'కడప రెడ్డమ్మ' ఈ వీడియో చూసారా ?

కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో మరోసారి గొడవ చోటు చేసుకుంది.

Update: 2024-12-23 07:45 GMT

కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో మరోసారి గొడవ చోటు చేసుకుంది. గత నెలలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూర్చోడానికి కూర్చీవేయకపోవడంతో వివాదం జరిగింది. ఈ నెలలోనూ అదే సీన్ రిపీట్ అయింది. దీంతో సమావేశం ముగిసేవరకు తాను నిల్చునే ఉంటానని తేల్చిచెప్పారు ఎమ్మెల్యే మాధవీరెడ్డి.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నా, స్థానిక సంస్థల్లో వైసీపీ నేతలే పదవుల్లో ఉన్నారు. దీంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రొటోకాల్ రగడం జరుగుతోంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కేంద్రం కడపలో ఈ వివాదం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. కడప కార్పొరేషన్లో వైసీపీ ఆధిపత్యం కొనసాగుతుండగా, ఎమ్మెల్మే మాధవీరెడ్డిది అధికార పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచన నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి కార్పొరేషన్ను తన గుప్పెట్లోకి తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే వైసీపీకి చెందిన ఏడుగురు కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకున్నారు. దీంతో ఎమ్మెల్యే స్పీడ్ కు బ్రేకులు వేసేలా వైసీపీ కూడా తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తుంది. నిబంధనలు చూపి గత నెలలో జరిగిన కార్పొరేషన్ సాధారణ సర్వసభ్య సమావేశంలో వేదికపై ఎమ్మెల్యేకు కుర్చీవేయలేదు. అంతకుముందు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేకు మేయర్ పక్కనే కుర్చీవేశారు. నవంబర్ నుంచి ఎమ్మెల్యేకు సీటు వేయకపోవడం మొదలైంది. డిసెంబర్ సమావేశంలోనూ సేమ్ సీన్ రిపీట్ కావడంతో 23వ తేదీ సోమవారం జరిగిన సమావేశం రభసగా మారింది.

నెలనెలా జరిగే కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాధవిరెడ్డి తనకు సీటు కేటాయించకపోవడంపై మేయర్ పై మండిపడ్డారు. తనకు కుర్చీవేసేంతవరకు నిల్చునే ఉంటానని ఎమ్మెల్యే పోడియం వద్ద నిరసనకు దిగారు. మహిళలను అవమానిస్తే మీ అధినేతకు సంతోషమా అంటూ ప్రశ్నించారు. తన విషయంలో ప్రొటోకాల్ పాటించడం లేదని కార్పొరేషన్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి.

దీంతో మేయర్, మాధవీరెడ్డి మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఉద్దేశపూర్వకంగానే తనకు కుర్చీ వేయలేదని, మేయర్ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. వైసీపీ పాలనలో మేయర్ కుడి, ఎడమ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని సమావేశాలు నిర్వహించేవారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు కుర్చీవేయకపోవడంలో ఆంతర్యమేంటి? కడప అభివృద్ధిని కుంటు పరిచారు. ఇక్కడ జరుగుతున్న అవినీతిపై మాట్లాడాలని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో మేయర్ సురేశ్ బాబు, ఎమ్మెల్యే మధ్య వాదోపవాదాలు జరిగాయి. మేయర్ కుర్చీకి ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ కార్పొరేటర్లు మోహరించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్వల్ప తోపులాటకు దారితీసింది.



Tags:    

Similar News