నామినేషన్ల వేళ సొంత అభ్యర్థికి టీడీపీ ఝలక్ !

అంతే కాదు మాడుగుల నుంచి ఎంపీ అభ్యర్ధిగా వైసీపీ తరఫున పోటీలో ఉన్న బూడి ముత్యాల నాయుడుకు గట్టి షాక్ ఇవ్వాలనే టీడీపీ బండారుని రంగంలోకి దింపింది అని అంటున్నారు.

Update: 2024-04-18 12:30 GMT

నామినేషన్ల పర్వానికి తెర లేచిన వేళ సొంత అభ్యర్థికి టీడీపీ ఝలక్ ఇచ్చేసింది. మాడుగులకు ప్రకటించిన అభ్యర్ధిని సడెన్ గా మార్చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అలకకు తగిన ఫలితం దక్కింది. ఆయనకు మాడుగుల టికెట్ దక్కింది. బండారు ఏకంగా నెల రోజుల నుంచి ఆయన తన నిరసనను తెలియచేస్తూనే ఉన్నారు. పెందుర్తి టికెట్ ని జనసేనకు కట్టబెట్టడం పట్ల బండారు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన పడిన మనస్తాపానికి ఆసుపత్రికి కూడా వెళ్లాల్సి వచ్చింది.

ఒక దశలో ఆయన తనకు ఈ రాజకీయాలు వద్దు అని ఒక పెద్ద దండం పెట్టేశారు. అయితే విశాఖ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి ఇటీవల వచ్చిన చంద్రబాబు బండారుతో మాట్లాడి నచ్చచెప్పారు. ఆ మీదట ఒక రాజీ ఫార్ములాను రూపొందించారు. దాని ప్రకారం బండారు మాడుగులకు షిఫ్ట్ అవుతున్నారు.

ఆయన మంచి ముహూర్తం చూసుకుని మరీ దేవుళ్ళకు మొక్కులు తీర్చుకుని మరీ మాడుగులకు చేరుకున్నారు. తనకు అధినాయకత్వం మాడుగుల టికెట్ ఇచ్చిందని బండారు చెప్పడం విశేషం. తన సొంత ప్రాంతం ఇదే అని కూడా ఆయన రిఫరెన్స్ ఇచ్చారు. తాను మాడుగుల అల్లుడిని మనవడిని అని కూడా క్లెయిం చేసుకున్నారు. మాడుగులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

తాను మాడుగుల గెలిచి టీడీపీకి కానుక ఇస్తాను అని అంటున్నారు. ఇదిలా ఉంటే మాడుగుల ఒకనాడు టీడీపీకి కంచుకోట. అయితే 2014 నుంచి ఆ సీటు వైసీపీకి కంచుకోటగా మారింది. వరసగా రెండు సార్లు అక్కడ నుంచి బూడి ముత్యాలనాయుడు గెలిచారు. ఇపుడు ఆయన ఎంపీగా పోటీలో ఉన్నారు. ఆయన కుమార్తె ఈర్లె అనూరాధ మాడుగుల ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు.

ఆమె రాజకీయంగా జూనియర్. మరి బండారు అనేక ఎన్నికల యుద్ధాలను చూసిన యోధుడు. దాంతో ఈ ఇద్దరి మధ్యన టఫ్ ఫైట్ సాగుతుందా అన్న చర్చకు తెర లేస్తోంది. మరో వైపు చూస్తే బండారుకు బిగ్ టాస్క్ ఇచ్చి టీడీపీ హై కమాండ్ పంపించింది అని అంటున్నారు. మాడుగుల మళ్లీ టీడీపీ ఖాతాలో పడేలా చూడడమే ఆయనకు ఇచ్చిన బాధ్యత.

అంతే కాదు మాడుగుల నుంచి ఎంపీ అభ్యర్ధిగా వైసీపీ తరఫున పోటీలో ఉన్న బూడి ముత్యాల నాయుడుకు గట్టి షాక్ ఇవ్వాలనే టీడీపీ బండారుని రంగంలోకి దింపింది అని అంటున్నారు. వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్లుగా మాడుగుల అసెంబ్లీతో పాటు అనకాపల్లి ఎంపీ సీటు కూడా గెలిచేందుకు టీడీపీ స్కెచ్ గీసింది అంటున్నారు.

అయితే మాడుగుల టీడీపీలో వర్గ పోరు ఉంది. దాంతో మూడు ముక్కలాటగా ఉన్న ఈ పోరులో టికెట్ బండారుకి దక్కింది. ఎన్నారై పైలా ప్రసాదరావుకు టికెట్ ఇచ్చేశారు. ఆయన ఇప్పటికి అయితే ప్రచారం ముమ్మరం చేశారు ఇపుడు ఆయనను పక్కన పెట్టారు. దాంతో ఆయన ఏ విధంగా డెసిషన్ తీసుకుంటారో తెలియదు. మరో వైపు చూస్తే మాడుగుల ఎమ్మెల్యే టికెట్ ఆశించిన గవిరెడ్డి రామానాయుడు పీవీజీ కుమార్ లు బండారుకు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ మొత్తం మీద మాడుగుల సీటు అంటే వెరీ టఫ్ కాంపిటేషన్ అని చెప్పాలని అంటున్నారు.

Tags:    

Similar News