బర్రెలక్కను ముందుపెట్టి పొలిటికల్ స్ట్రాటజీ?

తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 119 నియోజకవర్గాల్లో గజ్వేల్, కామారెడ్డి, కొడంగల్, సిరిసిల్ల, సిద్దిపేట తదితర సీట్లు ప్రముఖమైనవి

Update: 2023-11-27 02:45 GMT

తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 119 నియోజకవర్గాల్లో గజ్వేల్, కామారెడ్డి, కొడంగల్, సిరిసిల్ల, సిద్దిపేట తదితర సీట్లు ప్రముఖమైనవి. కానీ, మరొక నియోజకవర్గం కూడా వార్తల్లో నిలుస్తోంది. కారణం.. అక్కడ ఓ నిరుద్యోగ అభ్యర్థి.. అందులోనూ యువతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండడమే. అయితే.. ఆమేమీ రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి కాదు. అసలు చెప్పాలంటే.. ధనబలంతో కూడిన ఈ కాలపు రాజకీయాల్లో మనగలిగే వ్యక్తే కాదు. అయినా సరే ఆమెకు రాష్ట్రవ్యాప్తంగా పేరొచ్చింది. బహుశా పొరుగున ఉన్న ఏపీలోనూ ఆమె పేరు తెలిసిపోయి ఉంటుందనడంలో సందేహం లేదు.

సోషల్ మీడియాలో పాపులర్

బర్రెలక్క అలియాస్ శిరీష.. మూడేళ్ల కిందట ''హాయ్ ఫ్రెండ్స్.చూడండి ఫ్రెండ్స్..'' అంటూ యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీచేయకపోవడంతో బర్రెలను కాస్తున్నట్లుగా అందులో చెప్పుకొచ్చింది. దీంతోనే ఆమె ఫేమస్ అయిపోయింది. బర్రెలక్కగా పేరుతెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె ఎన్ని వీడియోలు చేసిందో లెక్కలేదు కానీ.. బర్రెలను కాస్తున్న వీడియోనే మహా పాపులర్ చేసింది. అలాంటి బర్రెలక్క తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగింది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆమె ప్రచారం కూడా చేస్తోంది. భద్రతకు సంబంధించిన అంశాలపై హైకోర్టుకు వెళ్లి మరీ ఆదేశాలు పొందింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటివారు సైతం బర్రెలక్కకు సంఘీభావం తెలపడం గమనార్హం.

పోటీ వెనుక పోల్ స్ట్రాటజీ..?

తెలంగాణ ఏర్పాటు నేపథ్యం.. నీళ్లు, నిధులు, నియామకాలు. ఇందులో మరీ ముఖ్యమైన నియామకాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అందులోనూ పోటీ పరీక్ష పేపర్ల లీక్ తో పదేపదే పరీక్షలు వాయిదా పడడంతో యువత ఆగ్రహంగా ఉన్నారు. అంతకుముందు కొన్నేళ్లపాటు ఉద్యోగ నియామకాలనే చేపట్టలేదు. ఇప్పుడు అచ్చంగా నిరుద్యోగ వర్గానికే చెందిన బర్రెలక్క పోటీకి నిలవడంతో సోషల్ మీడియా, మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే, శిరీష స్వచ్ఛదంగానే పోటీకి దిగుతున్నా.. నిరుద్యోగ సమస్యను ప్రొజెక్ట్ చేయడం అనే పోల్ స్ట్రాటజీకి సాధనంగా మారారు. ప్రతిపక్షాలు బీఆర్ఎస్ సర్కారును తీవ్రంగా విమర్శిస్తున్న ఉద్యోగ నియామకాల అంశం బర్రెలక్క రూపంలో వారికి అనుకోని వరంగా మారిందనడంలో సందేహం లేదు. కాగా, పొలిటికల్ స్ట్రాటజీ కిందనే బర్రెలక్కను ఎవరైనా ముందుకుతెచ్చారా? అనే అనుమానాన్నీ కొందరు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి నిరుద్యోగ సమస్యను రాజకీయ పార్టీలు ఎంతగా ప్రస్తావించినా ''అందరూ ఒకే తాను ముక్కలే కదా?'' అని కొట్టేస్తారు. ప్రభుత్వం సైతం తిప్పికొడుతుంది. అందుకనే, రాజకీయ ప్రమేయం లేని వ్యక్తితో ఈ సమస్యను చెప్పించి.. దానిని క్షేత్ర స్థాయిలో ప్రచారంగా మలుచుకునే వ్యూహం ఏమైనా ఉందా? అనే భావననూ వ్యక్తం చేస్తున్నారు.

యాక్సిడెంటల్ గానే నామినేషన్ వేసిన బర్రెలక్క అలియాస్ శిరీష ఇప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గంలో కొన్ని ఓట్లయినా సాధించేలా ఉన్నారని సమాచారం. ఈ ఓట్లు ఓ ప్రధాన పార్టీ అభ్యర్థికి నష్టంగా మారతాయని స్థానికులు కొందరు తెలిపారు.

Tags:    

Similar News