పదవిని వదిలి జగన్ వెంట నడిచినట్లు తెలిపారు.

తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబానికి అండగా ఉండటం కోసమే నాడు రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చానని.. తనతో పాటు 17 మంది రాజీనామాలు చేసి జగన్ వెంట నడిచారని అన్నారు. అయితే... నిత్యం విశ్వసనీయత అని చెప్పే జగన్ అలా వచ్చిన 17 మందిలో ఒక్కరికైనా మంత్రిపదవి కొనసాగించారా అని బాలినేని సూటిగా ప్రశ్నించారు.

మరోపక్క జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను త్వరలో జనసేన గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సామినేని... జగన్ పైనా, వైసీపీపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... వైసీపీలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని మొదలుపెట్టిన సామినేని... తన మనసుకు కష్టం కలిగినందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. పరిణామాలు చూస్తుంటే వైసీపీకి భవిష్యత్తు కనిపించడం లేదని.. జగన్ ను కలిసి అనేకసార్లు తమ పరిస్థితి చెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదని సామినేని తెలిపారు.

ఇక, ఈ ఇద్దరు నేతలు ఈ నెల 22 లేదా 24 తేదీల్లో జనసేన తీర్ధం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. దీంతో... ఇది వైసీపీకి బిగ్ షాక్ అనే అంటున్నారు పరిశీలకులు. ఈ సమయంలో... జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News