శేషాచలం అడవుల్లో హల్చల్ చేస్తున్న బంగారు బల్లి.. వెనక ఇంత స్టోరీ ఉందా!

మన చుట్టుపక్కల చాలా అసాధారణమైన సంఘటనలు జరగడం మనం గమనిస్తూ ఉంటాం.

Update: 2024-09-06 10:30 GMT

మన చుట్టుపక్కల చాలా అసాధారణమైన సంఘటనలు జరగడం మనం గమనిస్తూ ఉంటాం. అలాంటి ఒక అద్భుతమైన సంఘటన మన తిరుపతిలోని శేషాచలం అడవుల్లో చోటు చేసుకుంది. అరుదైన జాతికి చెందిన ఓ బంగారు బల్లి గురువారం నాడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లకు కనిపించింది. ఈ బంగారు బల్లి ఎక్కువగా చీకటిగా ఉన్న ప్రదేశాలు, రాతి బండల మధ్య నివసిస్తుందని తెలుస్తోంది.


నిజానికి ఈ బల్లి ఎప్పుడో అంతరించిపోయింది అని అందరూ భావించారు. అందుకే వన్యప్రాణుల రక్షణ చట్టం 1972లో ఈ గోల్డెన్ గెకో గా పిలవబడే బల్లిని అటవీశాఖ షెడ్యూల్ వన్ కింద పరిగణించింది. పసిడి వర్ణంలో మెరిసిపోయే ఈ బల్లుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఇవి చాలా వరకు కనుమరుగైపోయాయి. ఈ జాతికి చెందిన బల్లులు భారతదేశంలోని తూర్పు కనుమలకు చెందినవి. ఇవి అంతరించిపోయిన సుమారు 100 సంవత్సరాల తరువాత అనుకోకుండా తిరుపతి సమీప ప్రాంతాల్లోని కొండలలో ఇవి కొందరికి కనపడ్డాయి.

ఇప్పుడు తిరిగి ఇదే జాతికి సంబంధించిన బల్లులు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఫోటోకి చిక్కాయి. ఇండియన్ గోల్డెన్ గెకో లేదా మొదటిసారిగా శేషాచలం బయోస్పియర్ రిజర్వ్‌లో భాగమైన తిరుపతిలోని కపిల తీర్థం సమీపంలో కనిపించాయి. ఇవి ప్రధానంగా రాత్రిపూట బయటకు రావడంతో పగటిపూట అరుదుగా కనిపిస్తాయి. అయితే అందరూ భావించినట్లుగా ఇవి ఎల్లవేళలా పసిడివర్ణంతో మెరిసిపోవు. వీటి రంగులు మనం అనుకున్న గోల్డ్ కలర్ కంటే కాస్త భిన్నంగా ఉంటాయి.

ఈ జాతికి సంబంధించిన బలుల చర్మం పల్చగా ఉండడంతో వేడిని ఎక్కువగా తట్టుకోలేవు. అందుకే ఇవి ఎక్కువ శాతం చల్లని నీటి ప్రదేశాలు, రాతి గుహలు దగ్గర కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం ఈ బల్లి జాతికి చెందిన జనాభా లెక్కలు, అలవాట్లు తెలుసుకోవడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి కేవలం తిరుపతి శేషాచలం అడవుల్లోనే కాకుండా తమిళనాడు, ఒడిస్సా, విశాఖపట్నం లాంటి కొన్ని ప్రాంతాలలో కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ జాతికి చెందిన ఆడబల్లులు గుడ్లను ఎక్కువగా తేమతో కూడిన ప్రాంతాలలో పెడతాయి. ఇవి చూడడానికి మామూలు బల్లుల్లాగా కనిపించినప్పటికీ చర్మం, పాదాల దగ్గర తేడా స్పష్టంగా కనిపిస్తుంది. దీని తల కాస్త పెద్దదిగా అండాకారంలో ఉంటుంది. ఒక బల్లి గురించి ఇంత రీసర్చ్ అవసరమా అని మీరు అనుకోవచ్చు.. మన చుట్టూ ఎన్నో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. అయితే ఇలా ఎన్నో జాతులు అంతరించడం వల్ల ప్రకృతిపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. తిరిగి దాని పర్యవసానం మనమే కదా భరించాలి.. కాబట్టి ప్రకృతి రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ మన బాధ్యతగా స్వీకరించాలి. అప్పుడే మనం మన భావితరాల వారికి మంచి జీవితాన్ని అందించగలుగుతాము.

Tags:    

Similar News