బండిని ఇలా బుజ్జ‌గించారా?

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ క‌దులుతోంది

Update: 2023-07-29 07:56 GMT

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ క‌దులుతోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర అధ్య‌క్షుణ్ని మార్చింది. బండి సంజ‌య్‌ను త‌ప్పించి కిష‌న్‌రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించిన తెలిసిందే. దీంతో బండి సంజ‌య్ వ‌ర్గం అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది. బ‌య‌ట‌కు చెప్ప‌న‌ప్ప‌టికీ సంజ‌య్ కూడా లోప‌ల హ‌ర్ట్ అయ్యార‌ని అంటున్నారు. వాస్త‌వంగా చెప్పాలంటే సంజ‌య్ దూకుడుతోనే తెలంగాణ‌లో పార్టీకి జోష్ వ‌చ్చింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

అలాంటి బండి సంజ‌య్‌ను అధ్య‌క్షుడిగా తొల‌గించ‌డం ఊహించ‌ని ప‌రిణామ‌మే. దీంతో చెల‌రేగిన అసంతృప్తి సెగ‌ను ఇప్పుడు చ‌ల్లార్చే ప‌నిలో బీజేపీ అధిష్ఠానం నిగ్న‌మైంది. ముందుగా సంజ‌య్‌కు కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. ఇటీవ‌ల అగ్ర‌నాయ‌కుడు, హోం మంత్రి అమిత్ షాతో బండి భేటీ కావ‌డంతో ఈ ప్ర‌చారానికి ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. కానీ ఇప్పుడు పార్టీ ప‌రంగా సంజ‌య్‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టార‌నే చెప్పాలి.

బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా బండి సంజ‌య్‌, రాధా మోహ‌న్ అగ‌ర్వాల్‌ను నియ‌మించారు. మ‌రి ఈ ప‌ద‌వితో బండి సంజ‌య్ వ‌ర్గం తృప్తి చెందుతుందా? అన్న‌ది ఇక్క‌డ అస‌లైన ప్ర‌శ్న‌. జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అని చెప్పుకోవ‌డానికి బాగానే ఉంటుంది.

కానీ ఇక్క‌డ రాష్ట్రంలో అధ్య‌క్షుడిగా కిష‌న్‌రెడ్డి ఉండ‌గా.. సంజ‌య్‌కి త‌గిన ప్రాధాన్య‌త ద‌క్కుతుందా? లేదా అన్న‌ది గ‌మ‌నించాల్సి ఉంటుంద‌ని రాజకీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తానికి ఓ జాతీయ స్థాయి ప‌ద‌వితో ఇప్ప‌టికైతే బండి సంజ‌య్‌ను అధిష్ఠానం బుజ్జ‌గిచ్చిన‌ట్లేన‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News